– ప్రత్యేక కార్యచరణకు ప్రణాళిక
నవతెలంగాణ – కాటారం
కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఈ ప్రాంత రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో ప్రత్యేక కార్యచరణ రూపొందించనున్నట్లు కాటారం మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య తెలిపారు. కాటారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వైస్ చైర్మన్, డైరెక్టర్లతో కలిసి రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. రైతుల సౌకర్యాలు, మార్కెట్ యార్డ్ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక సేవల మెరుగుదల అంశాలపై పలు కీలక తీర్మానాలు చేశారు.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఉచిత పశువైద్య శిబిరాలు (మెడికల్ క్యాంపులు) నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అలాగే మార్కెట్ యార్డ్‌లో రైతుల సౌకర్యార్థం సీసీ ప్లాట్‌ఫాంలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని తీర్మానించింది.
డైరెక్టర్లు చేసిన సూచనల మేరకు మరిన్ని అభివృద్ధి అంశాలపై కూడా తీర్మానాలు చేశారు. మార్కెట్ యార్డ్ సమగ్ర అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సెక్రటరీ లా షరీఫ్‌తో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లు పాల్గొన్నారు.



