డిసెంబర్ 26న సీపీఐ 100 సంవత్సరాల వేడుక బహిరంగ సభను విజయవంతం చేయాలి..
ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం:సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అనేక హామీలతో కేంద్రంలో మూడోసారి ముచ్చటగా అదికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ప్రదాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ అన్నారు. ఈ నెల 26న ఖమ్మంలో జరిగే సీపీఐ 100సంవత్సరాల ఆవిర్భావ వేడుక బహిరంగసభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం పట్టణంలో నిర్వహించిన ప్రచారజాతలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు యువతకు 2కోట్ల ఉద్యోగాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 77 సంవత్సరాల పెట్టుబడిదారి ఆర్ధిక విధానాల వల్ల 83శాతం 5వ తరగతి మాత్రమే చదవుకున్నారని వారికి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిస్కారం కావాలంటే గ్రామాల్లో నూతన పరిశ్రమలు స్థాపించాలని ఆ పరిశ్రమల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
సోలార్ విద్యుత్ ద్వారా గౌడౌన్స్ ఏర్పాటు చేసి మిర్చి, పత్తి పంటలను ఎక్కువ రోజులు కాపాడుకునే అవకాశం కల్పించాలన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29చట్టాలను తుంగలో తోక్కి నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి అమలు చేయడాన్ని కార్మికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇటీవల బిహార్ ఎన్నికల్లో వలసలు పోయిన వారిని బీహార్ ప్రజలు కాదనే ఓటరు జాబితా నుంచి తొలగించి వారికి నచ్చిన వారికి ఓట్లు ఇచ్చి గెలిచిందన్నారు. కార్మికలోకం పెద్ద ఎత్తున కోడ్లపై ఉద్యమిస్తున్నా 8గంటల పని విదానం కాకుండా 10, 12 గంటల పని విధానం తీసుకురావడం, సమ్మె హక్కు లేకుండా చేశాడన్నారు. మోదీ అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ 100 సంవత్సరాల వేడుక బహిరంగ సభకు కార్మికులు, కర్షకులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లా ఖాద్రి, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి డిజి నరేంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధూళిపాల ధనంజయ నాయుడు, కొప్పో సూర్యనారాయణ, ఉస్తేల సృజన, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, బొమ్మగాని శ్రీనివాస్, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, ఖమ్మంపాటి రాము, చిలక రాజు శ్రీను, మహిళా నాయకురాలు అనంతుల మల్లేశ్వరి, దేవర మల్లేశ్వరి, ఉప్పునూతల కోటమ్మ, దంతాల పద్మ రేఖ, దేశ గాని హేమలత, దీకొండ శ్రీనివాస్, రేగటి లింగయ్య, పెండ్ర కృష్ణ, ఏడెల్లి శ్రీకాంత్, బూర సైదులు, కప్పల రాము వాడపల్లి వెంకన్నలు తదితరులు పాల్గొన్నారు.



