బీఆర్‌ఎస్ కూడా బాధ్యత వహించాలి
కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ)కు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడంలో నేరమంతా బీజేపీదే నని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును కేంద్రం, ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించలేదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలనూ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలన్నారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నర్సింహ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. బీసీల రిజర్వేషన్ల నేరం బీజేపీదేననీ, దీనికి తగిన మూల్యాన్ని ఆ పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుందని కూనంనేని హెచ్చరించారు. ఈ నేరానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్‌ఎస్ మద్దతునిచ్చిందన్నారు. ఇందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం విచారకరమని, కోట్లాది మంది ఆవేదనను, బాధను, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. గవర్నర్ వద్ద మూడు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉంటే, వాటిని నోటిఫై చేసినట్టేనని తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఆరు వారాలు స్టే విధించిందనీ, ఇందులో ఏదో మతలబు ఉన్నదని అన్నారు. న్యాయ వ్యవస్థ కూడా పేద ప్రజలను పరిహాసం చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించని గవర్నర్‌ది తప్పా?, లేదా బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానిది తప్పా?అని అడిగారు. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇస్తే బీజేపీ, బీఆర్‌ఎస్ సంబురాలు జరుపుతున్నాయని చెప్పారు. బీసీలకు అన్యాయం జరిగిందనే బాధ వారిలో కనిపించడం లేదన్నారు. బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం కాకుండా ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలనే చిత్తశుద్ది ఉంటే బీఆర్‌ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు.
హైకోర్టు స్టే బీసీల హక్కులకు విఘాతం : పల్లా
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభలోని అన్ని రాజకీయ పార్టీలూ మద్దతునిచ్చాయని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి చెప్పారు. అయితే బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడం తీవ్ర విఘాతం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాన్ని ఆమోదించే బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు. కానీ గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించకుండా నే రాష్ట్రపతి వద్దకు పంపించారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.మూడు వేల కోట్ల నిధులు రాలేదన్నారు. హైకోర్టు తీర్పు బీసీల ఆర్థిక, రాజకీయ, విద్యావకా శాలకు విఘాతం కలిగిస్తుందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.