కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన డిచ్పల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.
సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు కలెక్టర్ వెంట ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, తహసీల్దార్ సతీష్, స్థానిక అధికారులు ఉన్నారు.



