Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయంనవంబర్‌ 22లోగా బీహార్‌ ఎన్నికలు

నవంబర్‌ 22లోగా బీహార్‌ ఎన్నికలు

- Advertisement -

నిర్వహణకు అన్ని విధాలా సిద్ధం
ఎన్ని దశల్లో జరపాలన్నదానిపై త్వరలో నిర్ణయం
బ్యాలెట్‌లో తొలిసారిగా అభ్యర్థుల కలర్‌ ఫొటోలు : సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్‌ 22లోగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని విధాలుగా సిద్ధమైందని వివరించారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థుల కలర్‌ ఫొటోలను పెట్టనున్నామనీ, ఇలా చేయటం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. బీహార్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారంనాడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఇక ఆదివారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో బీహార్‌ రాజధాని పాట్నాలో సమావేశమైంది.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సింధు, వివేక్‌ జోషిలతో కలిసి జ్ఞానేశ్‌ కుమార్‌ మాట్లాడారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు రోజులపాటు పర్యటించి, సమీక్షించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పుట్టిన తేదీ, పౌరసత్వానికి ఆధార్‌ ధ్రువీకరణ కాదని మరోసారి స్పష్టం చేశారు. చట్టానికి లోబడే ఆధార్‌ను ఉపయోగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామనీ, గరిష్టంగా 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండనుందని అన్నారు. ఇప్పటికే బూత్‌ స్థాయి అధికారుల(బీఎల్‌ఓలు)కు శిక్షణ పూర్తి చేశామని, ఎన్ని దశల్లో పోలింగ్‌ నిర్వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థుల కలర్‌ ఫొటోలను ఉంచనున్నామన్నారు. తద్వారా అభ్యర్థులను ఓటర్లు తేలికగా గుర్తుపట్టేందుకు వీలుంటుందని తెలిపారు. సీరియల్‌ నంబర్‌ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈవీఎంలలో బ్యాలెట్‌ పేపర్‌ ఇన్‌సర్ట్‌ చేసినప్పుడు ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంటే గుర్తించడం కష్టమవుతోందనీ, ఎన్నికల గుర్తుల విషయమూ అంతేనని అన్నారు. ఈసారి నుంచి దేశవ్యాప్తంగా సీరియల్‌ నెంబర్‌ ఫాంట్లు పెద్దవిగా ఉండేలా, అభ్యర్థుల ఫొటోలు కలర్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

బీహార్‌లో 22 ఏండ్ల తర్వాత స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) చేపట్టామని సీఈసీ చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 243 నియోజకవర్గాల్లో ఒక్కోదానికి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ) ఉన్నారనీ, ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి వారికి 90,207 మంది బీఎల్‌ఓలు సహాయం చేశారని ఆయన తెలిపారు. ఎస్‌ఐఆర్‌తో అనర్హులను జాబితా నుంచి తొలగించామనీ, దీన్ని బీహార్‌ ఓటర్లు కూడా స్వాగతించారని వివరించారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఉందన్నారు. ఛాత్‌ పండుగను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో అంతే ఉత్సాహంతో బీహార్‌ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జ్ఞానేశ్‌ కుమార్‌ కోరారు.

వరుస సమావేశాలు
ఆదాయ పన్ను(ఐటీ) శాఖ, పోలీసు శాఖ, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో ఎన్నికల కమిషన్‌ ఆదివారంనాడు సమావేశమైంది. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ పథకంపై సమీక్ష జరిపింది. అనంతరం చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారులు, రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారి, సెంట్రల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ప్రతినిధులతో సమావేశమైంది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్‌ సెక్రెటరీ(సీఎస్‌), డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ), ఇతర బ్యూరోక్రాట్లతో రాష్ట్రస్థాయిలో సమన్వయంపై ఎన్నికల సంఘం సమీక్ష జరిపింది.

ఒకట్రెండు దశల్లో ఎన్నికలు
ఎన్నికల కమిషన్‌తో జరిపిన సమావేశంలో బీహార్‌ ఎన్నికలు ఒకటి లేదా రెండు విడతల్లో పూర్తి చేయాలని వివిధ పార్టీలు కోరాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని నితీశ్‌ సారథ్యంలోని జేడీ(యూ) కోరగా.. దాని భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ మాత్రం ఒకటి లేదా రెండు దశల్లో ఎన్నికలు జరపాలని సూచించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆర్జేడీ ఒకటి లేదా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత తెలిపింది.

కాగా 243 స్థానాలు కలిగిన బీహార్‌ అసెంబ్లీకి గడువు ఈ ఏడాది నవంబర్‌ 22తో ముగియనుంది. ఆ గడువులోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ.. గడువులోగా ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పింది. ఒకటి రెండు దశల్లోనే వీటిని పూర్తి చేయాలనే అభ్యర్థనలు వచ్చాయనీ, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 2020లో మూడు విడతల్లో పోలింగ్‌ జరుగగా.. అంతకుముందు ఐదు విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. బీహార్‌లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -