ఆయన మృతి తీరని లోటు
సైద్ధాంతిక ప్రత్యామ్నాయం ఇవ్వగలిగేది ఎర్రజెండానే: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
భారీగా కదిలొచ్చిన ఎర్రదండు.. ఎరుపెక్కిన చౌటుప్పల్
భూపాల్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పేద బడుగు బలహీనవర్గాల ముద్దుబిడ్డ చింతల భూపాల్‌రెడ్డి నిఖార్సైన కమ్యూనిస్టు అనీ, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు నడిపారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బుధవారం సీపీఐ(ఎం) నేత, చౌటు ప్పల్ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీగా కదిలి వచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. భూపాల్‌రెడ్డి ఇంటివద్ద నుంచి అంతిమయాత్ర ప్రారంభమై జాతీయ రహదారి వెంట సీపీఐ(ఎం) పట్టణ కార్యాలయం వరకు సాగింది. అంతిమయాత్రకు భారీగా ఎర్రదండు కదిలొచ్చింది. చౌటుప్పల్ పట్టణం ఎరుపెక్కింది.
భూపాల్ రెడ్డి చేసిన ఉద్యమాలను, సేవలను గుర్తు చేసుకుంటూ పీఎన్‌ఎం కళాకారులు పాటలు పాడారు. భూపాల్‌రెడ్డి భౌతికకాయానకి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎండీ జహంగీర్, మాజీ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు రాంపల్లి రమేష్, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సంతాప సభలో తమ్మినేని ప్రసంగించారు. మొక్కవోని ధైర్యంతో ఒకానొక సమయంలో మావోయిస్టులతోనూ పోరాడిన ఘనత భూపాల్ రెడ్డిది అని గుర్తు చేశారు. నేడు రాజకీయాలు చూస్తుంటే చాలామంది నాయకులు పలుకుబడి, డబ్బు సంపాదన లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.
కానీ జీవితాంతం పేద ప్రజలు, నమ్మిన ఆశయం కోసం నిలబడిన మహానేత భూపాల్ రెడ్డి అని కొనియాడారు. భారతదేశంలో కమ్యూనిస్టులకు భవిష్యత్ ఉందా? అని చర్చ కాకుండా కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్ ఉందా అనేది చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితులు.. మతోన్మాదం, నియంతృత్వం, లౌకిక విధానాన్ని నాశనం చేసే ధోరణలను పరిశీలిస్తే.. వీటన్నింటినీ ఎదుర్కొనేది కమ్యూనిస్టు సిద్ధాంతం మాత్రమే అని పేర్కొన్నారు. మనుషులను చీల్చడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య వైషమ్యాలు పెంచడం బీజేపీ ఎజెండా అని అన్నారు. ప్రజల మధ్య ఉద్రేకాలను ఉన్మాదానాన్ని రెచ్చగొట్టడం బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు. మతోన్మాదం విస్తరణ, లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ధోరణిని ఎదుర్కోవడంలో సరైన పద్ధతిని ఎంచుకోకపోవడమే బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటమికి కారణమని వివరించారు.
రాజకీయ ప్రత్యామ్నాయంతోనే బీజేపీని ఓడించలేమని, సైద్ధాంతిక ప్రత్యామ్నాయం ఇవ్వగలిగేది శక్తి కేవలం ఎర్రజెండాకే ఉంటుందని చెప్పారు. రాబోయే కాలంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో భూపాల్ రెడ్డి లాంటి ఉత్తమ కమ్యూనిస్టుల మృతి తీరని లోటని, ఆయన ఆశయ సాధన కోసం చౌటుప్పల్ ప్రాంత ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లా డుతూ.. శత్రు సైన్యాలను ఎదుర్కొని ప్రజల కోసం నిలబడిన నేత భూపాల్ రెడ్డి అని కొనియాడారు. కమ్యూనిస్టు నాయకుడుగా ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన పోరాడాడని పేర్కొన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూనే ప్రజల ఆశయం కోసం పనిచేసిన ఘనత భూపాల్ రెడ్డికి దక్కిందన్నారు.
కందాల రంగారెడ్డి మరణం తర్వాత ఆయన లేని లోటును పూడ్చేందుకు.. ప్రజల శ్రేయస్సు కోసం ఆర్టీసీ ఉద్యోగాన్ని వదిలేసి పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. ఎండీ జహంగీర్ మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో భూపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజల కోసం పోరాటాల్ని బలోపేతం చేయడమే ఘనమైన నివాళి అని అన్నారు. భూపాల్ రెడ్డి అంతిమయాత్రలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అంతిమయాత్రలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, కల్లూరు మల్లేష్, మాటూరు బాలరాజు, ఎండి పాషా, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్, ఆనగంటి వెంకటేష్, విప్లవ వెంకటేష్, చింతల దామోదర్ రెడ్డి, పాండు, మేక అశోక్ రెడ్డి, చీర్క సంజీవరెడ్డి, గోపగోని లక్ష్మణ్, దండా అరుణ్ కుమార్, బత్తుల శ్రీశైలం, బత్తుల దాసు పాల్గొన్నారు.



