Friday, July 25, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌ ఎస్‌ఐఆర్‌ తిప్పలు

బీహార్‌ ఎస్‌ఐఆర్‌ తిప్పలు

- Advertisement -

రెండ్రోజుల కూలిని కోల్పోయాొం ఫారమ్‌ నింపటానికి డబ్బులడిగారు
రసీదులు ఇవ్వకుండానే ప్రక్రియ
చాలా ఇబ్బందులకు గురయ్యాం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పబ్లిక్‌ హియరింగ్‌లో ప్రజల ఆవేదన
పాట్నా :
బీహార్‌లో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ఇప్పటికే అనేక విమర్శలకు దారి తీసింది. ఈ ప్రక్రియను నిర్వహి స్తున్న సమయం, దాని తీరుపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం విదితమే. అయితే ఈ ప్రక్రియ బీహార్‌ ప్రజలను కూడా ఆందోళనకు గురి చేసింది. మరీ ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందివారైతే.. తాము రెండ్రోజుల పనిని కోల్పోయామనీ, ఫలితంగా ఆ రెండ్రోజులకు చెందిన వేతన చెల్లింపులను తాము కోల్పోవాల్సి వచ్చిందని వాపోయారు.
కతిహార్‌కు చెందిన దినసరి కూలీ ఫూల్‌ కుమారి దేవీ(50) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా తాను అనుభవించిన బాధను వెళ్లగక్కింది. ”బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ) నా ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో అడిగారు. నా దగ్గర ఫోటో లేకపోవటంతో నేను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోటో స్టూడియోకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నా దగ్గర డబ్బులేకపోవటంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెచ్చుకున్న బియ్యాన్ని అమ్మాల్సి వచ్చింది. దీంతో నేను తిండికి దూరమయ్యాను” అని ఫూల్‌ కుమారి దేవీ వాపోయారు. ఈనెల 21న పాట్నాలోని భారత్‌ జోడో అభియాన్‌, జన్‌ జాగరణ్‌ శక్తి సంఘటన్‌, నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌, స్వరాజ్‌ అభియాన్‌, కోసి నవనిర్మాణ్‌ మంచ్‌ వంటి అనేక సంస్థలు నిర్వహించిన ప్రజా విచారణ (పబ్లిక్‌ హియరింగ్‌) ఆమె ఈ విషయాన్ని చెప్పారు.

ఈ కార్యక్రమంలో.. ఎస్‌ఐఆర్‌ ద్వారా ఫూల్‌ కుమారి తాను అనుభవించిన బాధను వెళ్లగక్కారు. ”నేను ఫోటోలు తీసుకురావటం కోసం ఒక రోజు, నా భర్త, నా ఫారమ్‌లను నింపాల్సి రావటంతో ఇంకో రోజును.. నేను ఇలా రెండ్రోజుల పనిని, దాని ద్వారా వచ్చే రూ.1000 కూలిని కోల్పోయాను. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా మారింది” అని ఆమె వాపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎన్నికల సంఘం ఆమోదించే 11 పత్రాలలోని లేని ఆధార్‌, ఓటర్‌ ఐడీ వివరాలను ఈ ప్రక్రియలో తాను సమర్పించానని ఫూల్‌ కుమారి వెల్లడించటమే.

ఒక్క ఫూల్‌ కుమారి మాత్రమే కాదు.. పదుల సంఖ్యలో ప్రజలు ఈ ఎస్‌ఐఆర్‌ ద్వారా తాము ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులను వెళ్లగక్కారు. ”నేను గతేడాది సంభవించిన భారీ వరదల్లో నా ముఖ్యమైన పత్రాలన్నీ కోల్పోయాను. ఇప్పుడు పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి నేను ఎక్కడికి వెళ్లాలి” అని సుపాల్‌ జిల్లాకు చెందిన రాజేశ్‌ కుమార్‌ వాపోయాడు. బీహార్‌ విపత్తు నిర్వహణ డేటా ప్రకారం గతేడాది సంభవించిన వరదలతో దాదాపు 56 లక్షల మంది ప్రభావితమయ్యారు. ఎస్‌ఐఆర్‌లో ఫారాలు నింపటానికి తాము ఇతరులకు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని మరికొందరు చెప్పారు. వాస్తవానికి బీఎల్‌ఓలు ఈ ఫారాలు నింపే బాధ్యతను దగ్గరుండి మరీ చూసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓల పనితీరు సరిగ్గా లేదనీ, ఈ ప్రక్రియలో వైఫల్యానికి ఇది ఒక నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. కతిహార్‌ జిల్లా బరారి ప్రాంతానికి చెందిన కాంచన్‌ దేవి దంపతులు నిరక్షరాస్యులు. ఫారమ్‌ను నింపటం కోసం తాము బీఎల్‌ఓ దగ్గరకు వెళ్లామనీ, ఇందుకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆ అధికారి తమకు చెప్పారని కాంచన్‌దేవీ వాపోయారు. అయితే ఓటరు జాబితా నుంచి ఎక్కడ పేరు తొలగిస్తారోనన్న భయంతో తాము ఇతరుల నుంచి రూ.100 అప్పుగా తీసుకొని, వేరే వ్యక్తికి ఇచ్చి ఫారమ్‌ను నింపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దినసరి కూలీలమైన తమకు ఈ పరిస్థితి కష్టంగా మారిందని చెప్పారు. కాంచన్‌ దేవిలా బాధను అనుభవించినవారు చాలా మందే ఉన్నారు. ఆమోదయోగ్యమైన పత్రాలలో ఆధార్‌, ఓటరు కార్డులు లేవన్న విషయం తమకు తెలియదనీ, తమ వద్ద ఈ రెండు కార్డులే ఉన్నాయని ఆమె చెప్పింది. ఇక ఫారమ్‌ కోసం తమకు రసీదులు కూడా ఇవ్వలేదని చాలా మంది చెప్పారు.

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటున్న మేధావులు, నిపుణులు
63 శాతం మంది వద్ద ఆ పత్రాలు లేవు భారత్‌ జోడో అభియాన్‌ బృందం జులై మొదటి వారంలో ఎనిమిది జిల్లాల్లో నిర్వహించిన ర్యాపిడ్‌ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వేలో భాగంగా 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 709 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. సర్వే నివేదిక ప్రకారం.. 2003 ఓటర్ల జాబితాలో లేని 18-40 ఏండ్ల వయసు గల ఓటర్లలో 63 శాతం మంది ఈసీ గుర్తించిన 11 పత్రాలలో ఏవీ కలిగి లేరు. చాలా మందికి ఓటర్‌, ఆధార్‌ కార్డులే ఉన్నాయి. ఇక 2.9 కోట్ల మంది ఓటర్లు తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉన్నదని సర్వే బృందం వెల్లడించింది.

ఎస్‌ఐఆర్‌ అవసరం లేదన్న నిపుణులు
పబ్లిక్‌ హియరింగ్‌లో భాగంగా ప్రజల అభిప్రాయాలు, బాధలు విన్న నిపుణులు.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తప్పుబట్టారు. ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ అవసరం లేదని పాట్నా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ అంజనా ప్రకాశ్‌ అన్నారు. ఈసీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందనీ, ఎస్‌ఐఆర్‌ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందని కేంద్ర సమాచార కమిషన్‌ మాజీ కమిషనర్‌ వజాహత్‌ హబీబుల్లా తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ) అపారమైన అధికారాన్ని ఉపయోగిస్తారని ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ అన్నారు. ఈసీఐ తన స్వంత చట్టాన్ని ఉల్లంఘిస్తోందనీ, ఇందులో చాలా అవకతవకలున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియ ప్రజలను ఎలా భయపెడుతుందో, ప్రాథమిక హక్కులను ఎలా దెబ్బ తీస్తుందో గమనించవచ్చని సామాజిక శాస్త్రవేత్త నందిని సుందర్‌ చెప్పారు. ఎస్‌ఐఆర్‌ మొత్తం ప్రక్రియే ప్రశ్నార్థకమని ఆర్థికవేత్త, ఎఎన్‌ సిన్హా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ మాజీ డైరెక్టర్‌ డి.ఎం దివాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలనీ, ఇది దళిత, వెనుకబడిన, మైనారిటీ వర్గాల జనాభాపై ప్రభావం చూపుతోందని ఫార్వర్డ్‌ ప్రెస్‌ వ్యవస్థాపకులు భన్వర్‌ మేఘవంశీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -