Monday, February 2, 2026
E-PAPER
Homeబీజినెస్మార్కెట్లకు బ్లాక్‌ బడ్జెట్‌

మార్కెట్లకు బ్లాక్‌ బడ్జెట్‌

- Advertisement -

రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2వేల పాయింట్ల పతనం
లాభాలతో ప్రారంభమై.. తుదకు భారీ నష్టాలు

ముంబయి : కేంద్ర బడ్జెట్‌ భారత స్టాక్‌ మార్కెట్లను రక్తసిక్తం చేసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన కాసేపట్లోనే నేల చూపులు చూశాయి. బడ్జెట్‌ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ మార్కెట్లను తెరిచి ఉంచగా.. సీతారామన్‌ చదువుతున్న అంకెల వెనుక తమ భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతోందని గ్రహించిన ఇన్వెస్టర్లు భయంతో అమ్మకాలకు తెగబడ్డారు. సూచీలు ఇక ఏ దశలోనూ కోలుకోకపోవడంతో సెన్సెక్స్‌, నిఫ్టీలు పేకమేడల్లా కూలిపోయాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 2000 పాయింట్లు పైగా పతనం కావడం గమనార్హం. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సొమ్ము రూ.10 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోయింది. 2020 బడ్జెట్‌ తర్వాత మరెప్పుడూ ఇంత నష్టం జరగలేదు.
బడ్జెట్‌లో కంపెనీల బైబ్యాక్‌పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ను (ఎస్‌టిటి)పెంచడం మార్కెట్లను కుదిపేసింది.

మరోవైపు బడ్జెట్‌లో దేశ వృద్ధికి దోహదం చేసే గొప్ప ప్రకటనలు ఏవీ ఇన్వెస్టర్లకు కానరాలేదు. ఆర్థిక వ్యవస్థ పట్ల ఇప్పటికే అపనమ్మకంతో ఉన్న మదుపర్లను బడ్జెట్‌ మరింత నిరుత్సాహపర్చడం దలాల్‌ స్ట్రీట్‌కు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,546.84 పాయింట్లు పతనమై 80,722.94కు దిగజారింది. ఇంట్రాడేలో 2300 పాయింట్ల మేర క్షీణించి 79,899 కనిష్ట స్థాయిని తాకింది. అదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 495 పాయింట్లు కోల్పోయి 24,825కు క్షీణించింది. ఒక్క పూటలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.9.72 లక్షలు కోట్లు హరించుకుపోవడంతో బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.459.88 లక్షల కోట్ల నుంచి రూ.449.87 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. దాదాపు అన్ని రంగాల షేర్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. నిఫ్టీలో మిడ్‌క్యాప్‌ 2 శాతం, స్మాల్‌క్యాప్‌ 2.7 శాతం చొప్పున పతనమయ్యాయి. సెన్సెక్స్‌-30 సూచీల్లో ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, టిసిఎస్‌, టైటన్‌ షేర్లు మాత్రమే రాణించగా.. మిగితా 26 స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి.

ప్రధాన ప్రతికూలాంశాలు..
ప్రయివేటు రంగానికి మేలు చేసేలా ప్రాజెక్టుల కోసం రూ.17.2 లక్షల కోట్ల అప్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం బ్యాంకింగ్‌ రంగంపై పిడుగులా పడింది. ఈ భారీ అప్పుల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత దెబ్బతింటుందనే భయం మార్కెట్లో గుప్పుమంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్‌ షేర్లు 6 శాతం వరకు పతనమయ్యాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయి ఉండే సెక్యురిటీలను కొనుగోలు, అమ్మకాలు చేసేటపుడు వర్తించే పన్ను ఎస్‌టీటీ. దీనిని బడ్జెట్‌లో 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు. ఇక, ఆప్షన్స్‌ ప్రీమియంపై ఎస్‌టీటీని 0.15 శాతానికి పెంచారు. ఆ బైబ్యాక్స్‌ను మూలధన లాభాలుగా పరిగణిస్తూ పన్ను విధించారు.

కార్పొరేట్‌ ప్రమోటర్ల బైబ్యాక్‌లపై 22 శాతం, నాన్‌ కార్పొరేట్‌ ప్రమోటర్ల బైబ్యాక్‌పై 30 శాతం పన్నులు విధించారు. ఈ నిర్ణయంపై మార్కెట్‌ వర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లను నేరుగా దోచుకోవడమేనని మార్కెట్‌ నిపుణులు విమర్శిస్తున్నారు. వికసిత్‌ భారత్‌ వైపు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆ అడుగులు సామాన్య ఇన్వెస్టర్ల సమాధులపై వేస్తున్నారనే విమర్శలు పెరిగాయి. కార్పొరేట్‌ దిగ్గజాలకు రాజమార్గం వేస్తూ.. మధ్యతరగతి, చిన్న ఇన్వెస్టర్లను పన్నుల ఊబిలోకి నెట్టడం ఈ బడ్జెట్‌ ద్వారా స్పష్టం అయ్యిందని బ్రోకర్లు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -