Sunday, October 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీసీలను మోసం చేస్తున్న బీజేపీ

బీసీలను మోసం చేస్తున్న బీజేపీ

- Advertisement -

రిజర్వేషన్లపై కమలం పార్టీ ద్వంద్వవైఖరి
రాష్ట్రంలో మద్దతు ఇస్తూ, కేంద్రంలో అడ్డుపడుతున్నారు
గవర్నర్‌ చర్య అభ్యంతరకరం : వామపక్షాలు, టీజేఎస్‌, ప్రజాసంఘాల ర్యాలీలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
”బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ దొంగాట ఆడుతోంది. అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపి, కేంద్రంలో మోకాలడ్డుతోంది. దానికి గవర్నర్‌ వత్తాసు పలుకుతున్నారు. ఇది కచ్చితంగా అప్రజాస్వామిక చర్య. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాల్ని సహించేది లేదు. కచ్చితంగా బీజేపీని గిరిగీసి,బరిలో నిలబెడతాం. ప్రజలకు ఆ పార్టీ చేస్తున్న వంచన రాజకీయాల్ని వివరిస్తాం” అని కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జనసమితి, అరుణోదయ, ప్రజాసంఘాల నేతలు స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తా నుంచి ఆబిడ్స్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుల్తాన్‌బజార్‌, కోఠి, కింగ్‌కోఠి మీదుగా భారీ ర్యాలీ కొనసాగింది.

ప్రదర్శనలో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ నాటకాలను ఎండగడుతూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఓవైపు బీసీలను వంచిస్తూనే, వారికోసం జరిగే బంద్‌లో బీజేపీ కూడా భాగస్వామ్యం కావడాన్ని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆబిడ్స్‌ చౌరస్తాలో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ సీనియర్‌ నాయకులు కె నారాయణ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు హన్మేష్‌, న్యూడెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్దన్‌, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, న్యూడెమోక్రసీ(చంద్రన్న) నాయకులు ఆరెళ్లి కృష్ణ తదితరులు మాట్లాడారు.

బీజేపీనే అడ్డు : డాక్టర్‌ కే నారాయణ
సీపీఐ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ కె నారాయణ మాట్లాడుతూ న్యాయబద్దంగా రావాల్సిన రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డుతున్నదని చెప్పారు. ఆపార్టీ అసలు మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థకే వ్యతిరేకమని తెలిపారు. పేదలకు రాజకీయ హక్కు ఉండకూడదనేది దాని ఉద్దేశం అని చెప్పారు. బీసీలను విస్మరిస్తే రాష్ట్రంలో ద్రోహులుగా మిగులుతారని హెచ్చరించారు.

9వ షెడ్యూల్‌లో చేర్చాలి : ప్రొఫెసర్‌ కోదండరాం
టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదరడరాం మాట్లాడుతూ రిజర్వేషన్ల పట్ల ఢిల్లీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు దానంగా ఇచ్చేవి కావనీ, అది వారి హక్కు అని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు పసలేని వాదనలు మానుకోవాలని హితవు పలికారు.

అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి : కూనంనేని
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకత ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి తీసుకుపోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు.బీసీ రిజర్వేషన్లు సాధించేవరకు కేంద్రంపై పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

ర్యాలీలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టీ.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీ.సాగర్‌, జి నాగయ్య, మహ్మద్‌ అబ్బాస్‌, మల్లు లక్ష్మి, సీనియర్‌ నాయకులు డీజీ నరసింహారావు, రాష్ట్రకమిటీ సభ్యులు ఆర్‌ శ్రీరాం నాయక్‌, ఆర్‌ వెంకట్రాములు,టి స్కైలాబ్‌ బాబు, బి ప్రసాద్‌, డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్‌, ఏ వెంకటేశ్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్య క్షురాలు బి పద్మ, ఎం. మహేందర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహా, నగర కార్యదర్శి స్టాలిన్‌, టీజెఎస్‌ నాయకులు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, న్యూడె మోక్రసీ నాయకులు జేవీ చలపతిరావు, మహేశ్‌, మాస్‌లైన్‌ నాయకులు ఎస్‌ఎల్‌ పద్మ, సూర్యం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్నారు.

కేంద్రం బీసీలకు న్యాయం చేయాలి..అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంత్రుల నిరసన
కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు తక్షణం ఆమోదం తెలపాలని పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ట్యాంక్‌బండ్‌పైనున్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంత్రులు డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, సాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రిజర్వేషన్లు సాధించేవరకు విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుండా బిల్లును నిలిపివేస్తోందనీ, అదే సమయంలో బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతున్నదని విమర్శించారు. ఆపార్టీ రెండు నాల్కల ధోరణితో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. బీసీ బిల్లుపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ నేతలకు కూడా లేదన్నారు.

గవర్నర్‌ చర్య రాజ్యాంగ విరుద్ధం : జాన్‌వెస్లీ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సిద్ధంగా లేని గవర్నర్‌, కనీసం దానిపై చర్చించేందుకు కూడా ఇష్ట పడటంలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఆయన కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నది ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, మోడీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్ర పరిధిలో ఉందనీ, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చే అధికారం వారికి ఉన్నదని తెలిపారు. గవర్నర్‌ అర్డినెన్స్‌కు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా కేంద్రానికి పంపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర బంద్‌కు మద్దతిచ్చిన బీజేపీ కేంద్రంలో రిజర్వేషన్లను అడ్డుకుంటూ నాటకాలోడు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలనే చిత్తశుద్ధి ఆ పార్టీకి ఉంటే కేంద్రంతో ఎందుకు కొట్లాడటం లేదని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సమాన అవకాశాలివ్వాలని కోరుకుంటున్న సమయంలో కిషన్‌రెడ్డి, రామచందర్‌ రావు, బండి సంజరు మాయమాటలతో బీసీలను మోసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మతోన్మాద, కులోన్మాద, పురుషాధిక్య, కార్పొరేట్ల అనుకూల, మను వాద బీజేపీని బొంద పెట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం న్యాయ పోరాటాలకే పరిమితం కావొద్దని హితవు పలికారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందర్నీ కలుపుకుని కేంద్రంపై ఉద్యమం చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -