Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలపై భారాలు మోపుతున్న బీజేపీ

పేదలపై భారాలు మోపుతున్న బీజేపీ

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
సదాశివపేటలో ఉపాధి కూలీల భారీ ధర్నా

నవతెలంగాణ-సదాశివపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కార్మికులు, రైతులు, పేదలపై భారం మోపే విధానాలను అమలు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాకు ముందు స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే చర్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారని, ముఖ్యంగా ఫొటో క్యాప్చర్‌ విధానం వంటి చర్యలు కూలీలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానాల వల్ల ఉపాధి హామీ నిధులు కూడా తగ్గుతున్నాయని విమర్శించారు. గతంలో కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుండగా ఇప్పుడు 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై భారం మోపుతున్నారని తెలిపారు. ఇది గ్రామీణ పేదల జీవనాధారాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఉపాధి కూలీలకు రోజుకు సరిపడే వేతనం కూడా అందడం లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో కనీసం రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే పని దినాలను 200 రోజులకు పెంచాలని కోరారు. ఇప్పటికే పది వారాలుగా కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీరు, మెడికల్‌ కిట్లు, పనిముట్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. ఉపాధి కూలీల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రెండు మూడు నెలలుగా వేతనాలు అందక కూలీలు బతుకుదెరువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25న జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఉపాధి కూలీల హక్కులను కాపాడుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీడీవో లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ఎంపీడీవో పరిధిలో పని ప్రదేశాల్లో తాగునీరు, మెడికల్‌ కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వంటి సౌకర్యాలను అందించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిగతా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రమేష్‌ గౌడ్‌, యాదవ్‌ రెడ్డి, భూషణం, ఏషోబు, ఖయ్యూం, సుశీలతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -