కాలకట్ హీరోస్‌పై ఘన విజయం
ప్రైమ్ వాలీబాల్ లీగ్ 4
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్‌ను ఆతిథ్య జట్టు హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ అదిరే విజయంతో ఆరంభించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన పీవీఎల్ సీజన్ 4 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్‌పై హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 15-12, 18-16, 18-16తో వరుస సెట్లలోనే కాలికట్ హీరోస్‌పై బ్లాక్‌హాక్స్ బ్లాక్‌బస్టర్ విక్టరీ నమోదు చేసింది.
ర్యాలీలలో ఆధిపత్యం చూపించిన బ్లాక్‌హాక్స్.. స్పైక్స్‌లో, సూపర్ పాయింట్ చాలెంజ్‌లో కాలికట్ హీరోస్‌ను చిత్తు చేసింది. పది జట్లు పోటీపడుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాల్గో సీజన్‌కు ఈ సారి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. దసరా రోజున జరిగిన ఆరంభ వేడుకలకు హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ సహా యజమాని, సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరై ఆటగాళ్లను, అభిమానులను అలరించాడు. హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ కెప్టెన్ పౌలో లమౌనియర్ (బ్రెజిల్) సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ నేడు తన రెండో మ్యాచ్‌లో ముంబయితో తలపడనుంది.