- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి
నవతెలంగాణ-వనపర్తి: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చి,అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అందించిన సందేశాన్ని చదివి గ్రామ ప్రజలకు వినిపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రెండున్నర ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చదివి వినిపించారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చి అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లాలోని 268 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు. గ్రామంలో ప్రజలకు జరిగిన మంచిని తెలియజేయడమే కాకుండా, ఇంకా గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాల విషయాలని గ్రామసభ ముందు ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా శక్తి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్, ఉచిత చీరల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల మన్ననలను అందుకుంటుందన్నారు. తన స్వగ్రామమైన జయన్న తిరుమలాపూర్ లో 98 మంది రైతులకు గాను మొత్తం రూ. 85.63 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 364 మంది రైతులకు గాను 846 ఎకరాలకు రూ. 50.82 లక్షలను పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను అందించడం జరిగిందన్నారు. గ్రామంలో మొత్తం 436 రేషన్ కార్డులు ఉండగా కొత్తగా 36 రేషన్ కార్డులను జారీ చేసినట్లు తెలియజేశారు. పేద ప్రజలు కరెంటు బిల్లు భారాన్ని మోయకుండా ఇబ్బందులను తొలగిస్తూ గృహ జ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడం జరుగుతుందని తెలియజేశారు.

గ్రామంలో 214 మంది లబ్ధిదారులు గృహజ్యోతి ఫలాలను పొందుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కృషి వల్ల ప్రస్తుతం చెరువులు కుంటలు నిండుగా నిండి భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీఛార్జి అయినట్లు తెలిపారు. వీరికే కాకుండా రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. అర్హులైన వారు గ్రామసభలో తమకు కావాల్సిన సంక్షేమ పథకాలకు హెల్ప్ డెస్క్ వద్ద అర్జీలు పెట్టుకోవచ్చు అని సూచించారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే జయన తిరుమలాపూర్ గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, నిర్మాణం చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న పాఠశాలలు పదో తరగతి వరకు అప్డేట్ చేసి ఉన్నత పాఠశాల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలని చదివించడం ద్వారానే మంచి, అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపులను లేకుండా చేసేందుకు మహిళలు అందరూ నడుం బిగించాలని సూచించారు. తిరుమలాపురం గ్రామానికి జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించే విధంగా నూతన పాలకవర్గం పరిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈ రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించింది, ఏ విధమైన అభివృద్ధి చేసింది అనే విషయాలను ప్రజలకు వివరించడమే కాకుండా, ఇంకా ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకునేందుకే ఈ గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, గృహ జ్యోతి, రేషన్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను ప్రజలకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా రూ. 480 కోట్లతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా 1.75 లక్షల మంది రైతులకు రూ. 250 కోట్లతో రైతు భరోసా అందించడం జరిగిందన్నారు.
తిరుమలాపూర్ గ్రామం విషయానికి వస్తే గ్రామంలో 12 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మొత్తం 129 మంది రైతుల నుంచి 2025-26 ఖరీఫ్ పంట కొనుగోలు చేసి రూ. 1.55 లక్షలు రైతుల ఖాతాలో వేయడం జరిగిందన్నారు. 262 మంది మహిళలకు ఏకరూప చీరలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. 24 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడు లక్షల రూపాయల వడ్డీలేని రుణాలు చేయడం జరిగిందన్నారు. వారికి గ్రామానికి కావాల్సిన తాగునీటి వసతి, సిసి రోడ్లు, డ్రైనేజీలు వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇంకా సంక్షేమ పథకాల లబ్ధి కావాల్సిన వారు గ్రామసభ హెల్ప్ డెస్క్ లో అర్జీ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి గోపాల్, ఉప సర్పంచ్ రాజు, గ్రామ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




