– ఈడీ, ఐటీ, సీబీఐ ప్రయోగం
– కాంట్రాక్టర్ల నుంచి ఆ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఫండ్
– తెలంగాణ రైజింగ్ కావాలి : అక్బరుద్దీన్ ఓవైసీ
– హిల్ట్ పాలసీకి మద్దతిస్తున్నాం… కార్మికుల ఉపాధికి భద్రత కల్పించాలి : కూనంనేని
– కుంభకోణాల్లో తెలంగాణ రైజింగ్ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ వాషింగ్ మిషన్ లాంటిదనీ, తమ మాట వినని వారిపైకి ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రయోగించడం అలవాటైపోయిందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కాంట్రాక్టర్ల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఫండ్ వెళ్తున్నదని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఐటీ విచారణల నుంచి తప్పించుకునేందుకు కొందరు బీజేపీలో చేరారని, ఆ పార్టీలో చేరగానే వారంతా వాషింగ్ అయ్యారని విమర్శించారు. ఈ మాటలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ నచ్చజెప్పడంతో బీజేపీ సభ్యులు వెళ్లి కూర్చున్నారు. వెంటనే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, మోడీని అక్బరుద్దీన్ ఒవైసీ తిట్టడం సరైంది కాదు. అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యే కాకముందు ఎంత సంపద ఉంది? ఇప్పుడెంత? దానిపై సీబీఐ విచారణ చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని వ్యక్తిగత విమర్శలు సభలో ఆరోగ్యకరం కాదనీ, ప్రజాస్వామ్యబద్ధం చర్చ జరగాలని సూచించారు. వ్యక్తిగత అంశాలపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్-2047, హిల్ట్ పాలసీ అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ..హుస్సేన్‌సాగర్ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాని శుద్దీకరణకు రెండు ఎస్‌టీపీ సరిపోవడం లేదనీ, మరిన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమలు తరలించినా ప్రజలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మేం ఎవ్వరికీ బీ టీమ్ కాదు.. ఒంటరిగానే పోరాడుతున్నాం : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి గతంలో అధికారం పంచుకున్నాయనీ, మీరు కలిసి సంసారం చేస్తే తమకేం అభ్యంతరం లేదంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తాము ధర్మం కోసం కొట్లాడుతున్నామనీ, ఒంటరిగానే పోరాడుతున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మిత్రుడు, మంత్రి శ్రీధర్‌బాబు ప్రస్టేషన్‌తో స్క్రిప్టు చదివినట్టు ఉందంటూ చలోక్తి విసిరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేండ్ల కాలంలో 43,462 జీవోలను దాచిపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో 19064 జీవోలను బయటకు రానివ్వలేదని విమర్శించారు. ఇండిస్టీయల్ కోసం కేటాయించిన భూములు దారాదత్తం చేయడం సరిగాదన్నారు. బొల్లారం జోన్‌లో 100 పరిశ్రమలున్నాయనీ, అది రెడ్‌జోన్‌లో ఉన్నా హిల్ట్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలను వెలికి తీసి అవినీతిపరులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక కన్వర్షన్‌ను రద్దు చేయాలని కోరారు. హిల్ట్ పాలసీ సమగ్రంగా తయారు చేయాలలన్నారు. భూముల ధరలను తగ్గించి చూపటం సరిగాదన్నారు. తెలంగాణ కుంభకోణాలో రైజింగ్ అవుతున్నదని విమర్శించారు.
హిల్ట్‌కు మద్దతిస్తున్నాం…కార్మికుల ఉపాధికి భద్రత కల్పించాలి : సీపీఐ పక్ష నేత కూనంనేని
హిల్ట్ పాలసీకి మద్దతిస్తున్నట్టు సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. కాలుష్యం అత్యంత ప్రమాదకరమైనదనీ, ఢిల్లీలోని కాలుష్యం వల్లనే తమ పార్టీ అగ్రనేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, అతుల్‌కుమార్ అంజాన్‌ను కోల్పోయామని వాపోయారు. హైదరాబాద్ నుంచి ఎన్ని పరిశ్రమలు తరలిస్తున్నారు? ఓఆర్‌ఆర్ బయట భూమి ఇస్తారా? లేదా? హైదరాబాద్‌లోని భూమి పాత యజమానికే వెళ్తుందా? లేకపోతే ఆ భూమిని ప్రభుత్వం ఏం చేస్తుంది? అనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఇక్కడ స్థిరపడ్డ కార్మికులు, ఉద్యోగులు ఓఆర్‌ఆర్ బయటకు రాలేరనీ, వారి మ్యాండేట్ చేయాలనీ, కార్మికులను కన్విన్స్ చేయాలని కోరారు. దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనీ, భూములపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టుల జీవన ప్రమాణాల గురించి ఆలోచించాలనీ, అదే సమ్మిళిత వృద్ధి అవుతుందని సూచించారు. పేద ప్రజల గురించి ఆలోచించకుండా తెలంగాణ రైజింగ్ అన్నా, షైనింగ్ ఇండియా అన్నా ఉపయోగం లేదన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులకు భద్రత లేకుండా పోయిందనీ, హిల్ట్‌లో కార్మికుల భద్రత గురించి ప్రత్యేకంగా ఉండాలని సూచించారు. అసంఘటిత కార్మికులకు ఇస్తున్న జీతమే తక్కువనీ, దాంట్లోనూ దళారులు కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలని సూచించారు. భూములను అమ్మొద్దనీ, అఖిలపక్షం పెట్టాలని కోరారు. విజన్‌లో ట్రంప్ పేరు వాడొద్దని హెచ్చరించారు. వెనిజులాలో చొరబడి మధురోని తీసుకెళ్లడం సరిగాదనీ, ఈ రోజు అతన్ని తీసుకెళ్లినట్టే మోడీని తీసుకెళ్తారని అన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రైజింగ్‌కు మద్దతిస్తున్నాం : ఓవైసీ
ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..తెలంగాణ రైజింగ్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. స్కూల్, కాలేజీ, గుడి, మసీదు, చర్చిల పక్కన ఉండే వైన్‌షాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ రైజింగ్ కావాలి. దానికి మద్దతిస్తాం. మూసీ సుందరీకరణ చేపట్టాలి. గత పాలకులు బంగారు తెలంగాణ చేయలేదు. మీరు, మేము కలిసి తెలంగాణ రైజింగ్ చేద్దాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. విజన్ 2020 అని ఒకరు..బంగారు తెలంగాణ అని మరొకరు అనగా…ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ రైజింగ్ అంటున్నారని చెప్పారు. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇలా అనుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం ఏముండదని చురకలు అంటించారు. భూముల ధరలు తగ్గించి ఇవ్వడం సరిగాదన్నారు. తెలంగాణ రైజింగ్ పాలసీలో అన్ని వర్గాలనూ భాగస్వాములను చేయాలని, తద్వారా అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పదేండ్ల కాలంలో విద్య,వైద్య రంగాలను నిర్లక్షం చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ రంగాలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రియల్ హైదరాబాద్ (పాతబస్తీ) విస్మరించొద్దని కోరారు. డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
తెలంగాణకు మణిహారంలా హైదరాబాద్ : శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణకు మణిహారంలా హైదరాబాద్ మారిందనీ, నగరంలో 1.35 కోట్ల మంది నివసిస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సేప్టీ, సెక్యూరిటీ, పర్యావరణం, భౌగోళిక పరిస్థితులు, ఇలా అన్నింటిలోనూ హైదరాబాద్ ప్రత్యేకతను కలిగి ఉందనీ, అందుకే అంబేద్కర్ దేశానికి రెండో రాజధానిగా చేయాలని సూచించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే హైదరాబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. అయితే, పరిశ్రమల కాలుష్యంతో హైదరాబాద్‌లోని గాలినాణ్యత పడిపోవటం, ఢిల్లీ, కోల్‌కతా నగరాల సరసన చేరడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. నగరం నుంచి పరిశ్రమలను తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అధికారంలో ఉంటే అసెంబ్లీకి వస్తాం.. ప్రతిపక్షంలో ఉంటే ఫామ్‌హౌజ్‌లలోనే ఉంటాం అనే వాళ్లకు వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిల్ట్ పాలసీ మొదలు కాకుండానే అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
హిల్ట్ పాలసీకి కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘హిల్ట్‌పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. దానికి కట్టుబడి ఉన్నాం. లీజు భూములకు అవకాశం ఇవ్వలేదు. ఓనర్‌షిప్ ఉన్న భూములకే అవకాశం ఇచ్చాం. తొమ్మిది వేల ఎకరాలు, రూ.5.50 లక్షల కోట్ల కుంభకోణం అని బీఆర్‌ఎస్, బీజేపీ విమర్శించడం సరిగాదు’ అన్నారు. హైదరాబాద్‌లోపల ఉన్న పరిశ్రమలు తరలించాలా? వద్దా? కాలుష్యంతో ప్రజలు బతకాలా? హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ అవతలికి పరిశ్రమలను తరలించాల్సిందేనని స్పష్టం చేశారు. కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. పాలసీని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు సూచనలు ఇవ్వాలి తప్ప విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఈ పాలసీ వెనుక రహస్య ఎజెండా ఏం లేదనీ, నగర అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు రాబట్టడమే లక్ష్యమని తెలిపారు.
కాంగ్రెస్ సభ్యులు నవీన్‌యాదవ్ మాట్లాడుతూ.. పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటికి పంపితేనే హైదరాబాద్ నగరం కాలుష్యరహితంగా అభివృద్ధి చెందుతుందనీ, తెలంగాణ రైజింగ్-2047 కలసాకారం అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ..గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటే కాంగ్రెస్ సర్కారేమో రైజింగ్ తెలంగాణ అంటున్నదనీ, ఇప్పటికే రూ.8.50 లక్షల అప్పు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే దానిపై చర్చించకుండా రైజింగ్ అంటే ఉపయోగమేంటి అని ప్రశ్నించారు. వ్యవసాయ మంత్రికి ఎంతో చేయాలని ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేదనీ, రూ.20 లక్షలు, రూ.30లక్షలకు కూడా ఆర్థిక మంత్రి, సీఎం సంతకాలు అవసరమయ్యే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. మంత్రులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పే వారికి రాయితీలు కల్పించాలని కోరారు. అప్పుడే వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలు అభివృద్ధి అవుతాయని చెప్పారు.
విద్యావ్యవస్థ ప్రయివేటు చేతుల్లోకి పోయిందని వాపోయారు. ఆరోగ్యశ్రీ కింద ఒక్కరికైనా రూ.10 లక్షల బిల్లును ప్రభుత్వం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ ఆస్పత్రులు పేదల రక్తాన్ని పీల్చుతున్నాయని ఎత్తిచూపారు. గుజరాత్, బీహార్ రాష్ట్రాలు మద్యాన్ని నిషేదిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మద్యం ఆదాయం మీదనే నడుస్తున్నదని విమర్శించారు. మద్యపానాన్ని నిషేదిస్తే ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య 80 శాతం తగ్గుతుందన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను నియంత్రించాలని కోరారు.
మేం పన్నులు పెంచలేదు : మంత్రి జూపల్లి
ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఒక్క రూపాయి పన్నుకూడా పెంచలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పీవీ నరసింహా రావు, మన్మోహన్‌సింగ్ తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక సంస్కరణల వల్లే ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని చెప్పారు. కేవలం బీజేపీ వల్లే ఇది జరగలేదని అన్నారు. హైదరాబాద్ గాలి, నీరు, భూమి కలుషితం అయ్యాయనీ, పరిశ్రమల తరలింపు అనే దాన్ని 2013లోనే దీన్ని మొదలుపెట్టారని గుర్తుచేశారు. పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకి పంపేందుకే హిల్ట్ పాలసీ తెచ్చామని తెలిపారు. అవి లీజుకిచ్చిన భూములు కాదనీ, వారు కొనుకున్న భూములు అని వివరించారు. హిల్ట్ పాలసీని పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 1.05 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో వేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మూడు ట్రిలియన్ డాలర్ట ఆర్థిక వ్యవస్థ అంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే : పాల్వాయి
పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వర్కవుట్ కాదన్నారు. దావోస్, గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చామని కలర్ సినిమా చూపెట్టారని విమర్శించారు. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూర్, మదురై, తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారనీ, తెలంగాణలోనూ అలాగే చేయాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులు ఆదిశ్రీనివాస్, అనిరుధ్‌రెడ్డి కూడా ఇదే అంశంపై మాట్లాడారు.
బీజేపీ వాషింగ్ మిషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



