నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లుకు బీజేపీ అడ్డంగా మారిందని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ధ్వజమెత్తారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీసీ హక్కుల సాధన సమితి కార్యాలయం నుంచి పత్రికా ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లును గత నాలుగు నెలలుగా తొక్కి పెట్టడం సమంజసం కాదని ఆర్డినెన్స్ ఆమోదం విషయంలో సైతం ఇదేవిధంగా వ్యవహరించడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లునే కాకుండా ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ద్వంద వైఖరి అవలంబిస్తుందని పత్రికల ముందు బహిరంగ సభల్లో చెప్పేదానికి కేంద్ర ప్రభుత్వం చేసేదానికి పొంతన లేకుండా పోతుoదని, బీసీల పట్ల ఎవరు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుందని బీసీలను మోసం చేసే పార్టీలను రాజకీయంగా సమాధి చేస్తామని ఆయన హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చకుండా కాలయాపన చేయడం పట్ల రాష్ట్రానికి చెందిన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ మౌనం విడాలని కేంద్ర ప్రభుత్వపై బీసీ బిల్లు ఆమోదించేలా చర్యలు తీసుకోకపోతే తమ తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన సూచించారు. ఒకపక్క బీసీలపై ప్రేమ ఉన్నట్లు నటన ఒలకబోస్తూనే మరోపక్క బీసీ బిల్లుకు మోకాళ్లడ్డటం లో ఆంతర్యం ఏమిటి అని ఆయన బిజెపి నాయకులను సూటిగా ప్రశ్నించారు.
బీసీ బిల్లు ఆమోదం పొందే విషయంలో కాంగ్రెస్ మరియు బిజెపి సమన్వయంతో పనిచేసి బీసీలకు న్యాయం చేయాలని, బీసీ ఉద్యమం ఉగ్రరూపం దాల్చక ముందే బిజెపి బేషరతుగా బీసీ బిల్లు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీచేసి తన మర్యాదను కాపాడుకోవాలని ఆయన హితవుపలికారు.