ముస్లిం మహిళలంటే పరదాల చాటున కనిపించని కన్నీళ్లు.. నాలుగ్గోడల మధ్య నలిగిపోయే బతుకులు మాత్రమే కాదు, కాస్త చేయూతనిస్తే ఎవ్వరూ ఊహించని అద్భుతాలు సృష్టించగలరని నిరూపించింది అబిదా అఫ్రీన్ (21). ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కి చరిత్ర సృష్టించింది. అంతేకాదు లద్దాక్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి ముస్లిం మహిళగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఎలిజెర్ జోల్డాన్ మెమోరియల్ కాలేజీలో చదువుతున్న ఆమె మౌంట్ ఎవరెస్ట్ బాలుర, బాలికల సాహసయాత్ర 2025లో పాల్గొంది. పర్వతారోహణ సమయంలో ఆమె అనుభవాలు, ఎదుర్కొన్న కఠినమైన సవాళ్ల గురించి ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌లో ఆమె పంచుకున్న విశేషాలు నేటి మానవిలో…
2024 ఆగస్టులో లేహ్‌లో జరిగిన ట్రయల్ తర్వాత అఫ్రీన్ ఎవరెస్ట్ యాత్రకు ఎంపికైంది. ఆమె దృఢ సంకల్పం, ధైర్యం శిఖరాన్ని అధిరోహించడానికి సాయపడ్డాయి. ఆమె సాధించిన ఈ విజయం నేడు లద్దాక్‌లోని చాలా మందికి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. 2017లో జూనియర్ వింగ్ క్యాడెట్‌గా నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ)లో చేరినప్పుడు అఫ్రీన్ ప్రయాణం ప్రారంభమైంది. అయితే ఎన్‌సీసీ ‘బీ’ సర్టిఫికేట్ పరీక్షలు రాయలేకపోయింది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె కళాశాల పరీక్షలు జరిగాయి. అందుకోసం బీ సర్టిఫికేట్ ఎగ్జామ్‌ను తర్వాత నిర్వహించాలని అభ్యర్థించింది. పర్వతారోహణ ప్రారంభంలో ఆత్మవిశ్వాసం లేకపోవడంతో శారీరక, మానసిక సవాళ్లు ఎదుర్కొన్నానని అబిదా అఫ్రీన్ అన్నది. చాలా భయపడినట్టు కూడా పంచుకుంది. కానీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించింది.
అండగా ఎన్‌సీసీ డైరెక్టర్
ఎవరెస్ట్ అధిరోహణ యాత్రకు ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ సాయపడ్డారని అఫ్రీన్ అన్నది. ఎన్‌సీసీ క్యాడెట్‌లను ఎవరెస్ట్ శిఖరానికి తీసుకెళ్లడం గుర్బీర్ పాల్ సింగ్ విజన్ వల్లే సాధ్యమైందని పేర్కొంది. ఆయన దార్శనికతను కమాండింగ్ ఆఫీసర్, టీమ్ లీడర్, సేన మెడల్ అవార్డు గ్రహీత కల్నల్ అమిత్ బిస్త్ ముందుకు తీసుకెళ్లారని చెప్పింది. అమిత్ బిస్త్ దేశవ్యాప్తంగా తిరిగి క్యాడెట్‌లను స్కౌట్ చేసి ఎంపిక చేశారని స్పష్టం చేసింది.
బేస్ క్యాంప్‌లో అబిదా
‘ఫిజికల్ టెస్టు, పరుగు, బ్యాక్ ప్యాక్‌లతో లేకుండా రన్నింగ్, పుష్ అప్స్, చిన్ అప్స్, సిట్ అప్స్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ రౌండ్ తర్వాత నాతో పాటు కొందరిని తదుపరి దశ ఎంపిక కోసం ఢిల్లీకి పిలిచారు. లేహ్ నుంచి చెరో నలుగురు అబ్బాయిలు, అమ్మాయిలు ఎంపికయ్యారు. కానీ దేశవ్యాప్తంగా దాదాపు 250 మంది క్యాండెట్‌లు పాల్గొన్నందున ఢిల్లీ ట్రయల్స్ మరింత తీవ్రంగా ఉన్నాయి. వారిలో ఎక్కువ మంది అథ్లెట్లు, కిక్ బాక్సర్లు, జాతీయ స్థాయి కబడ్డీ ఆటగాళ్లు ఉన్నారు. అప్పుడు నేను భయపడ్డాను. నేను ఎంపికయ్యే అవకాశం లేదనుకున్నాను. వంద శాతం నా శక్తి మేరకు కృషి చేశాను. ఆ పరీక్షల్లో 36 మంది క్యాడెట్లు ఎంపికయ్యారు. అందులో నేనూ ఉన్నాను. తదుపరి సవాలు ఉత్తరాఖండ్‌లోని 7,355 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ అబి గామిన్ యాత్ర. ఎవరెస్ట్ యాత్రకు ముందు ఇది చేశాం. అదే మా నిజమైన శిక్షణా స్థలం. మేము టెంట్లు వేయడం, భోజనం వండుకోవడం, కఠినమైన పర్వత పరిస్థితులలో ఎలా జీవించాలో నేర్చుకున్నాం. భారీ రక్ సాక్స్‌లతో చాలా దూరం నడిచేవాళ్లం’ అంటూ అఫ్రీన్ పంచుకుంది.
