Sunday, May 11, 2025
Homeసోపతిఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డుల చిత్రం

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డుల చిత్రం

- Advertisement -

మన జీవితాలకు అర్ధం ఏంటనే ప్రశ్న చాలా తక్కువ మందికి కలుగుతుంది. ప్రపంచం చాలా సంక్లిష్టమైన వాతావరణంతోనూ మానవ సంబంధాలతోనూ నిండి ఉంటుంది. వీటి మధ్య మనిషి తాను నిజం అని నమ్మిన భావపరంపరలో కొట్టుకుపోతూ చాలా కాలం జీవించేస్తాడు. కాని జీవితం చరమాంకంలో అవేవీ అర్ధం ఉన్నవాటిగా కనిపించవు. మనుషుల ఆలోచనలు, కోరికలు, వారి జీవన ప్రమాణాలన్నీ కూడా సమాజంలోని ఇతర ప్రభావాల నడుమ చిక్కుకుని రూపం దాల్చేవే. అవి నిజంగా ఆనందం ఇచ్చేవి కాకపోవచ్చు. కాని అవే జీవన సూత్రాలని నమ్మి మనుషులు జీవించేస్తారు. ఏదో ఓ సందర్భంలో తాను గడిపే జీవితం అర్దరహితమని మనిషికి అనిపించినప్పుడు జీవితాన్ని, ఈ ప్రభావాల నుండి వేరు చేసి చూసుకుంటే తానిన్నాళ్లు ఓ మాయలో పడి జీవించానని అనిపిస్తుంది.
సామాజిక ప్రలోభాలను మనసుకు ఎక్కించుకోలేని ఓ తెలివి తక్కువ వ్యక్తి కేవలం తన మనసు చెప్పిన దారిలో తాను ప్రేమించిన వ్యక్తులను పూర్తిగా మనసులో నింపుకుని వారు నిర్దేశించిన మార్గంలో నడిచి జీవితానికి ఓ పరిపూర్ణతను, ఓ అర్ధాన్ని ఆపాదించుకోవడమే ‘ఫారెస్ట్‌ గంప్‌’ కథ. ఇందులో కథానాయకుడు మెదడు ఎదగని వ్యక్తి. ఇతనికి ఏ ప్రలోభాలతో సంబంధం లేదు. తన మనసు చెప్పినట్లు నడవడం ఒక్కటే ఇతని వచ్చింది. అందుకే ప్రపంచంలోని తెలివితేటలు, అందులోని స్వార్ధం కుత్సితం, గెలుపుకోసం పోరాటం, నా అనే అహం ఇవేవీ అతన్ని చేరవు. అతని జీవితం అంతా గమనిస్తే చాలా మందికన్నా నిజాయితీగా, నిస్వార్ధంగా, గొప్పగా, ప్రేమగా అతను జీవించడం కనిపిస్తుంది.
‘ఫారెస్ట్‌ గంప్‌’ ఒక స్ఫూర్తిదాయకమైన కథ. సంక్లిష్టమైన ప్రపంచంలో మానవ ఆత్మ అనుభవించే ఘర్షణ, ప్రేమ అర్థం కోసం అన్వేషణను చర్చించిన సినిమా ఇది. తెలివితేటలు మనిషిని మంచితనానికి ఎంత దూరం చేస్తాయన్నది ఫారెస్ట్‌ పాత్ర నిరూపిస్తుంది. ఏ కల్మషమూ అంటని స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో గుభాళించే ఫారెస్ట్‌ జీవన ప్రయాణం ఎందరినో ఆకట్టుకుంది. ప్రపంచంలో సినీ ప్రేమికులందరూ ప్రశంసించే గొప్ప చిత్రంగా ఇది సినీ చరిత్రలో నిలిచిపోయింది.
మన జీవితాలు ముందే నిర్ణయించబడ్డాయా, మన స్వంత మార్గాలను రూపొందించుకోవడంలో మనకు స్వతంత్రత ఉందా అనే ప్రశ్న ఈ చిత్రం అంతా అంటిపెట్టుకుని ఉంటుంది. ఫారెస్ట్‌ జీవితంలో సంఘటనలన్నీ అతని ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. కాని వాటిని అతను స్వీకరించిన విధానం, తన మనసుతో జీవితాన్ని ఎదుర్కొన్న తీరు అతన్ని ఓ విశిష్టమైన వ్యక్తిగా తయారు చేస్తాయి. ప్రపంచం అంతా తిరిగిన ఫారెస్ట్‌ చివరకు తన సొంత ఇంటికి చేరడం అతని జీవన ప్రయాణానికి ఓ పరిపూర్ణతను తీసుకొస్తుంది.
‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాకు రాబర్ట్‌ జెమెకిస్‌ దర్శకత్వం వహించారు. 1986లో విన్‌స్టన్‌ గ్రూమ్‌ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎరిక్‌ రోత్‌ రాశారు. కథ 1981లో జార్జియాలోని సవానాలో ఓ బస్టాండ్‌లో మొదలవుతుంది. ఫారెస్ట్‌ ఓ బెంచ్‌పై కూర్చుని తన పక్కన కూర్చుని ఉన్న అపరిచితులకు తన జీవిత కథను వినిపిస్తాడు. ఆ కూర్చున్న వాళ్ళు అతని కథను అనాసక్తిగా వింటూ ఉంటారు. ఒకరు వెళ్లిపోయి అక్కడకు మరొకరు వచ్చి కూర్చున్నా వారందరితోనూ ఫారెస్ట్‌ ఒకే విధమైన ఆప్యాయతతో తన జీవితం గురించి చెప్పడం ఇక్కడ గమనించవలసిన విషయం. మనుషులందరినీ ఒకే తీరుగా స్వీకరించగల స్థితప్రజ్ఞత అందరిలోనూ ఉండదు. దాన్ని సాధించిన ఫారెస్ట్‌ నిజానికి మానసిక ఎదుగుదలలో వెనుకబడిన వ్యక్తి.
చిన్నతనంలో వెన్నుకు సంబంధించిన ఓ సమస్య కారణంగా ఇతనికి నడక సరిగ్గా రాదు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఫారెస్ట్‌ తల్లి ఇతన్ని డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళి కాళ్లకు బ్రేసెస్‌ వేయిస్తుంది. వాటి సహాయంతో మెల్లిగా అడుగులు వేసె ఫారెస్ట్‌ ఆ తల్లికి ఉన్న ఏకైక ఆధారం. ఆమె తన తండ్రి ద్వారా లభించిన ఇంటిని అద్దెకిచ్చి కొద్దిగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఆ ఇంటికి వచ్చిన వాళ్లను గమనించడం ఫారెస్ట్‌ చిన్నతనపు అనుభవం.
ఈ సినిమాలో కథతో పాటు అమెరికా చరిత్ర కూడా సమాంతరంగా నడుస్తూ కనిపిస్తుంది. అమెరికా రాజకీయ సాంస్కతిక రంగంలో పేరు పొందిన మహామహులు అప్పటి చారిత్రక ఘటనలు కథనంతో భాగంగా కనిపిస్తాయి. ఎల్విస్‌ ప్రెస్లీకు ఇంకా పూర్తిగా పేరు రాని రోజుల్లో ఫారెస్ట్‌ ఇంట్లో అతిధిగా కొన్నాళ్లు ఉంటాడు. ఆ సమయంలో కాలికున్న బ్రేసెస్‌తో ఫారెస్ట్‌ చేసే నత్యాన్ని గమనించి దాన్ని ఆ తరువాత అతను స్టేజీపై ప్రదర్శించడం సినిమాలో కనిపించే ఓ హాస్య సన్నివేశం.
ఫారెస్ట్‌ తల్లి మిసెస్‌ గంప్‌ బిడ్డలోని లోపాన్ని గుర్తిస్తుంది. కాని అతన్ని జీవితాన్ని ఎదుర్కోగల ధీరగా తయారు చేయాలని సంకల్పిస్తుంది. తన బిడ్డ అందరిలాంటి వాడు కాదన్న విషయాన్ని అంగీకరిస్తూనే మనుషులందరూ ఒకరికొకరు భిన్నంగానే ఉంటారని, ఆ భిన్నత్వాన్నే తమ శక్తిగా మార్చుకుని మనిషి జీవితంలో ముందుకు సాగాలని ఆమె నమ్ముతుంది. చిన్నతనం నుంచే దాన్ని బిడ్డకి నూరి పోస్తుంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దని, నువ్వు అన్నీ చేయగలవని నమ్మి ముందుకు సాగమని ఆమె బిడ్డకు చిన్నతనం నుంచీ బోధిస్తుంది. తల్లి మాటల ప్రభావం ఫారెస్ట్‌లో జీవితాంతం ఉంటుంది.
