– వేగవంతమైన పౌరసేవలు సాధ్యం
– దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం ఏ రేవంత్‌రెడ్డి
– పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ద్వారా పాలనను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సాంకేతికత వినియోగం వల్ల తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఏఐ వినియోగంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందనీ, దాన్ని మరింత విస్తరించేందుకు విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తుందని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనేందుకు మంగళవారం అక్కడకు వెళ్ళిన సీఎం బృందానికి ఘన స్వాగతం లభించింది. తొలిరోజు వాణిజ్య సదస్సులో సీఎం బృందం బిజీబిజీగా గడిపింది. అనేక ప్రముఖ వాణిజ్య సంస్థలతో చర్చలు జరిపారు. సీఎంతో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారులంతా వేర్వేరుగా ఆయా ఫోరంలలో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గురించి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయా కంపెనీల ప్రతినిధుల్ని కోరారు. ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ నిర్వహించిన ‘ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కంపెటీటివ్‌నెస్’ అంశంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటి నిర్వహణకోసం వినియోగిస్తున్న సాంకేతికత, ఆర్థిక వసూళ్లు, పట్టణ, గ్రామీణ పరిపాలనలో సాంకేతికత వినియోగం వంటి పలు అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏఐ వినియోగంతో పరిపాలనను ఎలా పరుగులు పెట్టించొచ్చో వివరించారు. ఆ సాంకేతికతకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యత గురించి చెప్పారు. వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతోందని విశ్లేషించారు. ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏఐ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండజాలవని స్పష్టం చేశారు. 2047 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లక్ష్యం మూడు ట్రిలియన్ డాలర్ల గురించి ప్రస్తావించారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ ప్రాంతాలు అత్యంత అనుకూలమైన ప్రాంతాలని వివరించారు. స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలపై ఈ సదస్సులో చర్చించారు. సమావేశంలో ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, ఎమరాల్డ్ ఏఐ సీఈఓ వరుణ్ శివరామ్, ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జర్మనీ డిజిటల్ మంత్రిత్వశాఖ మంత్రి కార్ స్టెన్‌వైల్డ్ బెర్గర్, నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈఓ తోషియాకి టోకునాగా తదితరులు పాల్గొన్నారు.
సీఎం బృందానికి ఘన స్వాగతం
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బందం సోమవారం రాత్రి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సారధ్యంలోని ప్రతినిధి బందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మదుల్ కుమార్ సీఎం బృందానికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. దావోస్‌లో నాలుగు రోజులపాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్యూఈఎఫ్) సమావేశాల్లో ఈ బందం పాల్గొంటున్నది. మంగళవారం తొలిరోజు పలు రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ అయ్యింది.
పలువురు ప్రముఖలతో సీఎం భేటీ
దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బందం మొదటి రోజున బిజీ బిజీగా గడిపారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మెన్ అలోన్ స్టోపెల్ తో ముఖ్యమంత్రి ఏరేవంత్‌రెడ్డి బృందం భేటీ అయ్యింది. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై చర్చించారు. అలాగే ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్‌టెక్, అగ్రి-టెక్, సైబర్‌సెక్యూరిటీ, ఎరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి కనబర్చింది.హైదరాబాద్‌లో నాలెడ్జ్‌హబ్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలను ప్రశంసించారు. నెదర్లాండ్స్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బందం సందర్శించాలని ఆహ్వానించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ కోసం కలిసి పనిచేస్తాం- యూఏఈ
భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌తౌక్‌అల్ మార్రీ తెలిపా రు. ప్రపంచ ఆర్థిక వేదిక -2026 సదస్సులో భాగంగా దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డితో మంగళవారంనాడాయన భేటీ అయ్యారు. యూఏఈ, తెలంగాణ ప్రభుత్వాల అధి కారులతో సంయుక్త టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.
గూగుల్ ఆసక్తి
ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌లు, వ్యవసాయం, క్లైమేట్ చేంజ్ రంగాల్లో సహకారాన్ని అందించేందుకు గూగుల్ సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ చేసింది. ఆ సంస్థ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజరు గుప్తా సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. పలుఅంశాలపై వారిరువురూ సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనా గురించి వివరించారు.
‘యూనిలీవర్’ ప్రతినిధుల భేటీ
దావోస్‌లో తెలంగాణ రైజింగ్ బృందంతో యూనిలీవర్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినియోగరంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్ సంస్థ, హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసింది. ఆసంస్థ చీఫ్ సప్లరు చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సీఎం బృందంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జీసీసీ ఏర్పాటు అంశంపై చర్చించారు.
ఏఐతో మెరుగైన పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



