మాదకద్రవ్యాలకు అలవాటుపడొద్దు : వర్థంతి సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భగత్‌సింగ్ వర్థంతిని పురస్కరించుకుని యువజనోత్సవాల ముగింపు సభను నిర్వహించారు. దీనికి ముందుగా నారాయణగూడ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు యువజన విదార్థి ప్రదర్శన నిర్వహించారు. భగ్‌త్‌సింగ్ అమర్‌రహే..ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుదాం..మత్తుపానియాలను ప్రభుత్వం సమర్దవంతంగా అరికట్టాలని నినదించారు. ఎస్వీకేలో జరిగిన సభలో ప్రముఖ సినిమా కళాకారుడు పసునూరి శ్రీనివాసరావు, సినీయాక్టర్ పూజ, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కిరణ్‌రెడ్డి, సుప్రజ ఆస్పత్రి ఎండీ విజయ్ కుమార్, ఎఎన్‌డీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ మల్లేశ్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, మాజీ నాయకుడు ఎం మహేందర్ మాట్లాడారు.
భగత్‌సింగ్ దేశం కోసం ప్రాణాలర్పించారని వారు ఈ సందర్భంగా చెప్పారు. దేశ ప్రజల పట్ల ఆయనకున్న విశ్వాసం, వారి కోసం పోరాడాలన్న దీక్ష, పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువేనని వివరించారు. 23 ఏండ్ల వయస్సులోనే బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా సరైన అవగాహనతో పోరాడారని గుర్తు చేశారు. నేడు దేశ భక్తికి అర్థం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేజీలపై చెప్పేదొకటి, ఆచరణలో చేసేది మరోకటిగా ఉందని తెలిపారు. వారు ఏది చెబితే అదే చేయాలనే ధోరణి పాలకుల్లో పెరగిందన్నారు. చేసే పని సరైందిగా ఉండాలని యువతకు సూచించారు. ఉస్తాద్ భగత్‌సింగ్‌లు కాదు..ఉరితాడును ముద్దాడిన భగత్‌సింగ్‌లు కావాలని సూచించారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను మంచిగా బతికితే చాలు..ఇతరులు ఏమైపోతే నాకేంటి? అనే స్థితి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నాడు భగత్ సింగ్ ఇందుకు భిన్నంగా ఆలోచించారని గుర్తు చేశారు. మరో పక్క యువత మత్తుపానియాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయటమే గాకుండా దేశభక్తిని, సమాజం పట్ల బాధ్యతను విస్మరింప జేస్తుందని తెలిపారు. భగత్‌సింగ్ వర్థంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బస్తీలు, పాఠశాలల్లో క్రీడలు నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు మెమోంటోలు, బహుమతులు కిరణ్‌రెడ్డి, పూజ, విజయకుమార్, మల్లేశ్, మహేందర్‌ల చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో డీవైఎప్‌ఐ జిల్లా నాయకులు సునీల్, రజినీకాంత్, ప్రశాంత్, నాగేందర్, అర్జున్, ప్రవీణ్, గోపని మనోజ్ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్, డీవైఎఫ్‌ఐ నాయకుడు రాజయ్య వందన సమర్పణ చేశారు.


