Monday, January 19, 2026
E-PAPER
Homeకరీంనగర్అక్రమ టెండర్లకు ఆశీర్వాదం.. చిరు వ్యాపారులపై జరిమానా.!

అక్రమ టెండర్లకు ఆశీర్వాదం.. చిరు వ్యాపారులపై జరిమానా.!

- Advertisement -

-కొత్తపేటలో అక్రమ టెండర్ల నీడలో జరిమానాలు
-అక్రమ టెండర్లపై అధికారుల మౌనం
-చిన్న కిరాణంపై అక్రమ టెండర్ నిర్వాహకులు రూ.10 వేల ఫైన్
నవతెలంగాణ – రాయికల్

మండలంలోని కొత్తపేట గ్రామంలో నాలుగు నెలలుగా కొనసాగుతున్న అక్రమ టెండర్ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. విడిసి (విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ) పేరుతో లక్షల రూపాయల విలువైన టెండర్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో గ్రామంలోని ఓ చిన్న కిరాణా దుకాణదారుడు కూల్‌డ్రింక్స్ విక్రయించాడన్న కారణంతో రూ.10,000 జరిమానా విధించినట్లు ప్రచారం జరగడంతో గ్రామంలోని చిన్న వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.

-అక్రమ టెండర్లపై చర్యలేవీ 
గ్రామంలో పెట్రోల్ విక్రయాలు, కూల్‌డ్రింక్స్, బెల్ట్ షాపులు, చికెన్ విక్రయాలు, గుడుంబా అమ్మకాలు, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలకు విడిసి ద్వారా టెండర్లు వేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ టెండర్లు ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా నిర్వహించారని, లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం మౌనం పాటిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. విడిసి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. ఒక్క అధికారిక విచారణ, నోటీసు ప్రకటన కూడా లేకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. “ఇది నిర్లక్ష్యమా? లేక అక్రమాలకు మౌన సహకారమా?” అన్న చర్చ మండలవ్యాప్తంగా సాగుతోంది.

-చిన్న వ్యాపారిపై భారీ జరిమానా
అక్రమ టెండర్లపై చర్యలు లేకపోవడం ఒకవైపు ఉంటే.. మరోవైపు గ్రామంలోని ఓ చిన్న కిరాణా దుకాణంలో కూల్‌డ్రింక్స్ అమ్మకాలు నిర్వహించాడన్న కారణంతో అక్రమ టెండర్ నిర్వాహకులు రూ.10,000 జరిమానా విధించినట్లు ప్రచారం జరగడం ప్రజలను విస్మయానికి గురి చేసింది.

గుడుంబా అమ్మకాలు..ఎక్సైజ్ శాఖ వైఫల్యం?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుడుంబా తయారీ, విక్రయాలు పూర్తిగా నిషేధితమైనప్పటికీ, కొత్తపేట గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో బహిరంగంగా అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గుడుంబా విక్రయాలకు టెండర్ల స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ అంశంపై ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. “ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎవరిపై చర్యలు తీసుకున్నారు?” అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు.

మండల వ్యాప్తంగా అక్రమ గుడుంబా విక్రయాలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? అక్రమ టెండర్ నిర్వాహకులు చిన్న వ్యాపారిపై విధించిన రూ.10,000 జరిమానా ఏ నిబంధన ప్రకారం.? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటివరకు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి సమాధానాలు రాకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది.

-చట్టం అందరికీ సమానమా?
లక్షల రూపాయల అక్రమ టెండర్లకు చర్యలు లేకపోవడం, చిన్న వ్యాపారులపై అక్రమ టెండర్ నిర్వాహకులు మాత్రం కఠినంగా వ్యవహరించడంతో చట్టం బలహీనులకేనా.? అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. చిన్న వ్యాపారులను భయపెట్టేందుకే జరిమానాలు విధిస్తున్నారా.? అక్రమాలకు పాల్పడిన పెద్దలను కాపాడేందుకే అధికారుల మౌనమా.? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

-సమగ్ర విచారణకు డిమాండ్
ఈ వ్యవహారంపై వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, అక్రమ టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలని, విడిసి లావాదేవీలను పూర్తిగా పరిశీలించాలని, గుడుంబా విక్రయాలపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చిన్న వ్యాపారులపై విధించిన జరిమానాల న్యాయబద్ధతను కూడా స్పష్టంగా వెల్లడించాలని కోరుతున్నారు.

 అప్పో, సప్పో చేసి చిన్నచిన్న కిరాణాదుకాణాలు పెట్టుకున్న వారి పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా చిరు వ్యాపారుల పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు. కొత్తపేటలో అక్రమ టెండర్లు, గుడుంబా వ్యాపారం, ఎంపిక చేసిన జరిమానాలపై అధికారుల మౌనం ఎంతకాలం కొనసాగుతుందో.?

ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు వస్తాయో.? అన్నది వేచి చూడాల్సిందే..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -