చర్చనీయాంశంగా గువహతి సెంట్రల్ స్థానం
అసోం ఎన్నికల్లో అధికార పార్టీకి కష్టాలు
కాషాయ పార్టీ వ్యూహానికి సాంస్కృతిక ప్రతిఘటన
అసోం రాజకీయాల్లో ‘అవుట్ సైడర్ (బయటివాళ్లు)’ అనే అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అధికార బీజేపీ హిందీ మాట్లాడే అభ్యర్థిని నిలబెట్టడంతో స్థానికుల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కాషాయపార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అంతేకాదు.. ఇది అసోం సాంస్కృతిక, భాషా గుర్తింపుతో సంబంధమున్న లోతైన సమస్యలను బయటపెడుతోందని అంటున్నారు. కేవలం హిందూత్వ ఎజెండాగా రాజకీయాలు చేసే అధికార బీజేపీకి ఈ పరిణామం భవిష్యత్తులోనూ ఇబ్బందులు తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు.
గువహతి : 1985లో అసోంలో జరిగిన ఒక ప్రఖ్యాత స్కిట్లో హిందీ మాట్లాడే వ్యాపారిని కామెడీగా చూపించారు. ఆ సమయంలో జరిగిన ‘అసోం ఉద్యమం’ తర్వాత ఈ నాటకం ప్రాచుర్యం పొందింది. ఇది బయటివాళ్లు స్థానిక సంస్కృతిని ఆక్రమిస్తున్నారనే ఒక పెద్ద భయాన్ని ప్రతిబింబించింది. అయితే రాజకీయ పరిశీలకులు ఆ నాటకాన్ని తాజా పరిస్థితులకు అన్వయిస్తున్నారు. అసోంలో బీజేపీకి ఇది రాజకీయంగా ఒక తలనొప్పిగా మారనుందని చెప్తున్నారు.
బీజేపీ అభ్యర్థికి ‘యూపీ’ మూలాలు
అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ గుప్తా అనే హిందీ మాట్లాడే వ్యాపారిని బీజేపీ గువహతి సెంట్రల్ స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఈ నిర్ణయం అసోంలో బీజేపీకి తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. ‘గో బ్యాక్, బిహారి’ వంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. విజయ్ గుప్తా అసోంలోనే జన్మించి పెరిగినా.. ఆయన మూలాలు మాత్రం యూపీలో ఉండటంతో ఆయనను ‘బయటి వ్యక్తి’గా చూస్తున్నారు. స్థానికులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంత ముఖ్యమైన నియోజకవర్గానికి స్థానికుడిని ఎందుకు ఎంపిక చేయలేదు? అని అక్కడి ఓటర్లు బీజేపీని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటన పార్టీ వ్యూహంలో ఉన్న లోపాలను బయటపెడుతోందని రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు.
బీజేపీకి బ్యాక్‌ఫైర్
తేజ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చందన్ శర్మ ప్రకారం.. అసోం సమాజం చాలా విభిన్నంగా ఉంటుంది. భాష, జాతి, ప్రాంతీయత ఆధారంగా ప్రజల గుర్తింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘అవుట్‌సైడర్’ భావన చాలా సున్నితమైంది. అసోంలో బీజేపీ 2016లో అధికారంలోకి వచ్చింది. ‘జాతి, మాటీ, భేటీ’ అనే నినాదంతో విజయం సాధించింది. బీజేపీ ఆ సమయంలో వలసదారులపై అసోం ప్రజల్లో ఉన్న భయాన్ని ఉపయోగించుకుంది. హిందూ గుర్తింపును బలపరిచి, బెంగాలీ ముస్లింలను ‘బయటి వారు’గా చూపించింది. ఇప్పుడు అదే భావన ప్రజల నుంచి ఎదురై.. బీజేపీని దెబ్బ తీస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ నినాదం బ్యాక్‌ఫైర్ అయిందని వివరిస్తున్నారు.
అయితే అసోంలో ‘అవుట్ సైడర్’ భావనం మతంతో మాత్రమే సంబంధం లేదు.. హిందీ మాట్లాడేవారు కూడా స్థానికుల దృష్టిలో బయటివాళ్లుగానే ఉంటారు. 2019లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా కర్బీ ఆంగ్లాంగ్ ప్రాంతంలో అక్కడి స్థానిక ప్రజలు.. బీహారీ వలసదారులను వ్యతిరేకించారు. ఇది ఆ సమయంలో బీజేపీకి సవాలుగా మారింది. ఆ సమయంలో ప్రదర్శనలు హింసకు దారి తీశాయి. ఇద్దరు మరణించారు కూడా. దీంతో రెండు వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో రగిలిపోయారు.
విపక్ష అభ్యర్థిగా కుంకీ ఛౌధరీ
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గువహతి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కుంకి చౌధరీ (27) అనే యువ నాయకురాలు (జెన్-జెడ్) గుప్తాకు పోటీగా ఉన్నారు. అసోం జాతీయ పరిషద్ (ఏజేపీ)కు చెందిన ఆమె.. కాంగ్రెస్ కూటమి యువ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆమె ప్రచారంలో స్థానిక సంగీతం, సంస్కృతి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ మాత్రం ఎన్నికల సభల్లో ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఆమెను ‘హిందూ వ్యతిరేకి’గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
బయటి వ్యక్తి అంటే ఎవరు?
బీజేపీ అసోంలో 1990లలో ప్రవేశించింది. అక్కడ మొదట దీనిని ‘మార్వారి-బీహారీ పార్టీ’గా పిలిచేవారు. తర్వాత సీనియర్ నాయకులు, అసోం మాజీ ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ వంటి నేతల ద్వారా స్థానికుల మద్దతు పార్టీకి పెరిగింది. ప్రస్తుతం కూడా బీజేపీ హిందూ గుర్తింపును ప్రధానంగా తీసుకుంటోంది. కానీ అసోంలో భాషా జాతీయత బలంగా ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే అసోంలో ఉన్న భాషా, సాంస్కృతిక భావజాలం హిందూత్వకు ప్రత్యామ్నాయంగా ఉందని తాజా ఘటనతో స్పష్టమవుతోందని వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికలతో పాటు భవిష్యత్తులోనూ బీజేపీకి రాజకీయంగా తీవ్ర దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది ఒక్క అసోంకు మాత్రమే పరిమితం కాదనీ, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికిని దెబ్బతీస్తుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.