మిసెస్‌ గంప్‌ ఎంతో పోరాడి ఫారెస్ట్‌కు దగ్గరలోని ఓ స్కూల్లో సీటు సంపాదిస్తుంది. మొదటిరోజు బస్‌లో ఎక్కిన ఫారెస్ట్‌ను ఎవరూ తమ పక్కన కూర్చోవడానికి సీట్‌ ఇవ్వరు. ఓ అమ్మాయి మాత్రం జరిగి అతనికి చోటు ఇస్తుంది. ఆమె జెన్నీ. ఆ క్షణం నుంచి జెన్నీ ఫారెస్ట్‌ జీవితంలో ఓ భాగం అయిపోతుంది. ఇద్దరూ కలిసి సమయం గడుపుతారు. జెన్నీకి ఇంటికి వెళ్ళడం ఇష్టం ఉండదు. తాగుబోతు తండ్రి ఆమెపై చేసే లైంగిక దాడిని తప్పించుకోవడానికి జెన్నీ ఫారెస్ట్‌ సాంగత్యాన్ని ఎక్కువగా కోరుతుంది. రాత్రుళ్లు ఇంటి నుండి పారిపోయి వచ్చి ఫారెస్ట్‌ గదిలో అతని పక్కన నిద్రపోతుంది. ఇద్దరూ ఆ చుట్టు పక్కల ఉన్న మైదానాలలో ఒకరికొకరం తోడు అన్నట్లుగా తమ బాల్యాన్ని గడుపుతారు. ఫారెస్ట్‌ను తోటి పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఒకసారి జెన్నీ ఫారెస్ట్‌ ఇద్దరూ నడుస్తుండగా సైకిళ్ళపై వచ్చిన తోటి పిల్లలు ఫారెస్ట్‌ను అటకాయిస్తారు. అతన్ని పట్టుకుని కొట్టడానికి వెంటపడతారు. ఫారెస్ట్‌ పరుగు అందుకుంటాడు. జెన్నీ ఎవరికీ దొరకకుండా పారిపొమ్మని చెప్పిన ఒక్కమాటే అతనికి వినిపిస్తుంది. శక్తి సమకూర్చుకుని పరిగెడతాడు. అతని కాలి బ్రేసెస్‌ విరిగి క్రింద పడతాయి. ఎవరూ ఊహించనంత వేగంగా పరుగెత్తి ఇల్లు చేరతాడు ఫారెస్ట్‌. అతని కాళ్లల్లో ఆ శక్తి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. అదే అతన్ని స్కూల్‌లో పెద్ద ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా మారుస్తుంది. స్కాలర్షిప్‌తో కాలేజ్‌ లో ప్రవేశం లభిస్తుంది. బేర్‌ బ్రయెంట్‌ అనే పెద్ద అమెరికన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ టీం లో అతనో ముఖ్యమైన ఆటగాడవుతాడు. ప్రెసిడెంట్‌ జాన్‌. ఎప్‌. కెనడీ ని కలిసే అవకాశం కూడా అతనికి ఈ ఆట ద్వారా లభిస్తుంది.
ఫారెస్ట్‌ కాలేజి అయిపోయాక యూ.ఎస్‌. ఆర్మీలో చేరతాడు. అయితే మానసిక ఎదుగుదల లేనివారికి సైన్యంలో అవకాశం ఎలా వచ్చింది అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. వియత్నాం యుద్ధ సమయంలో ఇలాంటి యువతకు సైన్యంలో అమెరికా చోటు ఇచ్చిన మాట వాస్తవం. ఈ ప్రాజెక్ట్‌ ఫెయిల్‌ అయినా ఈ సినిమా కథకు అది ప్రేరణగా నిలిచింది.
సైన్యంలో శిక్షణ కోసం వెళ్తున్న ఫారెస్ట్‌కు బస్‌లో బబ్బా అనే ఓ నల్ల జాతి స్నేహితుడు దొరుకుతాడు. ఇతనూ ఫారెస్ట్‌ లాగే మానసిక ఎదుగుదల తక్కువ ఉన్నవాడు. యుద్ధం తరువాత తామిద్దరూ కలిసి పడవ కొని చేపల వ్యాపారం చేయాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. 1967 వియత్నాం యుద్ధంలో వీళ్లని సైన్యం పంపిస్తుంది. యుద్ధంలోకి వెళ్లబోయే ముందు ఫారెస్ట్‌ జెన్నీని ఓ నైట్‌క్లబ్‌లో నగంగా పాట పాడుతుండగా చూస్తాడు. తాను సైన్యంలో చేరి యుద్ధం కోసం వెళుతున్నానని చెప్పినప్పుడు జెన్నీ అతనితో ప్రమాదంలో ఉన్నప్పుడు తనను తాను కాపాడుకోవడం ముఖ్యం అన్న సంగతి మరచిపోవద్దని మాట తీసుకుంటుంది.
సైన్యంలో వీరి దళానికి ఆఫీసర్‌ లెప్ట్‌నెంట్‌ డాన్‌ టేలర్‌. అక్కడ జరిగిన యుద్ధంలో బాంబు పేలుళ్ల మధ్య బబ్బా మరణిస్తాడు. ఫారెస్ట్‌ జెన్నీ కిచ్చిన మాట గుర్తు పెట్టుకుని ముందుగా తనను తాను రక్షించుకుంటాడు. తరువాత మొండిగా గాయపడినవారిని, చివరి క్షణాలలో ఉన్నవారిని మోసుకుంటూ సురక్షిత స్థలానికి చేరుస్తాడు. డాన్‌ తన రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు. తాను బతికి ప్రయోజనం లేదని, తనను వదిలేయమని ఎంత చెప్పినా ఫారెస్ట్‌ వినిపించుకోడు. ప్రాణాలకు తెగించి డాన్‌ను కాపాడతాడు. దానికి డాన్‌ ఫారెస్ట్‌ను ద్వేషిస్తాడు. యుద్ధంలో గౌరవంగా వీరమరణం పొందే అవకాశం లేకుండా జీవితాంతం అవిటివానిగా బతికే దుర్గతికి ఫారెస్ట్‌ తనను తీసుకొచ్చాడని అతనిపై కోపం పెంచుకుంటాడు. ఇద్దరూ సైనిక హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరతారు. డాన్‌ అదే ద్వేషంతోనూ కోపంతోనూ డిస్చార్జ్‌ అయి వెళ్ళిపోతాడు. అప్పటి ప్రెసిడెంట్‌ జాన్సన్‌ చేతుల మీదుగా ఫారెస్ట్‌ వీరపతకం పొందుతాడు.
పెంటగాన్‌ రాలీలో ఫారెస్ట్‌ ఆబీ హాఫ్మన్‌ సభకు వెళతాడు. అబీ అమెరికాలోని ప్రముఖ రాజకీయ సామాజిక కార్యకర్త. అక్కడ అతనికి జెన్నీ మళ్ళీ కలుస్తుంది. తన బాల్యాన్ని మర్చిపోలేక, మనసులోని కోపాన్ని, కసిని వదిలించుకోలేక జెన్నీ ఇంటి నుండి వెళ్ళిపోయి హిప్పీలలో కలుస్తుంది. జెన్నీని కలిసిన ఫారెస్ట్‌కు ఆమెలో ఓ అంతర్మధనం కనిపిస్తుంది. కాని అది అతనికి అర్ధం కాదు. ఆమె మీద చేయి చేసుకున్న ఆమె స్నేహితుడిని కొట్టి తాను ఎప్పుడూ జెన్నీకి సహాయంగా ఉండే మిత్రుడినని మరోసారి రుజువు చేసుకుంటాడు ఫారెస్ట్‌. జెన్నీ అతన్ని సముదాయించి తనకీ ప్రపంచం సరిపడదని చెప్పి ఆ స్నేహితుడితోనే హిప్పీగా వెళ్ళిపోతుంది.
సైనికుల హాస్పిటల్‌లో ఫారెస్ట్‌ పింగ్‌ పాంగ్‌ బాల్‌ ఆడడం నేర్చుకుంటాడు. యుద్ధం తరువాత ఆ ఆటపై పూర్తి దష్టి పెడతాడు. బాల్‌ నుండి కళ్ళు తిప్పవద్దు, అదే గెలుపు రహస్యం అన్న తోటి సైనికుడి మాటను తూచ తప్పకుండ పాటిస్తూ ఆ ఆటలో తక్కువ కాలంలోనే నిష్ణాతుడవుతాడు. అంతర్జాతీయంగా ఆ ఆటలో అమెరికాకి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదుగుతాడు. చైనా వెళ్లి అక్కడి ఆటగాళ్లతో పోటీపడి పతకం సాధిస్తాడు. ప్రఖ్యాత గాయకుడు జాన్‌ లెనెన్‌ తో పాటు ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. లెనన్‌ పాట ‘ఇమాజిన్‌’కు ప్రేరణ అవుతాడు.
డాన్‌ న్యూయార్క్‌లో ఉంటున్నాడని విని ఫారెస్ట్‌ అతన్ని కలుస్తాడు. అతనితో కలిసి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాడు. డాన్‌ వీల్‌ చేయిర్‌లో జీవిస్తూ అభద్రతతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అక్కడే ప్రెసిడెంట్‌ నిక్సన్‌ను ఓ అంతర్జాతీయ ఆటగాడి స్థాయిలో కలుస్తాడు ఫారెస్ట్‌. వాటర్‌గేట్‌ హోటల్‌లో అతనికి బస ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అక్కడ ఉంటూ అమెరికా చరిత్రను మార్చిన వాటర్‌గేట్‌ స్కాండల్‌ ను బయటపెట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తాడు ఫారెస్ట్‌.
ఆర్మీ నుండి అతన్ని ప్రభుత్వం రిటైర్‌ చేస్తుంది. ఇక పింగ్‌పాంగ్‌ ఆడలేనని అతనికి అర్ధం అవుతుంది. ఇల్లు చేరి పింగ్‌పాంగ్‌ బాట్‌లు తయారీ చేసే కంపెనీ మొదలెడతారు. అతని తల్లి దీనికి సహాయపడుతుంది. అందులో సంపాదించిన డబ్బుతో బబ్బా కిచ్చిన మాటకు కట్టుబడి ఓ బోటు కొని చేపల వ్యాపారం మొదలెడతాడు. డాన్‌ను తనకు పార్టనర్‌గా ఉండమని ఆహ్వానిస్తాడు. ముందు ఇద్దరికీ ఈ వ్యాపారంలోని మెళకువలు అర్ధం కావు. ఆ వ్యాపారం వదిలేద్దామనుకునే సమయంలో ఓ పెద్ద హరికేన్‌ ఆ తీరాన్ని తాకుతుంది. అందరి నావలు విరిగిపోతాయి కాని ఫారెస్ట్‌ బోట్‌ ఒక్కటే సురక్షితంగా బైట పడుతుంది. ఇది పైనుండి వచ్చిన సంకేతంగా భావించి డాన్‌ పట్టుదలతో మళ్ళీ సముద్రంలోకి బోట్‌తో వెళ్తాడు. క్రమంగా వ్యాపారంపై వారికి పట్టు వస్తుంది. ఓ పెద్ద కంపెనీకి ఇద్దరూ యజమానులవుతారు. డాన్‌కు జీవితం ఆనందంగా కనిపిస్తుంది. తన ప్రాణాలు కాపాడినందుకు జీవితంలోని రుచిని ఆస్వాదించే అవకాశం కలిగించినందుకు అతను ఫారెస్ట్‌ కు మనస్పూర్తిగా కతజ్ఞతలు తెలుపుకుంటాడు.
ఫారెస్ట్‌ తల్లి కాన్సర్‌తో పోరాడుతుందని తెలుసుకుని అతను ఇంటికి వస్తాడు. మరణం సహజమని, ఎవరూ దాని నుంచి తప్పించుకోలేరని, అది మనల్ని చేరే దాకా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ జీవించడమే మనిషి పని అని చిట్ట చివరి పాఠం కొడుకుకి చెప్తూ ఆమె తప్తిగా ప్రాణాలు వదులుతుంది. డాన్‌ వ్యాపారంతో వచ్చిన లాభాలని ఆపిల్‌ కంపెనీలో పెట్టి కోట్లు గడిస్తాడు. ఫారెస్ట్‌ తన వంతు వచ్చిన లాభాలను బబ్బా కుటుంబంతోనూ తన చుట్టు ఉన్న పేద సముదాయాలతోనూ పంచుకుంటాడు. ఒక చర్చి నిర్మాణానికి, ఆ ప్రాంతంలో సామాజిక కార్యక్రమాలకు విరాళాలు అందిస్తాడు.
జెన్నీ ఓ వేశ్యగా జీవిస్తూ ఉంటుంది. కొన్నాళ్లకు ఆమెకు ఆ జీవితం విసుగనిపిస్తుంది. నిజమైన ప్రేమ కావాలనిపిస్తుంది. ఫారెస్ట్‌ విజయాలను ఆమె గమనిస్తూ ఉంటుంది. మనశ్శాంతి కోసం అతని దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఫారెస్ట్‌కు తన బాల్యంలోని ఆనందం అనుభవంలోకి వస్తుంది. ఆమెతో ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతాడు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని అడుగుతాడు. జెన్నీ అతనితో ఓ రాత్రి గడుపుతుంది కాని మళ్ళీ తన పాత జీవితంలోకి వెళ్లిపోతుంది. జెన్నీ వెళ్ళిపోవడంలో ఫారెస్‌ ను మళ్ళీ ఒంటరితనం ఆవహిస్తుంది. అన్నీ వదిలి పారిపోవాలని అనిపిస్తుంది. ఇంటి నుండి పరుగు లంకించుకుంటాడు. అలా మూడు సంవత్సరాలు మౌనంగా ఎవరితోనూ మాట్లాడకుండా దేశం అంతా పరుగెడుతూ ఉంటాడు. ఇది అమెరికాలో ఓ పెద్ద వింతగా మారుతుంది. అతని పరుగు ఎందరినో కదిలిస్తుంది. అలా పరుగెత్తుతూనే తన దేశంలో ప్రతి ప్రాంతాన్ని అతను చుడతాడు. దేశంలో అన్ని పత్రికలలో అతని గురించి వ్యాసాలు వస్తాయి. ఒక రోజు హఠాత్తుగా పరుగు ఆపేసి మళ్ళీ ఇల్లు చేరతాడు.
కొన్నాళ్ల తరువాత అతనికి జెన్నీ నుండి తనను కలవమని ఓ ఉత్తరం అందుతుంది. ఆమె దగ్గరకు వెళ్లడానికే బస్‌ కోసం తాను అక్కడ కూర్చున్నానని ఫారెస్ట్‌ తన కథను ముగిస్తాడు. జెన్నీ ఇంటికి వెళ్లిన ఫారెస్ట్‌కు జెన్నీ అతని కొడుకుని పరిచయం చేస్తుంది. తాను ఎక్కువ రోజులు బతకనని చెప్తూ అతనితో ఆఖరి రోజులు గడపాలనే కోరికను బయట పెడుతుంది. బిడ్డ పుట్టాక తన పాత జీవితానికి స్వస్తి చెప్పి ఓ బాధ్యత గల తల్లిగా ఆమె జీవించిందని అర్ధం అవుతుంది. జెన్నిని, తన కొడుకును ఇంటికి తెచ్చుకుంటాడు ఫారెస్ట్‌. ఆమెను వివాహం చేసుకుంటాడు. అతని దగ్గర తన ఆఖరి రోజులని ప్రశాంతంగా గడుపుతుంది జెన్నీ. ఆమె సమాధిని తాము చిన్నప్పడు ఆడుకున్న చెట్టు నీడన కట్టిస్తాడు ఫారెస్ట్‌. కొడుకు బాధ్యతను తీసుకుని తన తల్లి ఒకప్పుడు తనను స్కూలు బస్సు ఎక్కించిన చోటే కొడుకుని ఎక్కించి ఫారెస్ట్‌ నిలబడి ఉండగా సినిమా ముగుస్తుంది.
ఈ కథ మానవ సంబంధాల సంక్లిష్టతలను, ప్రేమ, జీవితంలోని లాభ నష్టాలను, అర్థం కోసం వెతుకులాటను అన్వేషిస్తుంది. జెన్నీతో ఫారెస్ట్‌ ప్రయాణం, చివరికి అతను తన చిన్ననాటి ఇంటికి తిరిగి రావడం ప్రేమకున్న శాశ్వత శక్తిని, మనిషి ప్రపంచంలో తన స్థానాన్ని కనుగొనడంలోని ప్రాముఖ్యతను హైలైట్‌ చేస్తుంది. జెన్నీ తండ్రి లైంగిక దాడితో మానసికంగా గాయపడిన యువతి. తన బాల్యం నుండి తన ఆలోచనల నుండి పారిపోవడమే జీవితంగా బతుకుతుంది. కాని ఎన్ని విధాలుగా పారిపోయినా ఆమె చివరకు పారెస్ట్‌ ప్రేమకు బందీ అయిపోతుంది. ప్రేమను అందుకునే స్థితిలో లేని ఆమెను తిరిగి పొందడం ఫారెస్ట్‌ మానసికంగా సాధించిన విజయం. దీనికి అతను ఏ ప్రత్యేక ప్రయత్నమూ చేయడు. కేవలం తన ప్రేమను కలుషితం కానివ్వడు. జెన్నీని ఓ డ్రగ్‌ అడిక్ట్‌ గానూ, నగంగా బార్‌లో ప్రదర్శనలిచ్చే యువతిగానూ, ఓ హిప్పీగానూ, ఓ వేశ్యగానూ చూసినా ఆమె అతనికి తన చిన్ననాటి జెన్నీనే. ఆ స్వచ్ఛతే అతని నైతిక విజయానికి కారణం అవుతుంది. మనసికంగా ఎదగని ఫారెస్ట్‌ సాన్నిహిత్యమే తాను చూసిన ఎందరో మగవారి దగ్గర పొందలేని ప్రశాంతతను జెన్నీకి అందిస్తుంది. ప్రపంచం అంతా తిరిగి చూసి చివరకు తన ఆఖరి రోజులను అతని సాంగత్యంలోనే గడిపి ఆమె ప్రశాంతంగా మరణిస్తుంది. ఆమె చనిపోయిన తరువాత జెన్నీ చిన్ననాటి ఇంటిని ధ్వంసం చేసి ఫారెస్ట్‌ ఆమెను పూర్తిగా అర్ధం చేసుకున్న వ్యక్తిగా ఎదుగుతాడు.
1950ల నుండి 1980ల వరకు అమెరికాలో జరిగిన కీలకమైన చారిత్రక సంఘటనలను ఈ చిత్రం కథతో కలిపి అల్లుతుంది. అది దీన్ని ఓ చారిత్రిక చిత్రంగానూ మారుస్తుంది. ఆ కాలంలో అమెరికాలోని సామాజిక మార్పులు, సంఘర్షణలు వ్యక్తులు, కుటుంబాలను ఎలా ప్రభావితం చేశాయో కూడా ఈ చిత్రం రికార్డు చేసింది. అర్థరహితంగా అనిపించే ప్రపంచంలో అర్థం కోసం అన్వేషణను హైలైట్‌ చేసే ఫారెస్ట్‌ ప్రయాణంతో, ఈ చిత్రాన్ని అస్తిత్వ దష్టితోనూ అర్థం చేసుకోవచ్చు. ఫారెస్ట్‌ జీవితం మనకు ఓ ప్రాధమిక సూత్రాన్ని బోధిస్తుంది. వచ్చే అవకాశాలను స్వీకరించి, నిజాయితీగా జీవించడం ద్వారా ఆనందాన్ని పొందడమే మనిషి చేయవలసిన పని అనే సందేశాన్ని అందిస్తుంది ఈ చిత్రం. జీవితాన్ని అర్ధవంతంగా మార్చగల గుణాలు దయ, కరుణ. జీవితంలో వీటి ప్రాముఖ్యతను ఈ కథ చర్చించిన తీరు మనసుకు హత్తుకుంటుంది. విపత్తులను ఎదుర్కుంటూ కూడా ఫారెస్ట్‌ ఇతరుల పట్ల చూపే అచంచలమైన దయ, కరుణ, మానవ సంబంధాల పట్ల కలిగించే సానుకూల ప్రభావాన్ని అనుభవానికి తెస్తుంది.
