గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాచార హక్కు చట్టంతో మెరుగైన ప్రభుత్వపాలన, సమాజ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఆర్టీఐ వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం -2005 హ్యాండ్ బుక్‌తో పాటు న్యూస్ లెటర్‌ను గవర్నర్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ జిల్లా, ఉత్తమ శాఖ, ఉత్తమ హెచ్‌ఓడీ, ఉత్తమ పీఐఓ, బెస్ట్ ఆఫీసర్ అవార్డులకు ఎంపికైన వారికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చివరి మనిషి వరకు సమాచారాన్ని తీసుకెళ్లడమే ఆర్టీఐ లక్ష్యమని చెప్పారు. 1946లో ఐక్యరాజ్య సమితి సమాచారాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో ఈ చట్టం దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ పనితీరు బాగుందని కితాబిచ్చారు.
తెలంగాణ హైకోర్టు జడ్జి పి.శ్యామ్ కోషీ మాట్లాడుతూ ఆర్టీఐ ప్రజలను ప్రజాస్వామ్యంలో భాగం చేస్తున్నదని తెలిపారు. అనేక అనుభవాల తర్వాత 2005లో ఆర్టీఐ చట్టం వచ్చిందని వివరించారు. అవినీతిని తగ్గించేందుకు ఉపయోగపడే చట్టమని తెలిపారు. ఈ చట్టం కేవలం సమాచారం తెలుసుకోవడానికే కాక పనులు, రికార్డులు, సంబంధిత డాక్యుమెంట్లను తనిఖీ చేస్తూ ప్రభుత్వపాలననే ప్రజలు పర్యవేక్షించే సాధికారతను కల్పించిందని తెలిపారు. ఈ చట్టం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నదని అభిప్రాయపడ్డారు. వారోత్సవాల సభలో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి స్వాగతం పలుకగా, మరో ఇన్ఫర్మేషన్ కమిషనర్ మొహసిన ప్రవీణ్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి, హౌంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్, సాధారణ పరిపాలనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, అటవీ శాఖ ప్రిన్సిపల్ ఛీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి.సువర్ణ, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, దేశాల భూపాల్, వైష్ణవి మెర్ల, కార్యదర్శి బి.భారతి లక్పతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టంతో మెరుగైన ప్రభుత్వపాలన, సమాజ నిర్మాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES