– పేలవంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటన
– యూరియా కొరత నెపాన్ని రాష్ట్రంపై నెట్టే యత్నం
– కమ్యూనిస్టులపై అవాకులు చెవాకులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హౌదాలో తొలిసారి మంగళవారం ఖమ్మం వచ్చిన నారప్పరాజు రామచంద్రరావు పర్యటన పేలవంగా సాగింది. కార్యకర్తల సమ్మేళనానికి హాజరైన ఆయనకు పట్టుమని పదిమంది కూడా ర్యాలీగా వెళ్లి స్వాగతం పలుకలేదు. రాష్ట్రస్థాయిలో ఆ పార్టీలో ఎన్ని విభేదాలున్నాయో ఇక్కడ అంతకు ఒకటి, రెండు గ్రూపులు అదనంగానే ఉన్నాయి. కేంద్రమంత్రులు బండి సంజరు, కిషన్‌రెడ్డితో పాటు ఎంపీ ఈటల రాజేందర్ గ్రూపులకు తోడు పొంగులేటి సుధాకర్‌రెడ్డికి కూడా ఇక్కడ గ్రూపులు ఉన్నాయి. ఇక వీరు కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిన తాండ్ర వినోద్‌రావు, మాజీ అధ్యక్షులు దేవకి వాసుదేవరావు, గెల్లా సత్యనారాయణ, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి జిల్లాలో ఉంది. ఈ గ్రూపులన్నీ అధ్యక్షుని పర్యటనలో అంటీముట్టనట్టుగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఈటల రాజేందర్ అనుయాయులుగా చెప్పుకునే నేతలు పలువురు అధ్యక్షుని పర్యటన వైపు కన్నెత్తయినా చూడలేదని గుసగుసలు వినిపించాయి. మిగతా నాయకత్వం కూడా ఈ పర్యటనపై పెదవి విరుపుతోనే ఉండటం కనిపించింది. కార్యకర్తల కన్నా కార్లు ఎక్కువగా కనిపించడం గమనార్హం.
యూరియా కొరతను రాష్ట్రప్రభుత్వంపై నెట్టే యత్నం
దేశవ్యాప్తంగా వ్యవసాయానికి సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కానీ దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తున్న మోడీ ప్రభుత్వం ఆపార్టీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు అరకొర ఎరువులు సరఫరా చేస్తున్న విషయం విదితమే. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రైతుసంఘం నేతలు అనేక పర్యాయాలు స్పందించారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ విషయాలను విస్మరించి ఖమ్మంలో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనంలో చేసిన ప్రసంగం హాస్యాస్పదంగా ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. ‘కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేస్తున్నా.. అది బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చూడాల్సిన బాధ్యతను రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని’ రామచంద్రరావు విమర్శలు చేశారు.
చప్పట్ల కోసం కమ్యూనిస్టులపై విమర్శలు
కమ్యూనిస్టులను విమర్శించి గొప్పనిపించుకోవాలనే ప్రయత్నం రామచంద్రరావు ప్రసంగంలో కనిపించింది. నిస్తేజంగా ఉన్న బీజేపీ కార్యకర్తల నుంచి కరతాళధ్వనులు రాబట్టడం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా కమ్యూనిస్టులపై విమర్శలు చేశారు.
ఖమ్మంలో బీజేపీ ఫ్లాప్ షో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES