ఆ రాష్ట్రాల్లో ఒకలా.. ఇక్కడ మరోలా..
ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
లేదంటే రాజీనామా చేయాలి
ఇందిరాపార్కు వద్ద నేటి ధర్నాను విజయవంతం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-భైంసా
బీసీ రిజర్వేషన్లను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఆ పార్టీ నాయకులు ఇక్కడ అడ్డుకోవడం ఏం న్యాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, దీని కోసం ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు కలిసొచ్చే శక్తులను కలుపుకొని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలో సోమవారం సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధనకు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందర్నీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలో కులగణన పూర్తయిందని, దాని ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలిపారు. రాష్ట్ర సర్కారు ఆర్డినెన్స్‌ను పంపిస్తే గవర్నర్ జాప్యం చేస్తున్నారని, దీనివల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతోందని అన్నారు. దాన్ని సాకుగా చూపెట్టి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందన్నారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లిములను తొలగించాలనే అక్రమ డిమాండ్‌ను బీజేపీ ముందుకు తీసుకొస్తోందని, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిములకు రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణలో మాత్రం అమలు చేయకూడదని అడ్డుతగలడమేంటని ప్రశ్నించారు. దీనిపై సామాజిక న్యాయం కోరే శక్తులన్నీ ఆలోచించాలన్నారు. ముస్లిములలో దూదేకులు, అత్తర్‌సాహెబ్, రాళ్లు కొట్టుకుని బతికేవాళ్లు(కాసోళ్లు), ఫకీర్ల లాంటి చిన్నచిన్న వృత్తులు చేసుకునే వారికి బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, డబ్బున్న ధనిక వర్గాలకు కాదని చెప్పారు. హిందూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి, ఇస్లాం స్వీకరించిన బీసీలకు రిజర్వేషన్లు ఉండకూడదనడం ఎలాంటి న్యాయమని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. బీసీలకు అనుకూలమంటూనే కేంద్ర మంత్రులు బండి సంజరు, కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు పార్లమెంటులో రిజర్వేషన్లకు అనుకూ లంగా వ్యవహరించకపోతే వారి రాజీనామాకు ఒత్తిడి చేస్తూ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, జిల్లా కార్యదర్శి గౌతమ్‌కృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, బొమ్మెన సురేష్, సుజాత, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు ఇందిరాపార్కు వద్ద సీపీఐ(ఎం) ధర్నా
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ధర్నా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, టి జ్యోతి పాల్గొంటారు. ఈ ధర్నాను ప్రజలంతా జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) కోరింది. సామాజిక న్యాయం కోరుకునే శక్తులు, ప్రజానీకం, ప్రజాసంఘాలు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES