Saturday, March 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలేబర్‌కోడ్‌లకు నిరసనగా ఏప్రిల్‌ 1న బ్లాక్‌ డే

లేబర్‌కోడ్‌లకు నిరసనగా ఏప్రిల్‌ 1న బ్లాక్‌ డే

- Advertisement -

అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి : కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యాలయం లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం వచ్చేనెల ఒకటి నుంచి నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేయనున్నట్టు గతేడాది నవంబర్‌ 21న నోటిఫికేషన్‌ జారీ చేసిందని గుర్తు చేశారు. ఇందుకు గాను జాయింట్‌ ప్లాట్‌ఫామ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్లు ఢిల్లీలో గురువారం సమావేశమై ఏప్రిల్‌ 1ని ”బ్లాక్‌ డే”గా నిర్వహిస్తూ దేశవ్యాప్త నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చాయి.

రాష్ట్రంలో వచ్చే నెల1న కలెక్టర్‌ కార్యాలయాలు, మండల, పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో ఆయా కార్మిక సంఘాల జెండాలతో పాటు నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు, నల్ల బ్యానర్లు, నల్ల ఫ్ల్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించాలని తెలిపాయి. హైదరాబాద్‌లో వైఎంసీఏ చౌరస్తా నుంచి లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం (అంజయ్య భవన్‌) వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి, లేబర్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్‌ యాదవ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాల్‌రాజ్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్‌. పద్మ, ఏఐయూటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి శివబాబు, రాష్ట్ర నాయకులు యాదయ్య, ఐఎఫ్‌టీయూ నగర కార్యదర్శి ప్రదీప్‌, రాష్ట్ర నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -