పలు జిల్లాల్లో కాంగ్రెస్ ర్యాలీ, ధర్నాలు
నవతెలంగాణ-విలేకరులు
నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరును వాడుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఆ కేసులు సరైనవి కావని ఢిల్లీ హైకోర్టు తీర్పించినా బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైన చర్య కాదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంపై గురువారం ఏఐసీసీ, టీపీసీసీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనకు బయలుదేరిన చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, నాయకులను పోలీసులు గృహనిర్భంధం చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు. సిరిసిల్లలో బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. జగిత్యాలలో ర్యాలీ నిర్వహించి, తహసిల్ చౌరస్తాలో నిరసన తెలిపారు.వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. రాజీవ్ చౌరస్తా నుంచి కొత్తకోట రోడ్డులోని బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని బీజేపీని మూడుసార్లు గెలిపిస్తే అమిత్ షా ఇతర బీజేపీ నాయకులు మాత్రం మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వందేమాతరం గీతాన్ని తొలగించాలని చూస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ ఉన్న నోట్లను రద్దు చేయాలని చూస్తున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాందీని, వారి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరూ సహించరని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. న్యూ హౌసింగ్ బోర్డులోని పొచ్చమ్మ ఆలయం వద్ద ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు ముందస్తుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా కార్యకర్తలు పోలీసులను తోసుకుంటూ వెళ్లిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో..గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



