– క్రియాశీల మెంబర్‌షిప్‌లోనే 13 వేలకుపైగా బోగస్‌గా గుర్తింపు!
– రాష్ట్ర నాయకత్వంపై సునీల్ బన్సల్ ఆగ్రహం
– ఆఫీసుల్లో మీటింగ్‌లతో అధికారంలోకి రాబోమని హెచ్చరిక
– మే 15 నాటికి మండలాధ్యక్షులను నియమించాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో చాలా వరకు తప్పుడు క్రియాశీల సభ్యత్వాలున్నట్టు జాతీయ నాయకత్వం గుర్తించింది. తెలంగాణలో ఇప్పటికే 13 వేలకుపైగా తప్పుడు క్రియాశీల సభ్యత్వాలను గుర్తించామని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ఎత్తిచూపడం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించారు. తప్పుడు క్రియాశీల సభ్యత్వాలిస్తే తెలుసుకోనేంత తెలివి లేకుండా పార్టీ నడుపుతున్నామనుకున్నారా? అంటూ బన్సల్ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. క్రియాశీల సభ్యత్వం పొందిన సదరు నాయకుడు పార్టీకి ఏం చేశారు? ప్రజాక్షేత్రంలో చేసిన పోరాటాలేంటి? ఇష్టానుసారంగా క్రియాశీల సభ్యత్వాలివ్వడమేంటి? అలాగైతే క్షేత్రస్థాయిలో పార్టీకి పట్టు ఎలా దక్కుతుంది? అని కడిగిపారేశారని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. దక్షిణాదిలో పట్టు సాధించే అవకాశమున్న తొలి రాష్ట్రంగా తెలంగాణను బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించి 50 లక్షల సభ్యత్వాలను టార్గెట్‌గా పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఇప్పటికే 45 లక్షల ప్రాథమిక సభ్యత్వాలు పూర్తిచేసినట్టు రాష్ట్ర నాయకత్వం మొన్నటిదాకా గొప్పలు చెప్పుకున్నది. అయితే, పదవులు కావాలంటే క్రియాశీల సభ్యత్వం కీలకమని హైకమాండ్ మెలికపెట్టింది. జిల్లా, రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికవ్వాలంటే కనీసం రెండు క్రియాశీల సభ్యత్వాలుండాలని నిబంధనలను పెట్టింది. తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన గౌతమ్‌రావుకు క్రియాశీల సభ్యత్వం లేదని తెలుస్తోంది. క్రియాశీల సభ్యత్వాల అంశంలో రాష్ట్ర నాయకత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకమాండ్ గుర్రుగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులుం ఏం చేస్తున్నారు? మహిళలకు జిల్లా అధ్యక్ష పదవులు తక్కువ ఇచ్చారు? అని రాష్ట్ర నాయకత్వాన్ని బన్సల్ ప్రశ్నించినట్టు వినికిడి.
కేవలం వర్క్‌షాప్‌లు, ఇండోర్ మీటింగులు పెట్టుకుంటే సరిపోదని హెచ్చరించినట్టు సమాచారం. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇప్పటివరకూ క్షేత్రస్థాయిలో ఏం పోరాటాలు చేశారనే దానిపై ఆరా తీశారు. మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై వేగం పెంచాలని బన్సల్ నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. మే 15 వరకు మండలాధ్యక్షుల ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించారని వినికిడి. 38 జిల్లాలను ఐదు జోన్లుగా విభజించి జోన్లవారీగా వర్క్ షాప్‌లు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి మండల కమిటీలో కచ్చితంగా ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించాలని, అందులో ఒక ఎస్టీ, ఎస్సీ తప్పక ఉండాలని బన్సల్ స్పష్టంచేసినట్టు తెలిసింది.
బీజేపీలో తప్పుడు సభ్యత్వాల లొల్లి
- Advertisement -
RELATED ARTICLES