కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించింది. ఇప్పటికైనా రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక న్యాయం కోరే శక్తులు, ప్రజాస్వామికవాదులంతా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలన్నీ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదని విమర్శించారు. శాసనసభలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయని తెలిపారు. బీజేపీ కులతత్వ, మనువాద పార్టీ అయినందున, కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలనీ, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నిం టినీ కాలరాస్తున్నదని విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదని తెలిపారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లే ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిరదని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు.