డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు
న్యూఢిల్లీ : భారత్‌లో గుర్తించబడిన మూడు కలుషితమైన దగ్గు మందుల పట్ల జాగ్రత్తగా వుండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీచేసింది. వారి వారి దేశాల్లో ఈ మందులు కనిపించిన పక్షంలో తక్షణమే వాటి గురించి తమకు తెలియ చేయాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా గల ఆరోగ్య శాఖ అధికారులను కోరింది. వీటిని కోల్డ్‌రిఫ్, రెస్పిఫ్రెష్ టిఆర్, రీలైఫ్‌లకు చెందిన నిర్దిష్ట బ్యాచ్‌లుగా గుర్తించారు. వీటిని వరుసగా శ్రీసన్ ఫార్మా స్యూటికల్, రెడ్‌నెక్స్ ఫార్మాస్యూటికల్, షేప్ ఫార్మాలు తయారు చేశాయని డబ్ల్యుహెచ్‌ఓ జారీ చేసిన ప్రకటన పేర్కొంది. కలుషితమైన ఈ దగ్గు సిరప్‌ల వల్ల రోగులకు తీవ్రమైన ముప్పులు పొంచి వున్నాయని, ఒకోసారి ప్రాణాపాయం కూడా కలిగే ప్రమాదముందని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.
ఈ నాసిరకం ఉత్పత్తులు ఎక్కడన్నా కనబడితే లేదా వీటిని వాడడం వల్ల ఏదైనా ప్రతికూల సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే ఆ సమాచారాన్ని జాతీయ రెగ్యులేటరీ అధికారులకు లేదా జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ సెంటర్‌కు తెలియచేయాలని డబ్ల్యుహెచ్‌ఓ కోరింది. కోల్డ్‌రిఫ్ తయారీ దారైన శ్రీసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారీ లైసెన్స్‌ను సోమవారం తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే కంపెనీని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. విషపూరితమైన పారిశ్రామిక రసాయనం డైథలిన్ గ్లైకాల్ 45శాతానికి పైగా ఆ సిరప్‌లో వున్నట్టు తేలింది. ఈ సిరప్ తాగి మధ్యప్రదేశ్‌లో 24మంది, రాజస్థాన్‌లో ముగ్గురు మరణించారు.
భారత్ దగ్గు మందుల పట్ల జాగ్రత్త!
- Advertisement -
- Advertisement -