Friday, June 13, 2025
E-PAPER
Homeఖమ్మంపెద్ద పార్టీ నేత.. బుద్దిమాత్రం వంకర

పెద్ద పార్టీ నేత.. బుద్దిమాత్రం వంకర

- Advertisement -

పెద్దనాయకుని పేరుచెప్పి వివాహితను లోబర్చుకునే యత్నం
విషయం బయటకు పొక్కడంతో సెటిల్మెంట్ కోసం సిట్టింగ్
మహిళా నాయకురాలి ఇంట్లో నిన్న పంచాయితీ
కొలిక్కిరాని వివాదం… ఆందోళనకు బాధితురాలి సమాయత్తం
‘ఏమి చేసుకుంటుందో చేసుకోమను..’ నిందితునికి పెద్దనాయకుని వత్తాసు!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఆదర్శంగా ఉండాల్సిన నేతలు అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. మహిళా నేతలు, కార్యకర్తల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఓ వివాహితురాలికి మాయమాటలు చెప్పి లోబర్చుకునే యత్నం చేయటం. అంతలోనే విషయం బయటకు పొక్కి వివాదానికి దారితీసింది. ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలో దీనికి సంబంధించిన పంచాయతీ బుధవారం రహస్యంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ నేత పేరు….. పేరుకు తగ్గట్టే ఆయన బుద్ధి వంకర. “పెద్దపార్టీలో పెద్దనాయకుడు నాకు బాగా తెలుసు… ఆయనకు నేను ఎంత చెప్పితే అంత… నీ ఆర్థికస్థితిగతులు కూడా ఏమంత బాగోలేవు కాబట్టి… పెద్దనాయకున్ని ఒప్పించి నీకు నెలవారీ జీతం పెట్టించా. ఇక మీదట కూడా నేను చెప్పినట్టు చేస్తే నువ్వు.. నీ కుటుంబం హాయిగా బతకవచ్చు. ఎప్పటి నుంచో పార్టీలో తిరుగుతున్నావ్… నీకు తగిన ప్రాధాన్యత దక్కేలా చూస్తా… పార్టీ జిల్లా అధ్యక్షునికి లేని ప్రియార్టీ నాకు ఉంది. నా మాట అంటే ఆ పెద్ద నాయకునికి వేదవాక్కు…’ అని ఓ పార్టీలో క్రీయాశీలక కార్యకర్తగా ఉన్న వివాహితకు అదే పార్టీకి చెందిన ఖమ్మం నగర నాయకుడు ఎన్నో మాయమాటలు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలకు ఆ మహిళా కార్యకర్త కూడా కృతజ్ఞతలు తెలిపింది. దీనిని అడ్వాంటేజ్ తీసుకొని ఆ రోజు నుంచి ఆమెకు తరచూ ఫోన్ చేయటం… తన కోరికను ఇన్ డైరెక్ట్గా వెల్లడించటం ప్రారంభించాడు. దాంతో ఆ వివాహిత ఆందోళన చెందింది. కొద్దిరోజులుగా పార్టీకి దూరంగా ఉంటోంది. అయినా వేధింపులు తగ్గకపోవటంతో పార్టీ జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్లింది.

శ్రీనగర్ కాలనీలో రహస్య పంచాయితీ!.

ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలో ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలి ఇంట్లో బుధవారం ఈ వ్యవహారానికి సంబంధించిన రహస్య పంచాయితీ జరిగింది. పెద్ద నాయకుని సూచన మేరకు విషయం బయటకు పొక్కకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని బాధితురాలికి స్థానిక నాయకులు సూచించారు. పంచాయతీ పెద్దలు, బాధితురాలు, నిందితుడు తప్ప మిగతా ఎవర్నీ లోనికి అనుమతించకుండా గుట్టుచప్పున వ్యవహారం నడిపారు. కానీ ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు దీనిని లీక్ చేశారు. గంటలకొద్దీ కూర్చున్నా పంచాయతీ తెగక పోవటంతో వివాహిత ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంది. తనకు న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించింది.

మహిళకు అన్యాయం జరిగినా పట్టని నేతలు..

పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించే మహిళా కార్యకర్త గోడు వినేవారు కరువయ్యారు. నిందితునికి పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో స్థానిక నాయకులు కూడా అతనికే వత్తాసు పలికారు. అయినా పంచాయతీలో ఉన్న జిల్లాస్థాయి మహిళా నాయకురాలు కానీ, మిగిలిన నాయకులు కానీ తమకేమీ పట్టనట్టు వ్యవహరించటం… పైపెచ్చు.. బుద్ధివంకర’ నేతకు వత్తాసు పలకటంతో బాధితురాలు సంకట స్థితిలో పడింది. పంచాయతీ ఎటూ తేలకపోవటంతో పెద్ద నాయకునికి సమాచారం ఇచ్చారు. ‘ఆమె ఏమి చేస్తుందో చూద్దాం… నువ్వు అక్కడి నుంచి వెళ్లిపో..’ అనటంతో చడీచప్పుడు కాకుండా నిందితుడు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది. బాధితురాలు మాత్రం తనకు న్యాయం జరగకపోతే పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. వేదిక మార్చటమో…కొంత గ్యాప్ ఇచ్చయినా… విషయం బయటకు రాకుండా సర్దుబాటు చేయాలనే యోచనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -