జవహర్‌లాల్ నెహ్రూ దేశ రాజకీయాలకూ, భారతీయ సమాజానికీ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేసేవారు, గొప్ప స్ఫూర్తి నందిస్తుండేవారు. సర్ వాల్టర్ క్రూకర్ నెహ్రూ గురించి ఏం చెప్పారంటే- ”నెహ్రూజీ ఒక అసాధారణమైన వ్యక్తి! అలాంటి మేధావులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. ఆయన చొరవ లేని, ఆయన ప్రభావం లేని వ్యవస్థ లేవీ దేశంలో లేవు. అందుకే ప్రతి అంశంలో, ప్రతి విభాగంలో ఆయన భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది” అని! నెహ్రూజీ జీవిత చరిత్ర రాసిన సర్ వాల్టర్ క్రూకర్ (1902 – 2002) రచయిత, విద్యావేత్త. రాయబారిగా, దక్షిణ ఆస్ట్రేలియాకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసినవారు. ”నెహ్రూ: ఎ కాంటెంపోరరీస్ ఎస్టిమేట్ (1966) శీర్షికతో ఆయన రాసిన గ్రంథం ప్రపంచ పాఠకుల్ని అమితంగా ఆకర్షించింది. ఇన్నేళ్ల తర్వాత ఆయన భాగస్వామ్యాన్ని మరిపించాలి అనే ప్రయత్నం చేయడం పెద్ద తప్పు – అంతేకాదు, చాలా నీచమైన పని! అలాంటి కుట్రదారుల్ని పసిగట్టి ఈ దేశ ప్రజలు కఠినంగా శిక్షిస్తారు. తప్పదు! చెట్టు వేళ్లను నాశనం చేసి, చెట్టు పచ్చగా బతకాలనుకోవడం మూర్ఖత్వం కాక మరేమవుతుందీ? నెహ్రూ కృషి గురించి హేళనగా మాట్లాడుతున్నవారు, తమ తప్పిదాల్ని నెహ్రూపైకి నెట్టేస్తూ గొప్పపని చేశామని భుజాలు ఎగరేసుకుంటున్నారు.
అదొక కుట్ర – కుతంత్రమనే దేశ ప్రజలు భావిస్తున్నారు. నెహ్రూ స్థాయిని అర్థం చేసుకోవాలంటే ఇంతో, అంత జ్ఞానముండాలి. జ్ఞానహీనులు, అజ్ఞానులు, అవివేకులు జ్ఞానమంటే ఏమిటో కూడా తెలుసుకోలేరు కదా? అందువల్ల అధికారం వెలగబెడుతున్న నేటి పాలకులకు నెహ్రూజీని అర్ధం చేసుకోగలిగే తెలివి లేదనుకోవాలి. ఇది వీరి తప్పిదమే తప్ప, భారత తొలి ప్రధానిది కాదు. నెహ్రూజీ సైన్సుకు అత్యంత ప్రాముఖ్యమిచ్చారు. అదే పేదరికానికి, ఆకలికి సమాధానం చెపుతుందని భావించారు. వైజ్ఞానిక స్పృహను పెంచడం, విద్యావంతుల శాతాన్ని పెంచడం తన లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. విద్యావంతులు పెరిగితేనే సంస్కృతీ సంప్రదాయాల పేరుతో దేశంలో కొనసాగుతున్న మూఢ నమ్మకాల్ని తగ్గించగలమని ఆయన గట్టిగా నమ్మారు. ఆ దిశలో ఆయన హోమి. జె. బాబా, సర్ సి.వి. రామన్, సతీష్ ధావన్, నళినీ రంజన్ సర్కార్, జె.సి. ఘోష్, మేఘానంద్ సాహా, యస్.యస్. భట్నాగర్ వంటి ఆనాటి శాస్త్రవేత్తల్ని పోత్సహించారు. వారికి తగిన స్వేచ్ఛనిచ్చారు. అవసరమైన ప్రభుత్వ నిధులు ప్రకటించారు. ఫలితంగానే గర్వించగలిగిన వైజ్ఞానిక పరిశోధనాశాలలు ఈ దేశం స్థాపించుకోగలిగింది.
అవి దేశ సాంకేతిక పురోగతికి ఉపయోగపడ్డాయి కూడా! అప్పట్లో ఆయనకు వైజ్ఞానిక సలహాదారుగా ఉన్న నోబెల్ గ్రహీత, బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త పాట్రిక్ బ్లాకెట్ సలహా సంప్రదింపులతో భారతీయ రక్షణ వ్యవస్థను పటిష్టం చేశారు. అప్పటి ఆ మౌలిక సూత్రాల ఆధారంగానే నేటికీ మన రక్షణ వ్యవస్థ నిర్వహణ ఇంకా కొనసాగుతూ ఉంది. వైజ్ఞానిక స్పృహను రాజ్యాంగంలో చేర్పించడం, నిజ నిర్ధారణకు నిలబడే తర్కబద్ధ మైన జ్ఞానం కోసం పౌరులందరూ కృషి చేయాలనడం నెహ్రూ జీ లక్ష్యాలలో ప్రధానమైంది. ఇది ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి నచ్చడం లేదు. వీరికి గుళ్లు తిరుగుతూ పూజలు చేయడం, భ్రమల్లో బతకడం అలవాటు. పైగా తాము ‘ఓటు చోరీ’ చేసి అక్రమంగా అధికారంలోకి వచ్చామన్నది మరిచి, తమకు డైరెక్ట్‌గా ఆ దేవుడితో సంబంధం ఉందని ప్రకటించుకుంటారు? నెహ్రూ తనకు తానే ‘భారతరత్న’కు నామినేట్ చేసుకున్నాడని – నేటి అధికార పువ్వు పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తుంటారు. ”ప్రొటోకాల్‌నీ పక్కనపెట్టి. తనంతట తానుగా నెహ్రూజీకి భారతరత్న ప్రకటించాను” అని నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇచ్చిన వివరణను, ప్రెస్ స్టేట్‌మెంట్‌ను వీరు కావాలనే దాచేస్తారు.
దేశ ప్రజలకు నిజాలు చెప్పరు. అయినా దేశప్రజల్లో వివేకం పెరిగింది. నిజమేదో, అబద్ధమేదో వారు తెలుసుకోగలుగుతున్నారు. ఇవన్నీ కాకుండా పాఠ్యపుస్తకాల్లోంచి నెహ్రూను మాయం చేయడం తప్పుగా నిరసించాల్సిన విషయం! అంటే, భావితరాలకు తొలి భారత ప్రధాని ఎవరో, ఆయనేం చేశారో తెలియకుండా చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతూ ఉంది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఒక మహోన్నతుణ్ణి గౌరవించకపోగా, దుర్మార్గుడిగా చిత్రిస్తున్నారు. అసలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని ఈ అంధ భక్తులు, తామే నిజమైన దేశభక్తులమని తమకు తామే ప్రశంసలు గుప్పించుకుంటున్నారు. దీనితో, వీరి నిజాయితీ ఏ పాటిదో వారికి వారే ప్రపంచానికి తెలియ పరుచుకున్నారన్న మాట! ఇక కాశ్మీరు సమస్య కూడా ”నెహ్రూ తప్పిదమే’ అని చెప్పే నేటి పాలకులు కావాలనే నెహ్రూ ప్రకటించిన అభిప్రాయాన్ని కప్పిపుచ్చుతారు. 2 జనవరి 1952న కలకత్తా పత్రిక ‘అమృత్ బజార్’లో నాటి భారత ప్రధాని పండిట్ నెహ్రూ కశ్మీరు గురించి ఇలా ప్రకటించారు. ”కశ్మీరు అనేది ఇండియా, పాకిస్తాన్ దేశాల ఆస్తికాదు. అది కశ్మీరు ప్రజలది మాత్రమే. కశ్మీరు భారతదేశంలో విలీనమయ్యే సమయంలో ‘ప్రజాభిప్రాయ సేకరణ’కి కట్టుబడి ఉంటామని మనం కశ్మీరు ప్రజలకు, నాయకులకూ స్పష్టం చేశాం. వారు మనల్ని విడిచిపెట్టి వెళ్లాలని కోరుకున్నప్పుడు – మనం కశ్మీరును వదిలి రావడానికి వెనుకాడగూడదు.
ఈ విషయాన్ని మనం ఐక్య రాజ్య సమితి (యుఎన్‌ఓ) దృష్టికి తీసుకెళ్లాం కూడా! శాంతియుత పరిష్కారానికై మాట ఇచ్చాము. ఒక గొప్ప దేశంగా మనం ఆనాడు వారికి ఇచ్చిన మాట నుండి వెనక్కి వెళ్లలేం. మాట తప్పలేం. అంతిమ నిర్ణయం కశ్మీరు ప్రజలకే వదిలేశాం. మనం వారి నిర్ణయానికే కట్టుబడి ఉండాలి!” – ఇదిఅప్పటి ఒప్పందం! ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకుల వలె నెహ్రూ ఎప్పుడూ ప్రజలను మోసం చేయలేదు. ఒకటి చెప్పి, ఒకటి చేసే ప్రవృత్తి ఆయనది కాదు- భారతదేశ రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్కువగా మాట్లాడరు. కానీ, మరి మోడీ జీ మంత్రివర్గంలో ఉండి అప్పుడప్పుడు అబద్దాలు మాట్లాడకుండా, అనవసరమైన పనులు చేయకుండా ఎలా ఉండగలరు? రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు తెప్పించుకున్నప్పుడు నిమ్మకాయలు కోసి, కొబ్బరికాయలు కొట్టి పూజ చేసినప్పుడు – పూజలతో యుద్ధ విమానాలకు శక్తి పెరుగుతుందా? అని పెద్దఎత్తున విమర్శలకు గురయ్యారు. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో ‘మా దగ్గర సుదర్శన చక్రం ఉంది’ అని ప్రకటించినప్పుడు కూడా దేశ ప్రజలు నవ్వుకున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆ మధ్య నెహ్రూజీ గురించి ఒక పెద్ద అబద్దం చెప్పారు. ”నెహ్రూజీ బాబ్రీ మసీదుకు డబ్బు ఇవ్వాలనుకున్నారు. కానీ, సర్దార్ పటేల్ ఇవొద్దని అడ్డుకున్నారు.. అందుకని తర్వాత కాలంలో నెహ్రూ జీ సోమనాథ్ మందిర్‌కు డబ్బులు ఇవ్వనని చెప్పారు” అని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉండి, అబద్దాలు చెపుతూ నేటి ఈ దేశ నాయకులు తమ గౌరవం తామే పోగొట్టుకుంటున్నారు. ఆలోచించి చూడండి. సర్దార్ పటేల్ డిసెంబర్ 1950లో కన్నుమూశారు. నెహ్రూజీ మే 1964 లో తనువు చాలించారు. మరి బాబ్రీ మసీదు సమస్య ఉధృతమైంది ఎప్పుడూ? 1990లలో కదా లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రతో ఊపందుకుంది? ఆ తర్వాత కరసేవ వగైరా కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే బాబ్రీ మసీదుకు నెహ్రూ డబ్బులిస్తాననడం, పటేల్ అడ్డుకోవడం – వంటి వ్యాఖ్యలు హాసాస్పదంగా ఉన్నాయి. పైగా నెహ్రూ మైనార్టీలైన ముస్లింల పట్ల ప్రేమ కురిపించేవాడని అక్కసు. ఆయనకు ముస్లిం వారసత్వం అంటగట్టడానికి చేసే కుట్ర- రాజ్‌నాధ్‌సింగ్ మాటల్లో ద్యోతకమవుతోంది.
మరొముఖమైన విషయమేమంటే నెహ్రూకు ఎదురు చెప్పే గుండె ధైర్యం సర్దార్ పటేల్‌కు లేదు. నెహ్రూ మంత్రి వర్గంలో పటేల్ ఓ మంత్రి మాత్రమే! వయసులో పెద్దవాడయినప్పటికీ పటేల్, నెహ్రూ పట్ల వినమ్రంగా ఉండేవాడు. పటేల్ నెహ్రూని అడ్డగించడం అనేది నూటికి నూరుపాళ్లు అబద్దం. పటేల్ గుజరాత్ వాడైనందు వల్ల బీజేపీ వారు ఆయన విగ్రహం పెట్టుకుని ఆయన పాట పాడుతుంటారు. వాస్తవానికి పటేల్ కాంగ్రెస్ నాయకుడు. నెహ్రూకు విధేయుడు. ఎక్కడెక్కడి విషయాలో తెచ్చి, అర్థం లేకుండా మాట్లాడడం నేటి మన దేశనాయకులకు అలవాటు. ఇక సోమనాథ్ మందిరం వివాదం ఇటీవలిది కాదు. అది 1948 కంటే ముందుది. అప్పటికి గాంధీజీ ఉన్నారు. ‘సోమనాథ్ మందిరం ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజలు ఇచ్చే చందాలతో కట్టాలని’ గాంధీజీయే సూచించారు. నెహ్రూగాని, పటేల్ గానీ ఎవరూ ఇక ఆ విషయంలో జోక్యం చేసుకోలేదు. నెహ్రూ ప్రధానిగా ఆ మందిరానికి నిధులు విడుదల చేసే అవసరమే రాలేదు. కాబట్టి సోమనాథ్ మందిరానికి నెహ్రూ డబ్బులివ్వనన్నాడనేది – కేవలం అబద్ధం! నెహ్రూను ప్రతి విషయంలో తక్కువ చేసి మాట్లాడడం బీజేపీ వారికి కావాలి. అవసరం ఉన్నా, లేకపోయినా ఆయన పేరు తలవంది వీరికి పూటగడవదు.
దేశంలో బాబ్రీ మసీదును బీజేపీ ఒక సమస్యగా తయారు చేసిన నాటికి నెహ్రూజీ బతికేలేడు కదా? కొంచెం ఇంగిత జ్ఞానంతో అవలోకించాల్సి ఉంటుంది. మరి ఆ ఇంగిత జ్ఞానమే లేని వారి మాటలు మనమెందుకు పట్టించుకోవాలి? అంటే- అవసరం లేదు. మూర్ఖపు వ్యాఖ్యలు అని వదిలేయవచ్చు. కానీ, ముఖ్య మైన పదవుల్లో ఉన్నవారి మాటలకు సామాన్యులు కొందరు ప్రభావితులయ్యే ప్రమాదం ఉంది గనుక, మనం వాస్తవాల్ని వెలికి తీస్తూ ఉండాలి. నిజాల్ని నిలబెడుతూ ప్రచారంలో ఉంచాలి. బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ గేయం రాసి 150 ఏళ్లయిన సందర్భంగా 8 డిసెంబర్ 2025న లోక్‌సభలో ప్రధాని మోడీజీ మాట్లాడుతూ ”వందేమాతరం గీతాన్ని నెహ్రూ ముక్కలు చేశారు. దాని ఫలితంగా దేశం ముక్కలయ్యింది” అని ప్రకటించారు. పూర్తి నిజాలు దేశ ప్రజలకు వివరించకుండా నెహ్రూపై అభాండాలు వేశారు. అలా మాట్లాడడం, జాతిపిత గాంధీజీని, నాటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్‌ను, తొలిప్రధాని నెహ్రూను, మౌలానా ఆజాద్‌ను, సుభాష్ చంద్రబోసు, ఆచార్య దేవ్‌ను, విశ్వకవి రవీంద్రనాద్ టాగూర్‌ను అవమాన పరిచినట్లయింది.
ఎందుకంటే, మన జాతీయ గీతంతో పాటు వందే మాతరాన్ని కూడా జాతీయ గేయంగా గుర్తించి ఆమోదముద్ర వేసింది వీరే! వారు గుర్తించింది కేవలం రెండు చరణాల గేయాన్ని. అందులో సుజలాం సుఫలాం అంటూ దేశ ఔన్నత్యం ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మోడీ సభలో చెప్పలేదు. 1882లో బంకిం ఫాసిస్ట్ ఆలోచనా ధోరణితో ‘ఆనంద్ మఠ్’ అనే నవల రాశాడు. అందులో ఈ రెండు చరణాలకు తోడుగా మరో మూడు చరణాలు జత చేశాడు. ఆ మూడు చరణాలు దేవి/దుర్గ/ కాళి మాతాకు సంబంధించిన స్తుతి, స్తోత్రం వగైరా. ఈ మూడు చరణాలు జాతీయ గేయంగా గుర్తింపబడినవి కావు. 1875లో రాసిన ఆ మొదటి రెండు చరణాలకే 150 ఏళ్లు పూర్తయ్యాయి. తర్వాత నవల కోసం రాసిన మూడు చరణాలకు 150 ఏళ్లు రావాలంటే 2032 రావాలి. వాస్తవం ఇదయితే, పనిగట్టుకుని నెహ్రూను దూషించడానికి పూనుకోవడం మంచి పద్ధతా? వందేమాతం ముక్కలు కావడానికి గానీ, దేశం ముక్కలు కావడానికి గానీ నెహ్రూ కారణమేకాదు. మాట్లాడితే నాటి హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌ల గురించి మాట్లాడాలి. అంతటి నిజాయితీ, గుండె ధైర్యం లేకపాయె – ప్రధాని పదవిలో ఉండి అలవోకగా అబద్దాలాడడం మన టెలిప్రాంప్టర్ రీడర్‌కు అలవాటేమో గానీ, విని భరిస్తూ ఉండడం ఈ దేశ ప్రజలకు అలవాటు లేదు. వారు సత్యాన్వేషణకు పూనుకుంటూనే ఉంటారు!
-నేషనల్ బుక్‌ట్రస్ట్ పూర్వ సలహా సంఘ సభ్యుడు, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు



