విద్యార్థుల గోస రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా..?
బాస్ పథకం బాధిత పేరెంట్స్
కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
బెస్ట్ అవైలబుల్ స్కీం కింద చదువుకుంటున్న విద్యార్ధుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బెస్ట్ అవైలబుల్ స్కీం బాధిత పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి.. అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధర్నా వద్ద స్కీమ్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు బొర్రా నాగరాజు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు 25 సంవత్సరాల క్రితం బెస్ట్ అవైలబుల్ స్కీంను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ప్రస్తుతం స్కీం కింద చదువుకుంటున్న విద్యార్ధులకు ఇవ్వాల్సిన నిధులను మూడేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.220 కోట్లు ప్రయివేటు పాఠశాలలకు బకాయి పడిందని అన్నారు. దళిత, గిరిజన, విద్యార్థి సంఘాలు ఏడాది కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడంతో ఈ పథకంలోని విద్యార్థులకు విద్యతో పాటు భోజనం, వసతి కల్పించలేకపోతున్నామని ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తూ అక్టోబర్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించేంతవరకూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించకపోవడంతో పాఠశాలల బయటే పిల్లలు, వారి తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల మంది దళిత, గిరిజన విద్యార్థులు చదువుకు దూరమై రోడ్డున పడ్డా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, గిరిజన ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కాగా, వీరికి పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, బీఎస్పీ ఈసీ మెంబర్, అడ్వకేట్ ఈశ్వర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఎన్సీపీ జిల్లా కార్యదర్శి విట్టల్ నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, ఏఐపీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి డాక్టర్ కర్కా గణేష్, డీఎస్‌ఎఫ్ జీవన్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సిరివెని సంతోష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు విజయకుమార్, విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES