లీటర్ బాటిల్ ధరపై 11 శాతం పెంపు
యుద్ధ సంక్షోభంతో పెరిగిన పాలిమర్ ధరలు
మరోపక్క కలుషితమైన భూగర్భజలాలు
తుడిచిపెట్టుకుపోయిన మోడీ పన్ను కోతల ప్రయోజనాలు
న్యూఢిల్లీ : ఇరాన్‌పై యుద్ధం కారణంగా దేశంలోని ప్రజలపై ఏదో ఒక రూపంలో కనిపించని భారాలు పడుతున్నాయి. నిత్యావసరాలైన పప్పులు, నూనెలు ఇలా ఎన్నో వస్తువులపై నిలువుదోపిడీ కొనసాగుతోంది. తాజాగా బిస్లరీ వాటర్ బాటిల్ ధరలూ భగ్గుమంటున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు, మూతల ధరలు పెరగడంతో బాటిల్ నీటిపై 11 శాతం ధరను పెంచేశారు. దీంతో తక్కువ నీటి పన్ను రేటు వల్ల కలిగే ప్రయోజనం కాస్త తుడిచి పెట్టుకుపోయింది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో స్వచ్ఛమైన నీరు ఒక వరం. ఇక్కడ 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే చమురు ధర పెరిగింది.
పరిశ్రమలకు అవసరమైన, ప్లాస్టిక్ బాటిళ్లకు కీలకమైన ముడి పదార్థం పాలిమర్ ధర సైతం పెరగడంతో మార్కెట్‌పై ఒత్తిడి ఎక్కువవుతోంది. దేశంలో అతిపెద్ద సంస్థ అయిన బిస్లరీ మార్కెట్‌లో మూడో వంతు వాటాను కలిగి ఉంది. దీంతో ఇప్పటి వరకు రూ. 216 (2.32 డాలర్లు)గా ఉన్న లీటరు పరిమాణం గల 12 బాటిళ్ల పెట్టె ధర సంక్షోభంతో ఇప్పుడు రూ. 240 (2.57 డాలర్లు)కు పెరిగింది. ”పక్షం రోజుల్లో ప్యాకేజింగ్ సామగ్రి ఖర్చులు 70 శాతానికి పైగా పెరగడంతో, ప్యాక్ చేసిన తాగునీటి ధర లీటరుకు రూ.20 చేరింది” అని బిస్లరీ సీఈఓ ఏంజెలో జార్జ్ ఒక టెక్స్ట్ సందేశంలో తెలిపారు. యుద్ధం వల్ల ”ఏం జరుగుతుందో ఎవరి అదుపులోనూ లేదు,” అని ఆయన చెప్పారు.
పన్ను ప్రయోజనాలు మాయం
ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరల వల్ల, ప్లాస్టిక్ సీసాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధర కిలోగ్రాముకు 50 శాతం పెరిగి 170 రూపాయలకు చేరింది. మూతల ధర రెండింతలకు పైగా పెరిగి ఒక్కొక్కటి 0.45 రూపాయలకు చేరింది. కార్రు గేటెడ్ పెట్టెలు, లేబుళ్లు, అంటుకునే టేపుల ధరలు కూడా పెరిగాయని గతంలో నివేదించింది.మోడీ ప్రభుత్వం సెప్టెంబర్‌లో బాటిల్ వాటర్‌పై పన్నులను 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంతో, అనేక కంపెనీలూ ధరలను తగ్గించాయి.
ప్రస్తుత ధరల పెంపు ఆ ప్రయోజనాలకు విఘాతం కలిగించింది. నీటి పరిశ్రమ వర్గం అందించిన ధరల పట్టికల ప్రకారం, భారతదేశానికి చెందిన పార్లే ఆగ్రో కూడా తన బెయిలీ బాటిల్ వాటర్ బ్రాండ్ ధరను సుమారు 11 శాతం పెంచింది. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆ కంపెనీ నిరాకరించింది. క్లియర్ ప్రీమియం వాటర్ సీఈఓ నయన్ షా మాట్లాడుతూ.. భౌగోళిక, రాజకీయ పరిణామాల కారణంగా బాటిల్ వాటర్ రిటైల్ ధరను 8 శాతం నుంచి 11 శాతం వరకు పెంచినట్టు తెలిపారు. ‘ధరల సవరణ అనివార్యమైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.



