స్పెండర్ ప్లస్ బైక్ స్వాధీనం
నవతెలంగాణ – పరకాల
జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ దొంగతనానికి పాల్పడ్డ యువకుడిని పరకాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి రూ.35 వేల విలువ చేసే మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం 07:30 గంటల సమయంలో పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బైక్ పై వస్తుండగా, పోలీసులు అతనిని ఆపి విచారించారు. సదరు వ్యక్తిని శ్రీనివాస కాలనీకి చెందిన మంద అరవింద్ (22) గా గుర్తించారు.
నిందితుడు అరవింద్ జల్సాలకు, త్రాగుడుకు అలవాటు పడి, డబ్బుల కోసం పిట్టవాడ ప్రాంతంలో ఇంటి ముందు పార్క్ చేసిన TS03EF8733 నంబర్ గల హోండా స్పెండర్ ప్లస్ బైక్‌ను దొంగిలించినట్లు విచారణలో అంగీకరించాడు. బాధితుడు చెక్క శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సకాలంలో స్పందించి దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ పి పవన్ , సిబ్బందిని పరకాల ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.



