న్యూఢిల్లీ : ప్రయివేటు రంగ దేశీయ విత్త సంస్థ ఫెడరల్ బ్యాంకులో న్యూయార్క్‌కు చెందిన బ్లాక్‌స్టోన్ కంపెనీ 9.99 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం బ్లాక్‌స్టోన్ అనుబంధ ఆసియా2 టోప్కో13 ద్వారా రూ.6,196.51 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కోచ్చి కేంద్రంగా పని చేస్తోన్న ఫె˜డరల్ బ్యాంక్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా 272.97 మిలియన్ వారెంట్లను బ్లాక్‌స్టోన్‌కు జారీ చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఈ షేర్లను రూ.227 వద్ద విక్రయించనుంది. ఈ వారెంట్ల కింద ఫెడరల్ బ్యాంకులో బ్లాక్‌స్టోన్ వాటాను పొందనుంది. ఈ పెట్టుబడికి నియంత్రణ సంస్థలు ఆర్‌బిఐ, సెబీ సహా వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది. బ్లాక్‌స్టోన్ పెట్టుబడికి సంబంధించి నవంబర్ 19న ఫెడరల్ బ్యాంక్ అసాధారణ సమావేశం (ఇజిఎం) నిర్వహించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాంక్ బోర్డులో ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను బ్లాక్‌స్టోన్ నియమించుకోవడానికి వీలుంటుంది.



