సన్‌రైజర్స్‌పై 6 వికెట్లతో గెలుపు
ఛేదనలో పడిక్కల్ ఫటాఫట్
హైదరాబాద్ 201/9
బెంగళూరు 203/4
ఐపీఎల్ 19కు అదిరే ఆరంభం. బ్యాటర్లు మెరవటంతో చిన్నస్వామి స్టేడియం ఊగిపోగా.. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. ఇషాన్ కిషన్ (80) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ 201 పరుగులు చేసినా.. ఛేదనలో దేవదత్ పడిక్కల్ (61), రజత్ పాటిదార్ (31) ఫటాఫట్ ఇన్నింగ్స్‌లతో బెంగళూరుకు విజయాన్ని కట్టబెట్టారు. విరాట్ కోహ్లి (69 నాటౌట్) తనదైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
నవతెలంగాణ-బెంగళూరు
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 19ను విజయంతో ఆరంభించింది. దేవదత్ పడిక్కల్ (61, 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (69 నాటౌట్, 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) సహా రజత్ పాటిదార్ (31, 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఛేదనలో దంచికొట్టారు. బ్యాటర్లు మెరవటంతో 202 పరుగుల లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో 26 బంతులు ఉండగానే ఛేదించింది. 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. దేవదత్ పడిక్కల్ దండెత్తగా పవర్‌ప్లేలోనే మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వచ్చేసింది. 6 ఓవర్ల తర్వాత 76/1తో నిలిచిన ఆర్సీబీ..మిడిల్ ఓవర్లలోనూ దంచికొట్టింది.
కోహ్లి ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడినా.. ఆఖర్లో జూలు విదిల్చాడు. ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే 50 పరుగులు పిండుకున్నాడు. పాటిదార్ పిడుగులా విరుచుకుపడి 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో జూలు విదిల్చాడు. జితేశ్ శర్మ (0) నిరాశపరిచినా.. టిమ్ డెవిడ్ (16 నాటౌట్, 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) జతగా విరాట్ కోహ్లి 15.4 ఓవర్లలోనే లాంఛనం ముగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 201/9 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (80, 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా.. అనికెత్ వర్మ (43, 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (31, 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆర్సీబీ పేసర్లు జాకబ్ డఫ్ఫీ (3/22), రొమారియో షెఫర్డ్ (3/54) మూడు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
రాణించిన ఇషాన్ కిషన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్‌కు ఆరంభం కలిసి రాలేదు. ఆరంగ్రేట బౌలర్ జాకబ్ డఫ్ఫీ (3/22) ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసి ఆరెంజ్ ఆర్మీని ఒత్తిడిలోకి నెట్టాడు. అభిషేక్ శర్మ (7), ట్రావిశ్ హెడ్ (11) ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. నితీశ్ కుమార్ రెడ్డి (1) సైతం నిరాశపరిచాడు. 29/3తో కష్టాల్లో కూరుకున్న సన్‌రైజర్స్‌ను కెప్టెన్ ఇషాన్ కిషన్ (80) ఆదుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (31)తో కలిసి నాల్గో వికెట్‌కు 97 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఐదు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లతో మెరిసిన కిషన్.. డెత్ ఓవర్లలో వికెట్ కోల్పోయాడు. ఓ సిక్సర్, రెండు ఫోర్లతో జోరందుకున్న క్లాసెన్‌ను ఫిల్ సాల్ట్ అద్భుత క్యాచ్‌తో వెనక్కి పంపించాడు. ఇషాన్, క్లాసెన్ నిష్క్రమణతో సన్‌రైజర్స్ దూకుడు తగ్గినా.. అనికెత్ వర్మ (43) ధనాధన్‌తో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. సాలిల్ అరోర (9), హర్ష్ దూబె (3), హర్షల్ పటేల్ (0) నిరాశపరిచారు. 4 సిక్సర్లు, 3 ఫోర్లతో విరుచుకుపడిన అనికెత్ వర్మ డెత్ ఓవర్లలో ధనాధన్ చూపించాడు. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, రోమారియో షెఫర్డ్ (3/54) మూడేసి వికెట్లు పడగొట్టారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది.