సియాచిన్ గ్లేసియర్‌లో శిక్షణ
అబి గామిన్ యాత్ర తర్వాత మళ్లీ అభ్యర్థులను ఫిల్టర్ చేశారు. 36 మంది 16 మంది క్యాడెట్‌లను మాత్రమే ఎంపిక చేశారు. వీరిని ఉత్తరాఖండ్‌లోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్, డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్ స్టిట్యూట్‌లో అధునాతన శిక్షణ కోసం పంపించారు. ఆ తర్వాత అతి శీతలమైన సియాచిన్ సైనిక శిక్షణ క్షేత్రంలో శిక్షణ జరిగింది. ‘అది అత్యంత కష్టతరమైన భాగం. విపరీతమైన చలి, బలంగా వీచే చలిగాలుల వల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోయాం. ఎత్తైన ప్రదేశంలో కూడా పరిగెత్తించారు. సియాచిన్‌లో ప్రజలను ఎవరు పరిగెత్తిస్తారో అని నేను ఆశ్చర్యపోయాను. అక్కడ మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను. ఈ శిక్షణకే అంత కష్టపడితే, ఇక ఎవరెస్ట్‌ను ఎలా అధిరోహించగలనో అనుకున్నాను. సియాచిన్‌లో కష్టతరమైన శిక్షణ తర్వాత ఎవరెస్ట్ యాత్రకు ఐదుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఎంపికయ్యారు. రోజుకు ఎన్నో గంటలు చాలా కష్టపడ్డాం. శారీరక ఒత్తిడి, మోకాళ్ల నొప్పులు, ప్రతి రోజు రాత్రి పాదాలకు మసాజ్ చేసుకునేదాన్ని. మీరు ధనికులా, పేదవాళ్లా అనేది లెక్కకాదు. అలాగే ఎత్తైన పర్వత ప్రాంతానికి చెందినవారా, మైదాన ప్రదేశానికి చెందినవారా అనేది అనవసరం. శిఖరాన్ని అధిరోహించాలని బలమైన కోరికే ముఖ్యం. అది లేకపోతే పర్వతాన్ని అధిరోహించలేరు’ అని తన అనుభవాల నుండి అఫ్రీన్ చెబుతుంది.
అఫ్రీన్‌కు కలిసొచ్చిన సొంత ప్రదేశం
లద్దాక్‌లోని ఎత్తైన ప్రాంతంలో పెరగడం ఎవరెస్ట్ యాత్ర సమయంలో అఫ్రీన్‌కు కొంత కలిసొచ్చింది. మైదాన ప్రదేశాల నుంచి వచ్చిన ఇతరులతో పోలిస్తే ఆమె బేస్ క్యాంప్‌నకు చేరుకున్నప్పుడు తలనొప్పి, వికారం, అలసట వంటి సమస్యలను పెద్దగా ఎదుర్కోలేదు. తనతో ఎవరెస్టు యాత్రకు వచ్చిన వారిలో ఎక్కువ మంది క్రీడా నేపథ్యం కలిగిన అథ్లెట్లు అని అఫ్రీన్ తెలిపింది. కఠిన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసని పేర్కొంది.
ఏదీ అసాధ్యం కాదు
‘ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నప్పుడు ఇంటికి ఎప్పుడు చేరుకుంటానో అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మా ప్రయాణం శారీరకంగా, మానసికంగా అలసిపోయేలా ఉంది. కానీ మా కఠినమైన శిక్షణ బాగా పనిచేసింది. మా బృందం అంతా శిఖరాన్ని సురక్షితంగా చేరుకుని, అక్కడ జాతీయ జెండాను ఎగురవేసి, ఎటువంటి గాయాలు లేకుండా తిరిగి కిందికి చేరుకుంటామని నేను ముందే అనుకున్నాను. ఎవరెస్ట్ అధిరోహణతో నా కల నిజమైంది. నా జీవితం మారిపోయింది. ఎవరెస్టు ఎక్కడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు ఏదీ అసాధ్యం కాదని నమ్ముతున్నాను. నాలో భయాలన్నీ పోయాయి. సాయుధ దళాలలో చేరాలని ఆశపడుతున్నాను’ అని అఫ్రీన్ తెలిపింది.
ఎన్‌సీసీలో చేరి…
నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఎన్‌సీసీలో చేరాను. అప్పుడు ఒక క్యాంప్, పదో తరగతిలో మరొక ఎస్‌సీసీ క్యాంప్‌నకు వెళ్లాను. తర్వాత సీనియర్ డివిజన్‌లో చేరాను. ఈజేఎం కళాశాలలో చేరిన తర్వాత కూడా ఎన్‌సీసీలో కొనసాగాను. ఎన్‌సీసీ బీ సర్టిఫికేట్ పరీక్షల పొడిగింపుతో ఎవరెస్ట్ యాత్రలో పాల్గొనే అవకాశం వచ్చింది. లద్దాక్‌లోని చుచోట్ షామా అనే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను ఎవరెస్ట్ ఎక్కుతానని ఎప్పుడూ ఊహించ లేదు. మేము పాఠశాలలో ఎవరెస్ట్ శిఖరం గురించి చదివాం. చాలా మంది శిఖరాన్ని అధిరోహించి రికార్డులు సృష్టిస్తారని తెలుసు కున్నాం. కానీ నేనూ ఒక రోజు వారిలో ఒకదాన్ని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కూడా ఇది నిజమేనా అనే సందేహం వస్తుంది.
– అబిదా అఫ్రీన్