- Advertisement -
తెలిమంచు …
పొరలచాటున తేలియాడే పచ్చటితేయాకు డోలికలిప్పుడు
అర్తనాదాల అందెలసవ్వడితో లయతప్పాయి
నుదుటి సిందూరమల్లే …
ప్రజ్విలించే కుంకుమపూల రెక్కలిప్పుడు
అతివల సౌభాగ్యాలను హరించిన
దాష్టీకానికి సాక్ష్యాల య్యాయి
మలయసమీరాలను కన్న.. తరులు గిరులిప్పుడు
మతోన్మాదుల మారణహౌమానికి సెగలుగక్కుతున్నాయి
ఓ…అందాల కాశ్మీరమా!
అవనిపై వెలిసిన అద్భుత శిఖరాగ్రమా!!
మానవత్వమే లేని మగాలను మట్టుపెట్టగ
మరణమదంగమై గర్జించవా!
ముష్కరుల మదమణచగ గాండీవమై కదంతొక్కవా!!
సౌబ్రాతత్వాన్ని పటిష్టపరచగా
సంఘటిత కేతమమెగరేయవా!!!
- అయిత అనిత, జగిత్యాల
- Advertisement -