Sunday, October 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభగ్గుమన్న బ్యాంకింగ్‌, బీమా రంగం

భగ్గుమన్న బ్యాంకింగ్‌, బీమా రంగం

- Advertisement -

అత్యున్నతస్థాయి పోస్టుల్లో ప్రయివేటు వ్యక్తుల నియమకాలపై వ్యతిరేకత
దేశవ్యాప్తంగా బ్యాంకు, బీమా ఉద్యోగుల ఆందోళనలు
ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌
బ్యాక్‌డోర్‌ చర్యల్ని అంగీకరించం : యుఎఫ్‌బియు

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల్లో మేనేజింగ్‌ డైరెక్టర్లు, డైరెక్టర్లుగా ప్రయివేటు వ్యక్తుల్ని నియమించుకోవాలనే కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయంపై బ్యాంకింగ్‌, బీమా రంగాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రయివేటు వ్యక్తుల ప్రమేయం ఏంటని ప్రశ్నించాయి. కచ్చితంగా ఇది ప్రయివేటీకరణ చర్యే అనీ, వీటిని సమైక్యంగా తిప్పికొడతామని ఆయా సంస్థల ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భారతదేశంలో లక్షలాది బ్యాంకు ఉద్యోగులను ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది యూనియన్ల వేదిక యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బీయు) తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ రంగంపై దాడే అని అభివర్ణించింది. పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకులు, బీమా కంపెనీలలో మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, పదవులను ప్రయివేటు రంగ అభ్యర్థులకు కట్టబెట్టేలా కేంద్ర ప్రభుత్వంలోని అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది క్యాబినెట్‌ (ఏసీసీి) మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ మార్గదర్శకాల చట్టబద్దతను ఏఐబిఇఏ, ఏఐబిఒసీ, బెఫీ, ఎన్‌సిబిఇ, ఎఐబిఒఎ, ఐఎన్‌బిఒసి, ఎన్‌ఒబిడబ్ల్యు, ఎన్‌ఒబిఒ సంఘాల ఉమ్మడి వేదిక యుఎఫ్‌బియు సవాల్‌ చేసింది.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1955, బ్యాంకింగ్‌ కంపెనీస్‌ యాక్ట్‌ 1970, 1980, ఎల్‌ఐసి యాక్ట్‌ 1956లను సవరించకుండానే ఈ మార్గదర్శకాలు జారీ చేయడం చట్టవిరుద్దమని పేర్కొంది. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనేనని ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 మరియు 77 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్‌ అధికారాలు పార్లమెంటు చేసిన చట్టాలకు అనుగుణంగా ఉండాలని యుఎఫ్‌బియు స్పష్టం చేసింది. అర్హత లేదా నియామక ప్రక్రియల్లో ఏదైనా మార్పు చట్టసభ సవరణ ద్వారా జరగాలనీ, కేవలం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా కాదని తేల్చిచెప్పింది. సీనియర్‌ పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకర్లు కూడా ఈ పాలసీ మార్పుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ”ఇది పీఎస్‌బీ, బీమా సంస్థల ఉనికికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎస్‌బీఐ లాంటి పెద్ద సంస్థల్లో ఒక ప్రొబేషనరీ ఆఫీసర్‌ సంవత్సరాల సేవ, అనుభవం ద్వారా చైర్మెన్‌గా ఎదగగలడు.

ప్రభుత్వ చర్యలతో వారికి ఇకపై ఆ అవకాశాలు దక్కవు. ప్రయివేటు వ్యక్తుల్ని ఉన్నత స్థానాల్లోకి అనుమతించడం వల్ల ప్రభుత్వ బ్యాంకింగ్‌ వ్యవస్థలు దెబ్బతింటాయి” అని ఓ సీనియర్‌ అధికారి బిజినెస్‌ స్టాండర్డ్‌తో పేర్కొన్నారు. మరోవైపు యుఎఫ్‌బీయు కూడా కేంద్రం వైఖరిపై నిరసన వ్యక్తం చేసింది. ప్రయివేటు వ్యక్తులతో నియామకమే చట్టవిరుద్దమనీ, దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల లక్ష్యాలు దెబ్బతింటాయని తెలిపింది. అంతర్గత ఉద్యోగులకు పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందనీ, నియామకాల్లో ప్రయివేటు హెచ్‌ఆర్‌ సంస్థలు ప్రవేశిస్తాయనీ, ప్రభుత్వ అనుకూల ప్రయివేటు వ్యక్తుల ఆధిపత్యం పెరిగే ప్రమాదమూ ఉందని హెచ్చరించింది. ”ఏసీసీ మార్గదర్శకాలు ప్రభుత్వ రంగ విత్త సంస్థలపై నిర్మాణాత్మక దాడి. పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకింగ్‌, బీమా అనేవి ప్రయోగాల కోసం వాడే వస్తువులు కాదు. అవి ఆర్థిక న్యాయం, జాతీయ సార్వభౌమత్వ రాజ్యాంగ సాధనాలు. పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వానికి వెన్నెముక. వాటి స్వభావాన్ని నిర్వీర్యం చేయడానికి లేదా ప్రయివేటీకరించడానికి బ్యాక్‌డోర్‌ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతింబోమని” స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -