Monday, July 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురాజ్యాంగంపై బీజేపీ దాడి

రాజ్యాంగంపై బీజేపీ దాడి

- Advertisement -

– మైనార్టీల హక్కులను కాలరాస్తున్న మోడీ సర్కార్‌
– దేశ సహజ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నది
– హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి : సీపీఐ(ఎం) నేత, మాజీ ఎంపీ సుభాషిణి అలీ
– మైనార్టీలకు అందని సంక్షేమం : ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌
– గద్వాలలో ఆవాజ్‌ రాష్ట్ర 3వ మహాసభలు ప్రారంభం
– ర్యాలీ, బహిరంగసభ
నవతెలంగాణ- జోగులాంబ గద్వాల

భారత రాజ్యాంగంపై బీజేపీకి నమ్మకం లేదని, అందుకే రాజ్యాంగం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు, మాజీ ఎంపీ సుభాషిణి అలీ అన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నాయని విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో ఆవాజ్‌ రాష్ట్ర 3వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పట్టణంలోని మక్కా మసీదు నుంచి తేరు మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అతికూర్‌ రెహమాన్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వల్ల మైనార్టీల హక్కులకు భంగం కలిగిందని, అందుకే పరదచాటున ఉన్న మైనార్టీ మహిళలు సైతం తమ హక్కుల కోసం రోడ్ల పైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. మైనారిటీల దేశభక్తిని ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదని, తాము భారతదేశ పౌరులమని, అంబేద్కర్‌ రాజ్యాంగం ద్వారా తమకు సర్వ హక్కులు కల్పించారని అన్నారు. స్వశక్తితో అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళుతుంటే బీజేపీ మాత్రం మహిళల హక్కులను నిరాకరిస్తున్నదని విమర్శించారు.

రాజ్యాంగం కల్పించిన ప్రజాతంత్ర హక్కులను హరిస్తే తిరగబడతామని హెచ్చరించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ అంటూ నినాదాలు ఇస్తున్న బీజేపీ.. తాను అధికారంలో ఉన్న యూపీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, వాటి నుంచి తప్పించుకోవడానికి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు. మోడీ.. అంబానీ, అదానీకి దేశ సహజ వనరులను దోచుకోవడానికి అవకాశమిచ్చారని అన్నారు. రైతులు, కూలీలు, కార్మిక వర్గాన్ని మాత్రం దోపిడీకి గురి చేస్తూ దోచుకుంటున్నారని విమర్శించారు. తమ ఆర్థిక, రాజకీయ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. బీజేపీని నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన ఆలోచనలను ప్రభుత్వ విధానాల్లో అమలు పరుస్తున్నదని, అందులో భాగంగా శాస్త్రీయ విద్యకు తిలోదకాలు ఇచ్చి మతపరమైన అంశాలు విద్యలోకి చొప్పించ్చిందని విమర్శించారు. ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో నెహ్రు, అంబేద్కర్‌ బొమ్మలను ధ్వంసం చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌కు, భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, కానీ ఆ సమానత్వాన్ని బీజేపీ నిరాకరిస్తున్నదని విమర్శించారు. కులం, మతం, జాతుల మధ్య విభజన వాదాన్ని సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందుతున్న బీజేపీ ఆలోచనా విధానాలను ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా ఉంటే తమ ఆటలు సాగవని, రాజ్యాంగాన్ని మార్చలేమని గుర్తించి ప్రజల మధ్య విద్వేష రాజకీయాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. ముస్లిం మైనార్టీలపై అక్రమ కేసులు బనాయించి వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐదువేల మైనారిటీ పాఠశాలలను మూసివేశారని అన్నారు. మైనారిటీలు లేకపోతే ప్రభుత్వాలు సైతం నిలబడవన్న అటల్‌ బిహారీ వాజ్‌పేరు మాటలు బీజేపీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. సెక్యులరిజం కోసం నిలబడాలంటే దమ్ము, ధైర్యం ఉండాలని, మైనారిటీలుగా తాము నిలబడతామని, మీకు ఆ దమ్ముందా అని బీజేపీని ప్రశ్నించారు. ఎంత పేదరికంలో ఉన్నా హక్కులకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోరాదని, ప్రజలు జాగృతమై సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రియాజ్‌ మాట్లాడుతూ.. దేశంలో లౌకిక విలువల పరిరక్షణ కోసం, ప్రజల మధ్య ఐక్యత పెంచడం కోసం ఆవాజ్‌ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సరితమ్మ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్‌ పార్టీ సానుకూలంగా ఉన్నదన్నారు. విద్యా ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు కల్పించి, సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఈ సభకు అవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జబ్బార్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ నీలి శ్రీనివాస్‌, న్యాయవాది మధుసూదన్‌ బాబు, అఖిల పక్ష నాయకులు నాగర్‌ దొడ్డి వెంకట్రాములు, రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఉపాధ్యక్షులు తాహేర్‌, మాజీ కౌన్సిలర్‌ ఇషాక్‌, నాయకులు ఇక్బాల్‌, పాషా, సుంకర ప్రభాకర్‌, కుర్వ పల్లయ్య, గంజిపేట రాజు, సీఐటీయూ నాయకులు వీవీ నర్సింహ, ఉప్పేర్‌ నర్సింహ, ఐద్వా నాయకులు నర్మద, వివిధ సామాజిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మైనార్జీలకు సంక్షేమం అందడం లేదు : ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌
మైనార్టీలు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. మైనార్టీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ అన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని తెలిపారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అంబేద్కర్‌ రాజ్యాంగ ప్రకారం అందరికీ సమాన హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. యువకులకు, భిన్న కులాలకు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకు లింక్‌ లేకుండా మైనారిటీ కార్పొరేషన్‌ నుంచి రుణాలివ్వాలని, వక్స్‌ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -