Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయంమోడీజీ ఖబడ్దార్‌..!

మోడీజీ ఖబడ్దార్‌..!

- Advertisement -

మీరిచ్చిన హామీల సంగతేంటి..?
ప్రతీ ఆడబిడ్డకూ మీ ప్రభుత్వ చర్యలు అర్థమయ్యారు..
కేంద్రం తీరు మార్చుకోవాలి..లేదంటే ఉధృత పోరాటాలు తప్పవు
ఐద్వా జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీకే శ్రీమతి, మరియం ధావలే
సామ్రాజ్యవాదం, సర్‌ను వ్యతిరేకిస్తూ మహాసభలో తీర్మానాలు
పాలస్తీనా, వెనిజులాపై దాడులకు ఖండన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘మోడీజీ జాగ్రత్త.. దేశంలోని ప్రతీ ఆడబిడ్డకూ మీ ప్రభుత్వ చర్యలన్నీ అర్థమయ్యాయి..2014 నుంచి మీరిచ్చిన హామీలన్నీ ఒట్టి గ్యాస్‌ అని తేలిపోయింది. పింఛన్ల పెంపు బూటకమని స్పష్టమైంది. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి, గ్రామీణ పేద మహిళల పొట్టగొట్టారు…’ అంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీకే శ్రీమతి, మరియం ధావలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన తీరును మార్చుకోవాలని, లేదంటే ఉధృత పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఐద్వా అఖిల భారత 14వ మహాసభల సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీమతి, ధావలే మాట్లాడారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన మహిళలు ఆయా రాష్ట్రాల వారీగా బృందాలుగా చర్చలు జరిపారని ధావలే తెలిపారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను వివరించారని చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ రాజకీయ పరిస్థితులపై మహాసభ చర్చించిందని అన్నారు. ఐద్వా కేంద్ర కమిటీ ప్రవేశపెట్టిన నివేదికపై కూలంకుషంగా చర్చించామని వివరించారు. కేరళ, తమిళనాడు, వెస్ట్‌ బెంగాల్‌, మహారాష్ట్ర, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి 16 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారని వెల్లడించారు. మణిపూర్‌లో సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించేందుకు వీలుగా ప్రజల మధ్య విద్వేషాలను ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో మహిళలపై జరిగిన హింస, లైంగికదాడుల ఘటనల్లో ఇంతవరకు ఒక్కరిని కూడా శిక్షించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఒత్తిడి తర్వాత అక్కడి బీజేపీ ముఖ్యమంత్రిని మార్చినప్పటికీ శాంతియుత పరిస్థితుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తప్పు పట్టారు.

తమిళనాడులో పోరాటాల ఫలితంగా అక్కడి ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్‌, కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా బిల్లును తెచ్చినట్టు ధావలె గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడలేని భయంకర పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను, బాధితులను బీజేపీ నాయకులు అదే పనిగా బెదిరిస్తున్నారని వాపోయారు. మహారాష్ట్ర, ఒడిశాలో ఆ పార్టీ మహిళలకు, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఒకవైపు హామీలు అమలు చేయకుండా, మరో వైపు మహిళలపై మత ఘర్షణలను, హింసను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. పుదుచ్చేరిలో రేషన్‌కు బదులుగా నేరుగా నగదు బదిలీ చేస్తున్నారనీ, దీంతో ఆహార భద్రతకు విఘాతం కలుగుతున్నదని చెప్పారు. దాన్ని ఉప సంహరించుకుని రేషన్‌ను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఒడిశాలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రాగానే కుష్టు రోగులకు సేవలందిస్తున్న గ్రహం స్టెయిన్స్‌ను, ఆయన కుమారులను సజీవదహనం చేసిన హంతకుడు ధారాసింగ్‌ను జైలు నుంచి వదిలేసిందని ధావలే ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులు మరింత దిగజారాయనీ, హామీలను అమలు చేయకుండా బీజేపీ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, వృద్దాప్య, వితంతు పింఛన్‌ పెంపు తదితర హామీల ఊసేలేదని గుర్తుచేశారు. ఒడిశాలో అటవీ భూమి ఎక్కువగా ఉందని, దాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మోడీ సర్కార్‌ కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఐద్వా మహాసభల నిర్వహణలో పాలుపంచుకుంటున్న పలు ప్రజా సంఘాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

పీకే శ్రీమతి మాట్లాడుతూ… సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పలు దేశాలపై అమెరికా దాడులను ఖండిస్తూ, పాలస్తీనా, వెనిజులాకు సంఘీభావంగా పలు తీర్మానాలను ఆమోదించినట్టు తెలిపారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఓట్లను తొలగించటాన్ని వ్యతిరేకిస్తూ మరో తీర్మానాన్ని మహాసభ ఆమోదించిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ముస్లీంలు, క్రైస్తవులతోపాటు ఇతర అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ మరో తీర్మానాన్ని మహాసభలో చర్చించి ఆమోదించామని వివరించారు. మైనార్టీల పట్ల పార్లమెంటు లోపల, బయట ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వేష భావాల్ని వ్యాపింపజేస్తోందని ఆమె విమర్శించారు. ఏఐకెఎస్‌, సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఆల్‌ ఇండియా వర్కింగ్‌ ఉమెన్స్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ తదితరులు మహాసభల విజయవంతాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షల సందేశాలనిచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో ఐద్వా సంయుక్త కార్యదర్శి అస్నా ప్రసాద్‌, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -