Thursday, December 25, 2025
E-PAPER
Homeఆటలులిస్ట్‌-ఏ క్రికెట్‌లో బీహార్‌ నయా చరిత్ర

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో బీహార్‌ నయా చరిత్ర

- Advertisement -

50 ఓవర్లలో 574పరుగులతో రికార్డు పుటల్లోకి..
శతకాలతో మెరిసిన కోహ్లి, రోహిత్‌, ఇషాన్‌
32బంతుల్లోనే సెంచరీతో సకిబుల్‌ గని కూడా..
వైభవ్‌ సూర్యవంశీ డబుల్‌ సెంచరీ మిస్‌
విజయ్ హజారే వన్డే టోర్నీ

వన్డే ఫార్మాట్‌ క్రికెట్‌లో బీహార్‌ నయా చరిత్రను లిఖించింది. 50ఓవర్లలో 574పరుగులు కొట్టిన తొలి జట్టుగా బీహార్‌ ఈ రికార్డును నెలకొల్పింది. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ(190), ఆయుష్‌ ఆనంద్‌(116), నకీబుల్‌ గనీ(128) కూడా శతకాలతో రాణించడంతో నిర్ణీత 50ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 574పరుగులు చేసింది.

అంతకుముందు ఈ రికార్డు తమిళనాడు జట్టు పేరిట ఉండేది. తమిళనాడు జట్టు 2022లో అరుణాచల్‌ప్రదేశ్‌పై 2వికెట్ల నష్టానికి 506పరుగులు చేసి రికార్డు పుటల్లోకెక్కింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు ఇంగ్లండ్‌ పేరిట ఉంది. ఆ జట్టు 2022లో నెదర్లాండ్స్‌పై 50ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. తాజాగా బీహార్‌ జట్టు ఆ రెండు రికార్డులను బ్రేక్‌ చేసి నయా చరిత్రను సృష్టించింది.

బెంగళూరు : విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో తొలిరోజే పలు రికార్డులు నమోదయ్యాయి. బీహార్‌ జట్టు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రికార్డు స్కోర్‌ నమోదు చేసి నయా చరిత్రను సృష్టించగా.. బీహార్‌ కెప్టెన్‌ సకిబుల్‌ గని కేవలం 32బంతుల్లో, జార్ఖండ్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 33బంతుల్లోనే శతకాలు కొట్టిన బ్యాటర్లుగా రికార్డుల్లోకెక్కారు. అలాగే టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, దేవదత్‌ పడిక్కల్‌కి తోడు 14ఏండ్ల వైభవ్‌ సూర్యవంశీ భారీ శతకాలతో మెరిసారు. వీరంతా ఆయా రాష్ట్రాల తరఫున విజయ్ హజారే వన్డే టోర్నీలో ఆడి సెంచరీలతో రాణించారు. విరాట్‌ కోహ్లి ఢిల్లీ తరఫున శతకం బాదగా.. రోహిత్‌ శర్మ(ముంబయి), ఇషాన్‌ కిషన్‌(జార్ఖండ్‌), దేవదత్‌ పడిక్కల్‌ కర్నాటక తరఫున శతకాలతో రాణించారు.

ఇక యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ రాంచీ వేదికగా అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీహార్‌ తరఫున ఆడి కేవలం 36బంతుల్లోనే శతకం పూర్తి చేసి రికార్డులకెక్కాడు. కేవలం 14 ఏండ్ల 272 రోజుల వయసులోనే పురుషుల లిస్ట్‌-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి, ఏబీ డివిలియర్స్‌ (64బంతులు) ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. బీహార్‌ ఆటగాళ్లు ఆయుష్‌ ఆనంద్‌(116), నకీబుల్‌ గనీ(128) కూడా శతకాలతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 574పరుగులు చేసి రికార్డు పుటల్లోకెక్కింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అరుణాచల్‌ప్రదేశ్‌ జట్టు 42.1ఓవర్లలో 177పరుగులకే ఆలౌటైంది. జైపూర్‌ వేదికగా జరిగిన గ్రూప్‌-ఏ లీగ్‌ మ్యాచ్‌లో ముంబయి జట్టు 8వికెట్ల తేడాతో సిక్కింపై ఘన విజయం సాధించింది.

ముంబయి తరఫున టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(155; 94బంతుల్లో 18ఫోర్లు, 9సిక్సర్లు) భారీ శతకంతో మెరిసాడు. దీంతో సిక్కిం జట్టు నిర్దేశించిన 237పరుగుల లక్ష్యాన్ని ముంబయి జట్టు కేవలం 30.3ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జార్ఖండ్‌ తరఫున ఇషాన్‌ కిషన్‌ సెంచరీతో మెరిసాడు. కర్ణాటకతో జరుగుతున్న గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో బుధవారం జార్ఖండ్‌ జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 412 పరుగుల భారీస్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌కి తోడు విరాట్‌ సింగ్‌(88), కుమార్‌ కుషగ్ర(63) అర్ధసెంచరీలతో రాణించారు. భారీ లక్ష్యాన్ని 47.3ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(54), దేవదత్‌ పడిక్కల్‌(147) సెంచరీలో రాణించారు. అభిమవ్‌ మనోహర్‌(56), ధృవ్‌ ప్రభాకర్‌(40) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.

ఢిల్లీ చేతిలో ఆంధ్ర ఓటమి
బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్‌ ఎక్సలెన్స్‌ స్టేడియంలో ఢిల్లీ చేతిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు 8వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఢిల్లీ తరఫున టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి బరిలో దిగి శతకంతో రాణించాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 37.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లి(131) శతకానికి తోడు ఓపెనర్‌ ప్రియాన్హు ఆర్యా(74), నితీశ్‌ రాణా(77) అర్ధసెంచరీలతో రాణించారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రజట్టును కెప్టెన్‌ రికీ బుయ్(122) సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి(23), ఎం రెడ్డి(27), వరప్రసాద్‌(28) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు సిమ్రన్‌జీత్‌ సింగ్‌కు ఐదు, ప్రిన్స్‌ యాదవ్‌కు మూడు వికెట్లు దక్కాయి.

సకిబుల్‌ 32బంతుల్లోనే…
బీహార్‌ కెప్టెన్‌ సకిబుల్‌ గని దేశవాళీ క్రికెట్‌లో తక్కువ బంతుల్లోనే సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌తో బుధవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో గని కేవలం 32 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. ఓవరాల్‌గా 40బంతుల్లో 10ఫోర్లు, 12సిక్సర్ల సాయంతో 128పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక జార్ఖండ్‌ తరఫున ఇషాన్‌ కిషన్‌ కేవలం 33 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. అంతకుముందు ఈ రికార్డు పంజాబ్‌ బ్యాటర్‌ అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరిట ఉండేది అతడు గత ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌పై కేవలం 34బంతుల్లోనే సెంచరీ కొట్టారు. సకిబుల్‌ గని, ఇషాన్‌ కిషన్‌ల దెబ్బకు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -