– ఆరుగురి అరెస్ట్- షర్మిల రాజధాని పర్యటనను అడ్డుకున్న పోలీసులు
అమరావతి : విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌పై దాడిచేయడానికి భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) నాయకులు బుధవారం ప్రయత్నించారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కార్యాలయంలోనే విలేకర్ల సమావేశంలో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పిసిసి కార్యాలయంలోకి చొరబడుతున్న వీరిని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించి అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని బిజెవైఎం కు చెందిన వారిని పిసిసి కార్యాలయం నుండి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి మోర్చా నాయకులు తమ వెంట తెచుకున్న కొడిగుడ్లు, టమోటోలు కింద పడి ధ్వంసం అయ్యాయి. బిజెపికి, ప్రధానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ బిజెవైఎం నాయకులు పిసిసి కార్యాలయం ఎదుట రోడ్డుపై భైఠాయించే ప్రయత్నం చేశారు. దీంతోయువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు బుధవారం ఉదయంతన నివాసం నుండి అమరాతిలోని ఉద్దండ్రాయుని పాలెం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోడీ గతంలో శంకుస్థాపన చేసిన ప్రాంతానిక వెళ్లడానికి షర్మిల సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రయత్నం మానుకుని, ఆమె పోలీసుల బందోబస్తు మధ్యే పిసిసి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా బిజెవైఎం నాయకులు దాడికి యత్నం చేశారు. దీంతో ఆమె కొద్దిసేపు పిసిసి కార్యాలయ గేటు వద్ద కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి సచివాలయానికి వెడుతున్నట్లు ప్రకటించడంతో పోలీసులు మరోసారి అమెను అడ్డుకున్నారు. కారులో గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుండి ఆమె బెంగళూరు వెళ్లారు.
ఏపీలో కాంగ్రెస్ కార్యాలయంపైబిజెవైఎం దాడి యత్నం
- Advertisement -