నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మధ్యాహ్నం భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాలు, నిర్వహణ బిల్లులు, 10, నెలల కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యాహ్నం భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ కార్యాలయంలో సమస్యల వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూజిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాల నిర్వహణ బిల్లులు, 10 నెలల కోడిగుడ్ల బిల్లును చెల్లించడం లేదని, ప్రభుత్వం గుడ్లకు ఇచ్చే బడ్జెట్ కి రెండు గుడ్లు కూడా రావడంలేదని పైగా మూడు కోడిగుడ్లు పెట్టాలని అధికారులు స్కూల్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని పెట్టిన వాటికే పది నెలల నుండి బిల్లులు పెండింగ్లో ఉంటే కార్మికులు ఎంతకాలం అప్పుచేసి పెడతారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని అధికారుల చుట్టూ కార్మికులు చెప్పులు అరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణకు కట్టెల పొయ్యి వాడొద్దని అన్ని బడుల్లో గ్యాస్ సౌకర్యం ఉండాలని అధికారులు పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నారని ఒకపక్క ప్రభుత్వం స్టవ్లు మాత్రమే ఇస్తామని,సిలిండర్లు కార్మికులు కొనుక్కోవాలని చెప్తున్నారని ఇది చాలా అన్యాయమని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ను తమ వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడంలేదని బడి పిల్లలకే వంట చేసేందుకు ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఏమి బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ కార్మికులను బాధ్యులను చేయడం సరైన విధానం కాదని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలో కొత్త మెనూ తీసుకొచ్చి రెండు రకాల కూరలు పెట్టాలని సాంబారు, రాగి జావ పోయాలని కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. కేటాయించిన బడ్జెట్ పాత మెనుకే సరిపోవడంలేదని కొత్త మెనూ ఎలా పెట్టాలని అన్నారు. కొత్త మెనూకి అదనంగా బడ్జెట్ కేటాయించి కార్మికులకు అదనపు పనికి అదనపు వేతనం చెల్లిస్తేనే నిర్వహణ చేయడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పిల్లలకి ఇచ్చే మేను చార్జీలను పెంచి వాటికి అనుగుణంగా బడ్జెట్ను కూడా కేటాయించాలని, ప్రభుత్వమే అంగన్వాడి కేంద్రాల మాదిరిగా అన్ని పాఠశాలలకు గుడ్లను సరిపరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దసరా పండుగ రోజున కూడా కార్మికులు తమ కుటుంబాలను వస్తులించిన పరిస్థితి దాపురించిందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు వారి ఖాతాలో వెయ్యాలని లేనిపక్షంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరవదిక సమ్మెలోకి వెళ్లడానికి కూడా వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో జిల్లా మధ్యాహ్న భోజనకార్మిక యూనియన్ కార్యదర్శి గురజాల శ్రీధర్, జిల్లా సీపీఐ(ఎం) నాయకులు మల్లారపు అరుణ్ కుమార్,కోనరావుపేట మండల మధ్యాహ్న భోజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గొట్టే బాలమని, పులి వసంత, వెంకట లక్ష్మీ,గడ్డం పద్మ, మ్యకల కవిత, బుజ్జి గౌరవ్వ, లింగు రాధా మధ్యాహ్న భోజన కార్మికులుపాల్గొన్నారు.



