Thursday, April 2, 2026
E-PAPER
Homeజాతీయంఅమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం

అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం

- Advertisement -

నేడు రాజ్యసభ ముందుకు.. వైసీపీ వాకౌట్‌
‘మూజువాణి ఓటు’ తో ఆమోదం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అమరావతి చట్టబద్ధత బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం తెలిపింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. వైసీపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును బుధవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరారు ప్రవేశపెట్టారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై చర్చను ప్రారంభించారు. బిల్లుపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్‌ ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.

ఇప్పటికీ పెండింగ్‌లోనే ఏపీకి ప్రత్యేకహౌదా
కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాకూర్‌ చర్చను ప్రారంభిస్తూ అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కోరారు. అమరావతి కేవలం ఏపీకి రాజధాని మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిపి హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.

ఏపీ రాజధాని అమరావతికి రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు వచ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. మరోపక్క రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు అని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నిలదీశారు. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని నిర్ణయమన్నది రాష్ట్ర ఇష్టమని, గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్‌ ఇచ్చిందని తెలిపారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై మాట్లాడితే బాగుండేదని పేర్కొన్నారు. బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు రఘురామ్‌ రెడ్డి, మల్లు రవి, ధర్మేంద్ర యాదవ్‌ (ఎస్పీ), అరవింద్‌ గణపతి సావంత్‌ (శివసేన, ఠాక్రే), భజ్రంగ్‌ మనోహర్‌ (ఎన్సీపీ), రాజేష్‌ రంజన్‌ (ఇండిపెండెంట్‌), హర్‌ సిమ్రాత్‌ కౌర్‌ (ఎస్‌ఏడీ), శ్రీకాంత్‌ షిండే (శివసేన) తదితరులు పాల్గొని మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -