Monday, March 16, 2026
E-PAPER
Homeదర్వాజబిలహరి రాగం

బిలహరి రాగం

- Advertisement -

అది మారెల్లాగు
మా ఊరికి వాయువ్యారణ్యం
తోడేళ్లకు నిత్యనివాసం-
నడి ఎండాకాలం, ఒక్కణ్ణే ఉన్నాను గొర్లెమ్మటి
చిప్పగొడ్డలి ఒక్కటే ధైర్యంగల పెద్దతోడు-
వారం కింద కురిసింది పెద్దవాన
వెన్నెల నక్షత్రాల సాక్షిగా వాగులన్నిట్లో
తొల్త ప్రవహించింది ఈ వాగే
ఇక్కడి స్టైలోగడ్డి మొలక
జీవాలకు పౌష్టికాహారం-
నేలకు ప్రణమిల్లుతున్న విల్లుల్లా ఉన్నై
మేతకు వంగిన గొర్లవీపులు
వింటిని వీడిన బాణాల్లా గంతులేస్తున్నై
తల్లుల పక్కన పిల్లజీవాలు-
ఎందరు ఎన్ని పోలికలు చెప్పినా
తోడేళ్లే మంచి ఉపమానం నా భయానికి
నీడకు చేరదీసిన చెట్లు
తలమీద ఎంత అనురాగం నిమారినా
వెదురుపొదలే గొప్ప స్నేహితులు
నా రాగాల కొత్తప్రపంచానికి-
నేను గొర్ల వెనకాల, నా వెనకాల గొర్లు
అదో చక్రీయ సేనాధిపత్యం-
గొర్లు మేసేది పిల్లలకు పొదుగివ్వడం కోసమే
తోడేళ్లది మాంసాభీష్టం
నాలో రాజుకున్నది బిలహరి రాగం
తంబుర వయోలిన్‌ మదంగం కంజీర అన్నీ గొర్లే-
గొర్లకు తెలివెక్కడిది, నేర్పినోడెవడు
కాపరికే లేనపుడు తెలివి యాణ్ణుంచొస్తది
వాటి ఎడ్డిముఖాలకు- తలొంచుకొని మేస్తున్నయి
జ్యామితి రూపాల్లో నలుమూలలు విస్తరిస్తూ
మారెల్లాగు కలయతిరుగుతూ
అందంగా ఎర్రెర్రని గొర్లు-
పట్నాల్లో పెద్దోల్లది, అడవిలో మగాలది తెలివి
బీడులో గొర్లది నాది
ఎరుక-
ఎరుకంటే ఉపకారం ఉత్పత్తి సేవ
తెలివంటే లాభం వ్యాపారం,పెట్టుబడి-
అదును చూసి వ్యాపారి
అమాయక పల్లెజనాల మీద పడ్డట్టు
మిట్టమధ్యాహ్నం తోడేలు మందల జొరబడ్డది-
Prey drive మొదలైంది
భయం మట్టడించింది గొర్లను
నిశ్శబ్ద వీక్షణ ప్రాణాంతక మృగం ధాటికి
దిక్కులేని అరుపులు అరుస్తూ
చెల్లాచెదురవుతున్నై దీనంగా గొర్లు-
Endurance hunting లో
తినదలచిన జీవాన్ని ఒంటరిని చేయడంలో
తోడేళ్లు పండితులు-
నేనే ఆయుధం ఆయుధమే నేను అన్నట్టు
గొర్లకు దాపున్నాను
శాల్తీ ఒకటిపోయినా ప్రాణం పోయినట్ఠే అనుకున్నా
కమ్మకత్తి తీసిన, నూరిన చిప్పగొడ్డలి చూపించిన
గొంగడి మడతలు విప్పి
Fladry గా మారిన-
నిటారుగా నిలబడింది, పళ్లికిలించింది
గుర్రుమని కోర విసిరింది నా మీదకు అన్నట్టు
గొర్ల అలసటపైకి-
Hazing, Disruptive Stimulation
Bio-Acoustics వాడుకున్నా
తాతల కాలం నుండి వస్తున్న
వారసత్వ రక్షణ కవచాన్ని తొడుక్కున్నా-
అడవిలో నలబై ఏండ్ల కిందట
అట్లా ఆ తోడేలునైతే జయించిన-
మరి ఇప్పుడు దేశాలకు దేశాలనే గొంతు కొరుకుతూ
Surplus Killing లో
ఆరితేరిన తెల్ల మహాతోడేలును తరుముడెట్లా?
యోచనలో, యోజనలో
మీరూ కలసి వస్తారు కదూ!

  • డా.బెల్లి యాదయ్య, 98483 92690
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -