అప్పుడు 610…ఇప్పుడు 1400 మంది
130 శాతం పెరిగిన సంఖ్య
బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచే అధికం
అంతర్జాతీయ వర్సిటీల్లో
పెరగనున్న విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజాన్ని మార్చే ఏకైక ఆయుధం విద్య. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాలు మారాలన్నా.. అందరితో సమాన అవకాశాలు దక్కించుకుని వృద్ధిలోకి రావాలన్నా.. ఆయా వర్గాలను విద్యావంతులను చేయడమే ఏకైక మార్గమని మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయులు విశ్వసించడమే కాదు.. అందుకోసం ఎంతో కృషి చేశారు. ఆ మహానీయుల స్ఫూర్తిని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో వెల్లడించింది. బీసీ రిజర్వేషన్లు పెంచడం, ఎస్సీ వర్గీకరణ వంటి విధాన నిర్ణయాలకే పరిమితం కాకుండా వారి బిడ్డలను ప్రయోజకులను చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తోందని సీఎంవో వెల్లడించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
విద్యార్థుల కల సాకారం..
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యా నిధి వంటి పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధులకు అంతర్జాతీయ వర్సిటీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చదివేందుకు ప్రభుత్వం స్కాలర్‌షిప్ రూపంలో చేయూతను అందిస్తోంది. ఈ పథకాలు అమల్లోకి వచ్చినప్పటితో పోలిస్తే ఆశావహుల సంఖ్య రెట్టింపైంది. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తద్వారా వేలాది మంది అర్హులైన విద్యార్థులు విదేశీ విద్యానిధి పథకానికి దూరమై ఉన్నత విద్యను పొందలేకపోయారు. విదేశాల్లో ఉన్నత చదువులు చాలామంది విద్యార్థుల ఆకాంక్ష. ఖర్చు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రతిభ ఉన్నా.. ఆ దిశగా ఆలోచన చేయరు. అలాంటి వారికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాలు ఎంతో ఉపయోగం. అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిభ ఉండి, ఉన్నత విద్యకు దూరమవుతున్న ఆయా వర్గాల విద్యార్థులకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. వారి జీవితాలకు గేమ్ ఛేంజర్‌గా నిలిచే ఇటువంటి పథకాలను ఆదర్శంగా అమలు చేయాలనే ఉద్దేశంతో లబ్దిదారులకు మంజూరు చేసే స్కాలర్‌షిప్‌ల సంఖ్య రెట్టింపు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా విదేశీ వర్సీటిల్లో చదివే తెలంగాణ విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. ఫలితంగా ఈ మూడు పథకాల కింద గతంలో లబ్ది పొందే వారు 1,110 అయితే, ప్రస్తుతం ఆ సంఖ్య 1,900కి చేరింది. గతంలో మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద 300 మంది బీసీ విద్యార్ధులకు మాత్రమే అవకాశం కల్పించే వారు. ఇందులో ఈబీసీల వాటా 15. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ సంఖ్యను 700కి పెంచింది. ఇందులో 500 బీసీ విద్యార్థులకు, 200 ఈబీసీలకు కేటాయించారు. అంటే లబ్దిపొందే బీసీ విద్యార్థుల సంఖ్య దాదాపు 133 శాతం పెరిగింది. ఇప్పటికే బీసీ-సీ, బీసీ-ఈ వర్గాలకు చెందిన 500 మంది విద్యార్థులు లబ్ది పొందుతున్నారు. మొత్తంగా చూస్తే ఏడాదికి 1000 మంది లబ్ది పొందుతారు.
138శాతం పెరిగిన ఎస్సీ విద్యార్థులు
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో 210 మంది ఎస్సీ విద్యార్ధులకు అవకాశం కల్పించే వారు. ప్రజా ప్రభుత్వం ఈ సంఖ్యను 500కి పెంచడంతో ఆ సంఖ్య దాదాపు 138 శాతం పెరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో 100 మంది ఎస్టీ విద్యార్ధులకు అవకాశం కల్పించే వారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంఖ్యను 200కి పెంచింది. అంటే లబ్దిపొందే ఎస్టీ విద్యార్థుల సంఖ్య దాదాపు 100 శాతం పెరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టింపు సంక్షేమంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల జీవితాల్లో మార్పు కోసం చిత్తశుద్ధితో పని చేస్తోంది.
ఓవర్సీస్ విద్యానిధికి పెరిగిన లబ్దిదారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES