Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీజాపూర్‌ జాతీయ రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

బీజాపూర్‌ జాతీయ రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

- Advertisement -

– మీర్జాగూడ ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్‌
– చేవెళ్ల ప్రధాన రహదారిపై సీపీఐ(ఎం), ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-చేవెళ్ల

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి పనులు వెంటనే ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీపీఐ(ఎం) రంగారెడ్ది జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో అప్ప జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం అందరి హృదయాలనూ కలచివేస్తోందని అన్నారు. బీజాపూర్‌ జాతీయ రహదారిపై పడిన గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎన్జీటీలో స్టే తొలగిపోయిందని ప్రకటించిందని, వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలయ్యారని, ఆ పిల్లల సంరక్షణ పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిందని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారికి రూ.10లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించి అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్ల రోడ్డు పూర్తి అయ్యేలా కృషి చేయాలన్నారు. లేని పక్షంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్‌, పార్టీ చేవెళ్ల డివిజన్‌ కార్యదర్శి అల్లి దేవేందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ కార్యదర్శి బేగరి అరుణ్‌ కుమార్‌, అధ్యక్షులు శ్రీనివాస్‌, ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ (సీఐటీయూ) అధ్యక్షకార్యర్శులు రమేష్‌, నవాజ్‌, కోశాధికారి శ్రీశైలం, ఉపాధ్యక్షులు వెంకట్రాములు, నాయకులు మహేందర్‌, ఊరెళ్ళ రాజు, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -