Tuesday, July 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిదక్షిణ భారత భాషలపై బీజేపీ కక్ష

దక్షిణ భారత భాషలపై బీజేపీ కక్ష

- Advertisement -

కంప్యూటర్‌కి తన భాషలో ఆజ్ఞలిస్తే తప్ప స్పందించదు. ఒక భాష తెలియనివారి వద్ద మరో భాష వాడకం అనవసర ప్రేలాపన. ఒక భాష వేల సంవత్సరాల చరిత్రని నేటితరానికి మోసుకొచ్చే వాహనం. దాని సమూహం, సంస్కృ తిని, ఉమ్మడి స్పృహని, వారసత్వాన్ని, భావోద్వేగాల్ని, విజ్ఞానాన్ని తనతో పెనవేసుకుని ప్రయాణించి కొత్త తరానికి అందచేసే వాహకం.భాష ఒక గొప్ప సంక్లిష్ట ప్రక్రియ, సంస్కృతిలో వెన్నముక లాంటిది. అలాంటి భాషనీ చంపే ప్రయత్నం కొన్ని కోట్ల హత్యలకు మించిన నేరం. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారత ద్రావిడ భాషల పట్ల అలాంటి హత్యలకే పూనుకుం టుంది. అయితే ఈ హత్యలకు వాడుతున్న ఆయుధం మాత్రం సంస్కృతమే. రాముడు వాలిని దొంగచాటుగా చంపినట్టు హిందీ వెనకదాక్కుని ఈ ఘాతుకానికి ఒడిగడుతున్నది బీజేపీ. ఇది చాలా ప్రణాళిక బద్ధంగా, కుట్ర పూరి తంగా అమలు చేయబడుతున్న ఎజెండా. బహుళ సంస్కృతుల కేంద్రంగా విరాజిల్లుతున్న భారతీ యతని ఆధిపత్య కులసంస్కృతికి బానిసను చేయాలనే దుర్మార్గ బుద్ధితో వ్యవహరిస్తోంది. దక్షిణ భారత సంస్కృ తులను నాశనం చేయాలంటే వాటికి వెన్నెముకలైన ద్రావిడ భాషలను చంపకుండా అది సాధ్యం కాదు.అందుకే ద్రావిడ భాషపై కక్షకట్టింది.


సంస్కృతం కన్నా ప్రాచీనత చరిత్ర కలిగిన ద్రావిడ భాషలపై తన అక్కసును వెళ్లగక్కుతోంది. దక్షిణ, ద్రావిడ భాషలకు అభివృద్ధికి నామమాత్ర నిధులు కేటాయిస్తూ, సంస్కృతానికి మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుండి నేటి వరకు సంస్కృత అభివృద్ధికి రూ.2532 కోట్లు ఖర్చుచేసిన కేంద్రం తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, ఒరియాలకు కలిపి కేవలం రూ.147 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. అంటే ఐదు ద్రావిడ భాషలకన్నా ఒక్క సంస్కృతంపైన 17 రేట్లు ఎక్కువ ఖర్చు చేసింది. ఇది ఎంతటి దుర్మార్గమైన వివక్షత? దేశంలో పైన పేర్కొన్న ఐదు భాషలు మాతృభాషగా కలిగిన జనాభా దేశంలో 27 కోట్లు. సంస్కృతం మాట్లాడేవారి సంఖ్య 24వేలు మాత్రమే. 24వేల మంది మాట్లాడే భాషకు 2532 కోట్లు, 27 కోట్ల మంది మాట్లాడే భాషలకు 147 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం ఎంతటి కుట్ర? అంటే బీజేపీ ఆరెస్సెస్‌ దృష్టిలో ఈ 27 కోట్ల మంది హిందువులు కాదు, 24 వేల మంది మాత్రమే హిందువులా? హిందూత్వ అంటేనే బ్రాహ్మణ ఆధిపత్యం అనే విషయాన్ని ఏది రూఢపీర్చటం లేదా? సంస్కృత భాషకన్నా లిపి లేని బంజారా గోండు లాంటి గిరిజన భాషలకు కనీస ప్రాధాన్యతనివ్వని బీజేపీ, హిందువుల పేరా బ్రాహ్మణ అధిపత్యానికి కాపు కాస్తున్నదనేం దుకు ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలి? బీజేపీ-ఆరెస్సెస్‌ దృష్టిలో సంస్కృతం దేవా బాషా, తల్లిలాంటిది. అందుకు సంస్కృత భారతి అనే అనుబంధ సంఘాన్ని నడుపు తున్నది. అందుకోసమే సంస్కృతాన్ని రాష్ట్రాలపై రుద్దుతోంది.


సంస్కృతం ద్రావిడ భాషలకన్నా ప్రాచీనమైనదని చెప్పేందుకు ఎలాంటి పురావస్తు ఆధారాలు లేవు. కానీ దాని లక్ష్యమైన హిందూ రాష్ట్ర సాధన పేరుతో ఆధిపత్యం నెరిపేందుకు సంస్కృతాన్ని ఒక ఆయుధంగా భావిస్తున్నది. అందుకే ఇతర భాషలను నాశనం చేస్తూ వాటి స్థానంలో సంస్కృతానికి జొప్పించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకే నూతన విద్యావిధానాన్ని వాడుకుంటున్నది. ఏదో ఒక దురభిమానాన్ని రెచ్చగొట్టి దానిపై బొగ్గులేరుకునే పని ఆరెస్సెస్‌-బీజేపీల పరివారం చేస్తున్నది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణ దేశంలో ఏదో ఒక దుమారం లేపి పోలరైజేషన్‌తో లబ్ది పొందాలని ఆరాట పడుతున్నది. అందులో భాగంగానే తమిళనాడులో మళ్లీ భాషాదురభిమానాన్ని రెచ్చ గొడుతున్నది. తమిళ ప్రజలు తమ భాష, సంస్కృతి రక్షణకు తగురీతిలో ఉద్యమించారు. 1950లో సమాఖ్య దేశంగా ఏర్పడ్డాక ఆ స్ఫూర్తి నాటి నుండి కాలరాయబడుతూనే ఉన్నది. ఉత్తర దేశ ఆధిపత్య, వెనకబాటు సంస్కృతిని దక్షిణ దేశంపై అన్ని రంగాల్లో రుద్దే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. అందులో భాగంగానే మళ్లీ ఇప్పుడు నూతన విద్యావిధానం పేరుతో బలవంతపు హిందీ ే రూపేనా దక్షిణ దేశ సంస్కృతుల నాశనానికి నడుం కట్టింది. ఒక ప్రాంత సంస్కృతిలో అక్కడి భాష వెన్నెముక లాంటి పాత్రను కలిగి ఉంటుంది. దాన్ని నాశనం చేస్తే ఒక సంస్కృతి వెన్నువిరిచినట్టే.


రాజ్యాంగంలో 341 ఆర్టికల్‌ ప్రకారం హిందీని అధికార భాషగా, ఇంగ్లీషుతో పాటు పదిహేనేండ్ల పాటు కొనసాగాలని నిర్ణయిం చబడింది. 1963 అధికార భాష చట్టం అమల్లోకి వచ్చాక దాని ఆధారంగా హిందీని బలవంతంగా రుద్దటం అమల్లోకి వచ్చింది. హిందీ, ఇంగ్లీష్‌ అధికారిక భాషగా ఉన్నది. దీనికితోడు స్థానిక రాష్ట్ర భాషతో కలిపి మూడు భాషల బోధన రుద్దబడింది. అధికార భాష చట్టం వచ్చేవరకు హిందీ, ఇంగ్లీష్‌ నిర్వహించే పనిలో ఏ మాత్రం ముందుకు కదల్లేదు. వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయానికి, అధికారిక అవసరాలు తీర్చేందుకు, విద్యావసరాలు తీర్చటంలో ఇంగ్లీష్‌ అద్భుతంగా పురోగమించింది. అరవైయేండ్ల తర్వాత ఇంగ్లీష్‌ ప్రజావసరాలను తీర్చటంలో ఎంతో తోడ్ప డింది. ఈ నాటికి దేశంలో రెండు భాషలను వాడుతున్నవారి సంఖ్య 27 శాతం ఉండగా, మూడు భాషలను వాడేవారి శాతం 13 దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతం మూడు భాషల విధానంలో మొదటి భాషగా స్థానిక మాతృభాష, రెండో భాషగా ఇంగ్లీష్‌, మూడో భాషగా ఐచ్ఛికంగా హిందీ వచ్చింది. ఇప్పుడు బీజేపీ నూతన విద్యావిధానం పేరుతో హిందీని తప్పనిసరి చేసి ఇంగ్లీష్‌ని ఐశ్చికం చేస్తున్నది.హిందీ రాష్ట్రాల్లో సంస్కృతాన్ని, హిందీయేతర రాష్ట్రాలలో హిందీని రుద్దుతున్నది.స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో వలస వ్యతిరేక చైతన్యం వల్ల దేశానికి కూడా ఒక భాష ఉండాలనే ఆలోచన రావటం, రాజకీయంగా ఆధిపత్యంలో ఉన్న నాలుగైదు రాష్ట్రాల్లో హిందీ ఉండటంతో దాన్ని దేశవ్యాప్త భాషగా విస్తరించాలనే భావన ఏర్పడింది!


రాజ్యాంగం అమల్లోకి వచ్చాక హిందీ భాషకు పదిహేనేండ్లపాటు అవకాశం ఇవ్వబడింది. ఆచరణలో అది సాధ్యం కాక అధికార భాష చట్టంలో ఇంగ్లీష్‌కు పెట్టిన కాలపరిమితి కూడా ఎత్తివేసింది. అంటే హిందీ దేశం మొత్తం భాషగా మారడంలో ప్రజలనుంచి నిరాసక్తత ఎదురైంది. అంత జనాభా, శాస్త్ర విజ్ఞానం ఉన్న రోజుల్లోనే హిందీ దేశ భాషగా మారలేనప్పుడు ఆరు దశాబ్దాల తర్వాత కృత్రిమమేధా, ఆధునిక సాంకేతికత పెరిగిన ఈకాలంలో ఇంకా హిందీని బలవంతంగా రుద్దాలని చూడటం కేవలం బీజేపీ రాజకీయ ప్రయోజనాలు తప్ప వేరే కాదనేది స్పష్టమవుతున్నది. హిందీని ఇష్టంతో నేర్చుకోవాలి, కానీ బలవంతంగా రుద్దటం ఒక దండగమారి, తెలివితక్కువ ఆలోచన అని కేంద్రం గ్రహించాలి.


తమిళనాడు ముఖ్యమంత్రి అన్నట్టుగా హిందీ ఒక సాకు మాత్రమే, ఆ పేరుతో సంస్కృతాన్ని ముందుకు తేవటం బీజేపీ లక్ష్యం. సంస్కృతిలో మతం ఒక భాగం మాత్రమే. కానీ బీజేపీ దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌ సంస్కృతి అంటేనే మతం అనే స్థాయికి కుదించే కుత్సితబుద్ధి కలిగి ఉన్నది. అందుకే ఈ తప్పుడు ప్రయోగం. భాషాభిమానంతో తల గోక్కోవడం, ఫలితాలు ఎలా ఉంటాయో మన దేశానికి ఇప్పటికే అనుభవంలో ఉన్నది. బీజేపీ మళ్లీ అలాంటి చేదు అనుభవాలకు కారణం కాకూడదంటే బలవంతపు భాషా ప్రయోగాన్ని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి.
కాడిగళ్ల భాస్కర్‌ 9491118822

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -