– మేం ప్రభుత్వ సంస్థల్ని స్థాపిస్తే.. బీజేపీ ప్రయివేటుపరం చేస్తోంది : ఖర్గే
భువనేశ్వర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పుల చెరిగారు. మహారాష్ట్రలో చేసినట్లుగానే త్వరలో జరిగే బిహార్ ఎన్నికలను హైజాక్ చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీలు ఈ చర్యను అడ్డుకుంటాయని చెప్పారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం తమ విధులను నిర్వర్తించడం లేదని, బీజేపీకి ప్రయోజనాలు చేకూర్చేందుకు పని చేస్తుందని విమర్శించారు.”కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదుగురు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తుంది. దేశంలోని నిరుపేద ప్రజల కోసం పనిచేయట్లేదు. జల్, జమీన్, జంగల్ (నీరు, భూమి, అడవి) ఎప్పటికీ గిరిజనులకు సొంతం. అటవీ హక్కు పట్టాలను గిరిజనులకు ఒడిశా ప్రభుత్వం ఇవ్వడం లేదు. పెసా, ట్రైబల్ బిల్లులను గిరిజనుల కోసం కాంగ్రెస్ తీసుకువచ్చింది. వాటిని అమలు చేసి గిరిజనుల భూమి వారికే దక్కేలా చేస్తాం. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం, గత పాలకులైన బీజేడీ వారిలాగే ఒడిశాను దోచుకుంటుంది.” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మేం ప్రభుత్వ సంస్థల్ని స్థాపిస్తే.. బీజేపీ ప్రయివేటు పరం చేస్తోంది : ఖర్గే
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాద స్ఫూర్తిని తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం నిర్వహించిన ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వంలో వ్యవస్థలు అతలాకుతలమయ్యాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా 160 ప్రభుత్వరంగ సంస్థల్ని ఏర్పాటు చేస్తే, బీజేపీ ప్రభుత్వం వాటిలో 23 సంస్థల్ని ప్రయివేటీకరణ చేసిందని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేయడం లేదని, ప్రయివేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.
”ఇటీవలె గంజాం జిల్లాలో ఇద్దరు దళితులను బీజేపీ నేతలు హింసించారు. మోకాళ్లపై కూర్చోపెట్టి గడ్డి, మురికి నీరు తాగించారు. అలాగే భువనేశ్వర్‌లో ఓ ప్రభుత్వ అధికారిపైనా దాడి చేశారు. కాంగ్రెస్ సృష్టించిన ఆస్తులను మోడీ తన మిత్రులకు అమ్ముతున్నారు. ఆయనకు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమనే ఒకటే ఎజెండాగా ఉన్నది. రాజ్యాంగాన్ని మార్చివేయవచ్చని ఆలోచనతోనే గత లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు కావాలని ప్రజలను అందుకే అడిగారు. ఒడిశాకు, భువనేశ్వర్‌కు బీజేపీ ప్రభుత్వం చేసిందేమి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఒడిశాకు అండగా నిలుస్తుంది.” అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే వివరించారు.బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కుల్ని కాలరాస్తోందని మండిపడ్డారు. తమ హక్కుల కోసం దళితులు, ఆదివాసీలు, యువత ఎలా పోరాడాలో తెలుసుకోవాలని పేర్కొన్నారు. పేదలు, గిరిజనుల కోసం 2006లోనే అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కానీ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని బలహీనం చేస్తుందని ఆరోపించా రు. ఒడిశాలోని ప్రభుత్వ అధికారులు, దళితులపై బీజేపీ మద్దతుదారులు దాడులకు దిగుతున్నారని, ఇది సరికాదని ఖర్గే హితవు పలికారు.