– ఢిల్లీలో రాజకీయ దుమారం
– కేంద్రం ఆదేశాల మేరకే ఈసీ పని చేస్తుందని ప్రతిపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోం సెక్రెటరీలను బదిలీ చేసింది. దీనిపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ బదిలీలపై ఢిల్లీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే కేంద్రం ఎన్నికల సంఘం పని చేస్తుందని ఈ బదిలీలు మరోసారి రుజువు చేశాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ వద్ద విలేకరులతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ‘బీజేపీ తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో కీలకమైన అధికారులను తొలగిస్తుంది’ అని విమర్శించారు. ‘అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతీసారీ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వం ఢిల్లీలోని పార్టీ (బీజేపీ)ది కాకపోతే.. వారు చేసే మొదటి పని ప్రధాన కార్యదర్శి, డిజిపిని తొలగించడం. ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుని ఈ అధికారులను బదిలీ చేసిఉండాలి’ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే ఇలాంటి బదిలీలు జరుగుతాయని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి బదిలీలు ఎందుకు జరగలేదని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో డీజీపీని ఎప్పుడూ తొలగించలేదు. ఎన్నికల కమిషన్‌కు అనేకసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన కుటుంబ సభ్యులకు చెందిన అధికారులను కూడా తొలగించలేదు’ అని యాదవ్ గుర్తుచేశారు. ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశం మేరకు పనిచేస్తోందని విమర్శించారు. టీఎంసీ నాయకులు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. బీజేపీకి ఈసీ ఒక విభాగంగా పనిచేస్తోందని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ ఆరోపించారు. ఉదయం 4 గంటలకు సీఎస్, డీజీపీలను బదిలీ చేయడం ఈసీ తన అధికారాలను దుర్వినియోగం చేయడంగా టీఎంసీకు చెందిన మరో ఎంపీ సాగరిక ఘోష్ విమర్శించారు.ఆదివారం బెంగాల్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. దీని తరువాత కొన్ని గంటల్లో బెంగాల్ సీఎస్ నందని చక్రవర్తి, హోం సెక్రెటరీ జగదీశ్ ప్రసాద్ మీనా, కొల్‌కతా పోలీస్ కమిషనర్ సుప్రాతిమ్ సర్కార్‌లను బదిలీ చేసింది. నూతన సీఎస్‌గా 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నారియాలను, హోం సెక్రెటరీగా 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంఘమిత్ర ఘోష్‌ను నియమించింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా అజరు కుమార్ నంద్‌ను నియమించింది.
బెంగాల్ సీఎస్, హోం సెక్రెటరీ బదిలీ
- Advertisement -
- Advertisement -