జీవితంలోని అస్థిరత ఓ పెద్ద వాస్తవం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో, మనకేం లభించబోతుందో మనిషికి తెలియకుండా ఉండడమే జీవితంలోని అతి పెద్ద రహస్యం, అందం కూడా. ఇందులో ఫారెస్ట్‌ ఓ మాట అంటాడు ”జీవితం ఓ చాక్లెట్ల పెట్టె’లా ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. మనకు తెలియని వాటిని విశాలమైన హదయంతో స్వీకరించాలని నొక్కి చెబుతుంది” తన తల్లి తనకు చెప్పిన ఈ మాటను ఫారెస్ట్‌ పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ సినిమా సారాన్ని ఈ వాక్యం వివరించి చెబుతుంది. ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రం కుటుంబం, సమాజం ప్రాముఖ్యతను ప్రతి ఘట్టంలోనూ వివరిస్తుంది. సహేతుకమైన మానవ సంబంధాలే మనిషి జీవితాన్ని ఆనందమయం చేస్తాయని, మనిషి ఆ దిశగా జీవించాలని చెప్పిన గొప్ప చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’. ఇందులో ఫారెస్ట్‌గా టామ్‌ హాంక్స్‌, అతని తల్లిగా సాలీఫీల్డ్‌ లు సినీ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. డాన్‌గా గారీ సినీస్‌, జెన్నీగా రాబిన్‌ రైట్‌ల నటన బావుంటుంది. ‘ఫారెస్ట్‌ గంప్‌’ ఆరు అకాడమీ అవార్డులను గెలుచుకుంది. టాం హాంక్స్‌కు ఉత్తమ నటుడిగా వరుసగా రెండోసారి అకాడమీ పురస్కారం లభించింది. శారీరక వైకల్యాలు భావోద్వేగ కల్లోల్లాలు, మనిషి తలచుకుంటే జీవితంలో అధిగమించలేని సవాళ్ళు కావనే సందేశాన్ని అందించిన ఈ చిత్రం ఎందరికో స్పూర్తినిచ్చిన గొప్ప సినిమా.
ఈ సినిమాలో ఫారెస్ట్‌ మూడు సంవత్సరాల పాటు చేసిన పరుగు ప్రయాణం ఒక వాస్తవ సంఘటన నుండి ప్రేరణ పొందింది. 1982లో, 16 ఏళ్ల లూయిస్‌ మైఖేల్‌ ఫిగ్యురోవా, అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ కోసం న్యూజెర్సీ నుండి శాన్‌ ఫ్రాన్సిస్కోకు పరిగెత్తాడు. ఫారెస్ట్‌ పాత్రను రచయిత లూయిస్‌ ప్రేరణతో మలచారు. టామ్‌ హాంక్స్‌ సినిమాలో ఎక్కువ భాగం కూర్చున్న పార్క్‌ బెంచ్‌ జార్జియాలోని చారిత్రాత్మక సవన్నాలో చిప్పేవా స్క్వేర్‌లో ఉంది. తరువాత అతను కూర్చున్న ఫైబర్‌గ్లాస్‌ బెంచ్‌ను తొలగించి, దాన్ని జార్జియాలోని సవన్నాలోని సవన్నా హిస్టరీ మ్యూజియంలో ఉంచారు. అలా ఈ చిత్రం అమెరికా చరిత్రలోనే ఓ భాగంగా నిలిచిపోయింది.
పి.జ్యోతి
98853 84740

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -