నవతెలంగాణ – హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఎన్డీయే కూటమి శుక్రవారం మేనిఫెస్టో విడుదల చేసింది. కోటి ఉద్యోగాల హామీతో పాటు కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే తమ లక్ష్యంగా అందులో ప్రకటించుకుంది. నేడు పాట్నాలోని మౌర్య హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్డీయే జాయింట్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్‌తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సరిగ్గా వారం ఉంది. నవంబర్ 6 లోపు … నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ వికసిత్ బీహార్ కోసమంటూ ఎన్నికల మేనిఫెస్టోను ఎన్డీయే కూటమి విడుదల చేసింది.
వలస కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రంలో కోటి ఉద్యోగాల హామీ కీలక ప్రకటనగా మారింది. అలాగే.. మహిళా సాధికారత పేరిట లక్షపతి దీదీల హామీపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. అధికారంలోకి మళ్లీ వస్తే, నైపుణ్య గణాంక సర్వే నిర్వహిస్తామని ఎన్డీయే కూటమి హామీ చేర్చింది. ఇప్పటికే … బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విపక్ష మహాగట్‌బంధన్ విడుదల చేసిన సంగతి విదితమే. బీహార్ కా తేజస్వి ప్రణ్ పత్ర అనే టైటిల్‌తో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పిస్తామని ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేస్తామని, పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకువస్తామని తెలిపింది. రైతులు పండించిన పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఇస్తామని, మండీ, మార్కెట్ కమిటీలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. జన్ స్వాస్థ్య సురక్ష యోజన కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని, జనాభాకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్‌ను పెంచుతామని హామీ ఇచ్చింది.

 
                                    